CM Jagan : ఇష్టానుసారం అధికారుల బదిలీ, ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదు- సీఎం జగన్
06 May 2024, 21:50 IST
- CM Jagan : తనను లేకుండా చేసేందుకు కూటమి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదన్నారు.
సీఎం జగన్
CM Jagan : మచిలీపట్నం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని, తనను లేకుండా చేయాలనేదే కూటమి లక్ష్యమని ఆరోపించారు. అందుకే ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు. పేదల శత్రువులంతా ఏకమయ్యారని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలేనని మండిపడ్డారు. 14 ఏళ్ల పాలనతో చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు దుష్ప్రచారాలు మొదలుపెట్టారన్నారు. ఏపీకి 2 లక్షల కోట్ల డ్రగ్స్ తీసుకొచ్చామని ప్రచారం చేశారని, ఆ డ్రగ్స్ తెచ్చింది వదినమ్మ బంధువులేనని తేలిందన్నారు.
130 సార్లు బటన్ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు అందించాం
వైసీపీ పాలనలో 130 సార్లు బటన్‌లు నొక్కి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అందించామని సీఎం జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామన్నారు. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 6వ తరగతి నుంచే డిజిటన్ బోధన చేపట్టామన్నారు. ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన అందించామన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని జగన్ ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మల ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం,ఈబీసీ నేస్తం, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామన్నారు.
నిధుల విడుదలను అడ్డుకుంది చంద్రబాబే
ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. ఎవరి భూములపై వారికి హక్కులు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు. భూవివాదాలు పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ చట్టం తీసుకోస్తున్నామన్నారు. భూవివాదాలు లేకుండా ప్రభుత్వ గ్యారంటీతో సంస్కరణలు తీసుకురావాలనేదే వైసీపీ సర్కార్ ఉద్దేశమన్నారు. భూసర్వే పూర్తి చేసి రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. రైతులను భూహక్కు పత్రాలను అందిస్తామన్నారు. ఈ చట్టం గొప్పదని టీడీపీ నేతలే అసెంబ్లీ చెప్పారన్నారు. ఇలాంటి మంచి సంస్కరణను ఆపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తుంటే చంద్రబాబే కుట్రలు చేసిన అడ్డుకున్నారని ఆరోపించారు. తన మనిషి నిమ్మగడ్డతో ఈసీకి ఫిర్యాదు చేయించి పింఛన్ల పంపిణీ అడ్డుకున్నారన్నారు. అలాగే సంక్షేమ పథకాల నిధులు విడుదల కాకుంగా చంద్రబాబే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.