తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Polling Trend: అంతుచిక్కని ఏపీ ఓటరు అంతరంగం,భారీగా పోలింగ్‌తో రాజకీయ పార్టీలకు అందని నాడి

AP Polling Trend: అంతుచిక్కని ఏపీ ఓటరు అంతరంగం,భారీగా పోలింగ్‌తో రాజకీయ పార్టీలకు అందని నాడి

Sarath chandra.B HT Telugu

14 May 2024, 12:18 IST

google News
    • AP Polling Trend: ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ రాజకీయ పార్టీల అంచనాలకు అందడం లేదు. గెలుపుపై పార్టీలు వేటికవి ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం గుబులుగానే ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన పోలింగ్‌తో పార్టీల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన పోలింగ్‌తో పార్టీల్లో గుబులు (Lakshmi)

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన పోలింగ్‌తో పార్టీల్లో గుబులు

AP Polling Trend: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగానే పోలింగ్ నమోదైంది. 2014లో 78.41శాతం పోలింగ్ నమోదైతే, 2019లో 79.64శాతం పోలింగ్ నమోదైంది.

2014లో ఇలా…

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,67,21,608మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,82,54,651మంది పురుషులు, 1,84,63,770మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు మరో 3187మంది ఉన్నారు.

2014 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం ఓటర్లలో 1,43,78,804మంది పురుషులు, 1,44,12,652మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 157మంది ట్రాన్స్‌ జెండర్లు కూడాఓటు వేశారు. మొత్తం 2,87,91,613మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3,67,21,608 ఓట్లలో 2,87,91,613 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 78.41శాతం పోలింగ్ నమోదైంది.

2019లో పెరిగిన పోలింగ్‌, ఒక్కశాతంతో ఫలితాలు తారుమారు..

2019 ఎన్నికల నాటికి ఏపీలో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,94,62,339 మంది, 1,98,79,421మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 3957మంది ఉన్నారు.

2019 ఎన్నికల్లో 1,55,45,211మంది పురుషులు, 1,57,878,759మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 661మంది ట్రాన్స్‌ జెండర్లు కూడా ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 3,13, 33,631మంది ఓటు హక్కును వినియోగించుకున్న పోలింగ్ శాతం 79.65శాతంగా నమోదైంది. 2014లో పోలింగ్ శాతంతో పోలిస్తే 2019లో కేవలం ఒక్కశాతం పోలింగ్ మాత్రమే పెరిగింది. కానీ ఫలితాలు మాత్రం అనూహ్యంగా తారుమారయ్యాయి.

తాజా ఎన్నికల్లో...

2024 ఎన్నికల నాటికి ఏపీలో మొత్తం 4,09,37,532మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,84,276మంది, మహిళలు 2,08,49,730మంది ట్రాన్స్‌జెండర్లు 3,346మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసే నాటికి ప్రాథమిక అంచనాల్లో దాదాపు 78.65శాతం పోలింగ్‌ జరిగినట్టు గుర్తించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో తుది లెక్కలు ఖరారు కాలేదు. పోలింగ్ శాతం 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఉంటుందా, తగ్గుతుందా అనే దానిపై స్పష్టత రాలేదు.

మహిళా ఓటర్లే కీలకం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో మహిళలు బారులు తీరడం కనిపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు స్థిరపడ్డారు. వారిలో చాలామంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తరలి వచ్చారు.

మునుపెన్నడు లేని విధంగా హైదరాబాద్‌ నుంచి పోలింగ్ కోసమే వేల సంఖ్యలో వాహనాలు ఏపీలోని వివిధ జిల్లాలకు తరలి వచ్చాయి. ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓటర్లు తరలి వచ్చారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఓటర్లలో ఏపీ స్థానికత కలిగిన ఓటర్లు దాదాపు 25-30లక్షల మంది ఉంటారనే అంచనాలు ఉన్నాయి. వీరిలో చాలామందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. హైదరాబాద్‌ ఓటర్లపై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి పెట్టడంతో పోలింగ్ ఉత్సాహంగా జరిగింది.

ఎవరి లెక్కలు వారివే...

మహిళా ఓటర్లపై రాజకీయ పార్టీలు వేటికవే ధీమాతో ఉన్నాయి. తాము ఇస్తూన్న సంక్షేమ పథకాల లబ్దిదారులు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని అధికార పార్టీ నమ్మకంతో ఉంది. మరోవైపు టీడీపీ కూటమి కూడా పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని భావిస్తోంది.

పార్టీలన్ని పైకి బింకంగా ఉన్నా లోలోపల ఓటర్ల తీర్పు ఎలా ఉందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ 80శాతం దాటితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఆందోళన పార్టీల్లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.

ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతేనని టీడీపీ భాష్యం చెబుతోంది. మరోవైపు పోలింగ్ శాతం పెరగడంపై వైసీపీ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. వైసీపీ సానుకూల ఓట్లేనని ఆ పార్టీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

ఏపీలో అధికార వైసీపీ ఓ వైపు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. 2014లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో 2024 ఎన్నికల్లో కూడా కూటమి గెలపు ఖాయమని అవి భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం