Yuvraj Singh: సచిన్ ఇచ్చిన ఆ సలహా వల్లే వరల్డ్ కప్ గెలిచాం: యువరాజ్ సింగ్
29 September 2023, 11:58 IST
- Yuvraj Singh: సచిన్ ఇచ్చిన సలహా వల్లే వరల్డ్ కప్ గెలిచామని యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అదే సలహాను ఇప్పుడూ పాటించాల్సిందిగా రోహిత్ సేనకు అతడు సూచించాడు.
యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
Yuvraj Singh: సచిన్ టెండూల్కర్ తన వరల్డ్ కప్ కలను 2011లో నెరవేర్చుకున్నాడు. అంతకుముందే ఐదు వరల్డ్ కప్ లు ఆడినా సాధ్యం కాని విజయం.. అతని చివరి వరల్డ్ కప్ లో సాధ్యమైంది. అయితే ఈ చారిత్రక విజయంలోనూ సచిన్ ఇచ్చిన సలహానే కీలకపాత్ర పోషించిందని అప్పుడు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన యువరాజ్ సింగ్ వెల్లడించాడు.
ఇప్పుడు స్వదేశంలో మరో వరల్డ్ కప్ గెలవాలని చూస్తున్న రోహిత్ శర్మ అండ్ టీమ్ కు కూడా యువరాజ్ అదే సలహా పాటించాలని సూచించాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో యువరాజ్, సచిన్ కీలకపాత్ర పోషించారు. సచిన్ ఆ టోర్నీలో ఇండియా తరఫున 482 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలవగా.. యువరాజ్ 362 రన్స్, 15 వికెట్లతో అదరగొట్టాడు.
చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోండి: యువరాజ్
అలాంటి యువరాజ్ సింగ్ ఇప్పటి టీమ్ కు కీలక సూచన చేశాడు. బయట అభిమానులు, మీడియా మాటలు వినకుండా చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని సచిన్ సూచించాడని యువీ గుర్తు చేసుకున్నాడు. "అప్పట్లో మా దృష్టి మరల్చడానికి ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా లేదు.
కానీ అప్పట్లో మీడియా, అభిమానులు అయితే ఉన్నారు. అయినా మేము ఆటపైనే దృష్టి పెట్టాలనుకున్నాం. కానీ వరల్డ్ కప్ లో మేము సౌతాఫ్రికాపై గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం. మీడియా మమ్మల్ని నిందించడం మొదలుపెట్టింది. అప్పుడు సచిన్ జట్టుతో కూర్చున్నాడు.
టీవీలు చూడటం మానేయండి.. పత్రికలు చదవకండి. జనాలు ఉన్న చోటికి వెళ్లినప్పుడు చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. కేవలం వరల్డ్ కప్ పై మాత్రమే దృష్టి పెట్టండి అని సచిన్ సలహా ఇచ్చాడు. దానికి టీమంతా అంగీకరించి అదే ఫాలో అయ్యాం" అని యువరాజ్ వెల్లడించాడు.
"ఎలాగూ చాలా ఒత్తిడి ఉంటుంది. ఇండియాతో వచ్చిన సమస్య ఏంటంటే.. కేవలం ఇండియానే గెలుస్తుందని అభిమానులు భావిస్తారు. ఇది పెద్ద వరల్డ్ కప్. ఎన్నో మంచి టీమ్స్ ఉంటాయి. అది సాధించాలంటే ముందున్న లక్ష్యాలపైనే దృష్టి సారించాలి" అని యువరాజ్ స్పష్టం చేశాడు.
అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండియన్ టీమ్ వామప్ మ్యాచ్ కోసం గువాహటి చేరుకుంది. అక్కడ శనివారం (సెప్టెంబర్ 30) ఇంగ్లండ్ తో తన తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడుతుంది.
టాపిక్