తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. గుర్రుగా సొంత పార్టీ నేతలు

ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. గుర్రుగా సొంత పార్టీ నేతలు

HT Telugu Desk HT Telugu

26 March 2024, 11:19 IST

google News
    • ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ వేడి పెరుగుతోంది. ఒకపక్క వేసవి వేడి, మరోపక్క రాజకీయ వేడితో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతోంది.
ఈనెలలోనే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఈనెలలోనే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ( Tharun Vinny)

ఈనెలలోనే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

తెలుగులో ఒక సామెత ఉంది. అందిరి నోట్లో నానే సామెత. ఇంట్లో ఉన్న కూర కంటే, పొరుగింటి పుల్ల కూరే రుచిగా ఆరగిస్తాం. ఈ సామెత సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకు సరిపోలే విధంగా ఉంది. ఈ పొరుగింటి పుల్ల కూర సామెత టిడిపి అధినేత చంద్రబాబుకు వర్తిస్తుంది.‌ ఎందుకంటే ఆయనకు‌ సొంత పార్టీ నేతలపై కంటే, ప్రత్యర్థి వైసీపీ నేతలంటే మక్కువ ఎక్కువగా కనిపిస్తోంది. ‌సొంత పార్టీలో సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వకుండా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులను తీవ్రంగా వ్యతిరేకించి, వారిపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు వంటి పదునైన విమర్శలు చేసిన చంద్రబాబు, మళ్లీ వాళ్లనే తన పార్టీలో చేర్చుకొని టిక్కెట్లు ఇవ్వడంతో సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్నారు.

పొత్తుల్లో కొన్ని, ఫిరాయింపు నేతలకు కొన్ని

జనసేన, బీజేపీతో టిడిపి‌ పొత్తు పెట్టుకోవడంతో, ఆ పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కోల్పోయింది. అంటే పొత్తు వల్ల ఎప్పటి నుంచో పార్టీలో ఉండి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అనేక ఇబ్బందులు ‌పడుతూ పార్టీని ఐదేళ్ల పాటు కాపాడుకున్న 39 మంది టిడిపి నేతలకు ఎమ్మెల్యే, ఎంపి‌ టిక్కెట్టు దక్కకుండా పోయింది.

మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో టిడిపి‌ నేతలు ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపి స్థానాలను కోల్పోవల్సి వచ్చింది. అంటే దాదాపు 50 స్థానాలను మొదటి నుంచి టిడిపి జెండా మోసిన నేతలు కోల్పోయారు. దాదాపు 30 శాతం సీట్లను‌ టిడిపి నేతలను కాదని, ఇతర పార్టీలకు చంద్రబాబు కట్టబెట్టారు.

ఇది ఆ పార్టీ శ్రేణులను తీవ్రంగా ‌బాధించే అంశమే. ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికార పార్టీ దాడులను ఎదుర్కొంటూ, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటున్న నేతలకు, తీరా ఎన్నికల వచ్చేసరికి టిక్కెట్ లేకుండా పోయింది. దీంతో చంద్రబాబుపై స్వంత పార్టీ నేతలు, కార్యకర్తలే గుర్రున ఉన్నారు. అధినేత తీరు పట్ల బయటకు చెప్పలేక, లోపల ఇముడ్చుకోలేక, మింగలేక, కక్కలేక టిడిపి శ్రేణులు ఆందోళనలో ఉన్నారు.‌

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వమని చెప్పిన చంద్రబాబు, వెంటనే ప్లేట్ ఫిరాయించి, వైసీపీ, బీజేపీ నుంచి వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన వారి కోసం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టారు.

అసలు సొంత పార్టీ నేతలకే కుటుంబానికి ఒక్క సీటని పేర్కొంటూ పరిటాల సునీత (పరిటాల శీరాంకి టిక్కెట్టు ఇవ్వలేదు), జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి (జెడి పవన్‌కు టిక్కెట్ ఇవ్వలేదు) కుటుంబానికి ఒక్క సీటు, చింతకాయల అయ్యన్నపాత్రుడి కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చిన చంద్రబాబు, వైసీపీ నుంచి వచ్చిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి మాత్రం ఎంపీ, ఎమ్మెల్యే రెండు‌ సీట్లు కేటాయించడం పట్ల టీడీపీ నేతల్లో అసంతృప్తి ‌తారాస్థాయికి చేరింది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు

చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, లావు శ్రీకృష్ణదేవరాయలుకి నరసరావుపేట ఎంపీ టిక్కెట్లును కట్టబెట్టారు. బీజేపీ నుంచి చేరిన బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ టికెట్, తన్నేటి కృష్ణప్రసాద్‌కి బాపట్ల ఎంపీ టిక్కెట్లను కట్టబెట్టారు. వైసీపీ నుంచి చేరిన‌ వేంరెడ్డి ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు, ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్, కొలుసు పార్థసారథికి నూజివీడు, వసంత కృష్ణప్రసాద్‌కి మైలవరం అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గుంతకల్లు నుంచి అవకాశం కల్పించనున్నారు. సత్యవేడు అసెంబ్లీ నియోజవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసిపి నుంచి టిడిపిలో చేరిన తరువాత ఆయనకు మళ్లీ సత్యవేడులోనే ఇచ్చారు.

అయితే టీడీసీ నుంచి వైసీపీలో చేరిన‌ ఒకరికి జగన్మోహన్ రెడ్డి కూడా టిక్కెట్ కేటాయించారు. వైసిపిలో చేరిన టిడిపి ఎంపి కేశినేని నానికి జగన్ విజయవాడ ఎంపి టిక్కెట్టు ఇచ్చారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి, కాపు సంక్షేమ అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య తనయుడు, ఆచంట నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. కానీ వారికి టిక్కెట్టు ఇవ్వలేదు. పార్టీ అధికారంలోక వచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఆయా నేతలు తెలిపారు.

జనసేన, బీజేపీలో ఇలా

ఇక జనసేనలో ఇటీవలే చేరిన‌ కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్టును పవన్ కళ్యాణ్ కేటాయించారు. ఇటీవలే టిడిపి నుంచి జనసేనలో చేరిన‌ మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు భీమవరం టిక్కెట్టు ఇచ్చారు.‌ వైసిపి నుంచి వచ్చిన వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం ఎంపి‌ టిక్కెట్టు‌ దాదాపు ఖరారు అయింది.

ఇక వైసిపి నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్‌కు తిరుపతి ఎంపి టిక్కెట్ ను ఆ పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఈయన ఉదయం పార్టీలో చేరారు. సాయంత్రం టిక్కెట్టు దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట, దగ్గుపాటి పురందేశ్వరికి రాజమండ్రి, వైసిపి నుంచి బిజెపిలో చేరిన కొత్తపల్లి గీతకు అరకు, టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపి టిక్కెట్లను బిజెపి ఇచ్చింది.

అయితే బిజెపి, జనసేన ఇతర పార్టీల నేతకు ఇచ్చాయంటే సబబే. ఆ పార్టీలకు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేదు. సరైన అభ్యర్థులే లేరు. వైసిపి ఒకరికి ఇచ్చిందంటే దానికొక అర్ధం ఉంది. ఎందుకంటే విజయవాడ ఎంపీ స్థానానికి 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వర ప్రసాద్, ఓటమి తరువాత క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆయన స్థానం ఖాళీగానే ఉంది. ఆ స్థానాన్ని కేశినేని నానితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారు.

కానీ టిడిపి పరిస్థితి అలా కాదు. అన్ని నియోజకవర్గంల్లో బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.‌ వైసిపి వాళ్లు టిడిపికి రాకపోతే, పోటీ చేయడానికి టిడిపికి అభ్యర్థులు లేరనే ప్రత్యర్థుల విమర్శలను తన వైఖరితో చంద్రబాబు నిజం చేశారు.‌ అధికారం లేక ఐదేళ్లుగా, అధికార పార్టీ నుంచి ఇబ్బందులు‌ ఎదుర్కొంటూ జెండాను మోసిన వారికి టిక్కెట్లు ఇవ్వకుండా, తమ పార్టీపై, అధినేతపై తీవ్ర విమర్శలు చేసి‌న పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంపై టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం