T20 World Cup 2024 Dates: 2024 టీ20 ప్రపంచకప్ డేట్స్ ఇవే.. పది వేదికల్లో: ఐసీసీ అధికారిక ప్రకటన
22 September 2023, 23:14 IST
- T20 World Cup 2024 Dates: 2024 టీ20 ప్రపంచకప్ తేదీలను ఐసీసీ ఖరారు చేసింది. ఈ టోర్నీ కోసం పది వేదికలను ఎంపిక చేసింది. ఆ వివరాలు ఇవే.
T20 World Cup 2024 Dates: 2024 టీ20 ప్రపంచకప్ డేట్స్ ఇవే.. ఏడు వేదికల్లో: ఐసీసీ అధికారిక ప్రకటన
T20 World Cup 2024 Dates: 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. వచ్చే ఏడాది వెస్టిండీస్ (కరీబియన్), అమెరికా సంయుక్త వేదికలుగా 2024 టీ20 ప్రపంచకప్ జరగనుంది. ప్రపంచకప్ మ్యాచ్‍లు తొలిసారి అమెరికాలో జరగనున్నాయి. కాగా, 2024 ప్రపంచకప్ టోర్నీ తేదీలను, వేదికలను ఐసీసీ నేడు (సెప్టెంబర్ 22) అధికారికంగా ప్రకటించింది.
2024 టీ20 ప్రపంచకప్ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 4వ తేదీన మొదలుకానుంది. జూన్ 30వ తేదీన ఫైనల్ జరగనుంది. ఈ వివరాలను ఐసీసీ నేడు ప్రకటించింది. వెస్టిండీస్(కరీబియన్)లోని అంటిగ్వా & బార్బుడా, బార్బొడాస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ & ది గ్రెనెడైన్స్, ట్రినిడాడ్ & టొబాగోలో ఈ 2024 ప్రపంచ కప్ మ్యాచ్‍లు జరగనున్నాయి. అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ ల్లో 2024 ప్రపంచకప్ మ్యాచ్‍లు జరగనున్నాయి. ఇలా.. వెస్టిండీస్‍లోని ఏడు, అమెరికాలోని మూడు వేదికల్లో 2024 ప్రపంచకప్ మ్యాచ్‍లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తంగా 20 జట్లు తలపడనున్నాయి.
2024 టీ20 ప్రపంచకప్‍లో 20 జట్ల మధ్య 10 వేదికల్లో మొత్తంగా 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. వీటిలో 39 మ్యాచ్‍ల వరకు కరీబియన్‍లోని ఏడు వెన్యూల్లో జరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని మూడు వేదికల్లో 16 మ్యాచ్‍లు జరగొచ్చు. 2024 టీ20 ప్రపంచకప్ పూర్తి మ్యాచ్‍ల షెడ్యూల్‍ను వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ ఖరారు చేసే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్‍లో 20 జట్లు పాల్గొననుండడం ఇదే తొలిసారి కానుంది. 2024 పొట్టి ప్రపంచకప్ టోర్నీలో 20 జట్లు నాలుగు గ్రూప్‍లుగా విడిపోయి.. తొలి రౌండ్‍లో మ్యాచ్‍లు ఆడతాయి. ప్రతీ గ్రూప్‍లో టాప్‍లో ఉన్న రెండు జట్లు సూపర్8 స్టేజ్‍కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఆ 8 జట్లు రెండు గ్రూప్‍లుగా విడిపోతాయి. ఆ రెండు గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‍లో తలపడతాయి. సెమీ ఫైనల్‍లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‍లో టైటిల్ కోసం తలపడతాయి.