తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Lsg: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు

SRH vs LSG: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు

08 May 2024, 21:33 IST

google News
    • SRH vs LSG IPL 2024: లక్నోను సన్‍రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఆయుష్ బదోనీ అర్ధ శతకంతో లక్నోకు మోస్తరు స్కోరు వచ్చింది.
SRH vs LSG: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు
SRH vs LSG: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు (PTI)

SRH vs LSG: లక్నోను కట్టడి చేసిన హైదరాబాద్.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్.. నితీశ్, సన్వీర్ సూపర్ క్యాచ్‍లు

SRH vs LSG IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో నేటి (మే 8) మ్యాచ్‍లో హైదరాబాద్ బౌలింగ్, ఫీల్డింగ్‍లో రాణించి లక్నోను కట్టడి చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో ఈ మ్యాచ్‍లో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది.

తడబడిన లక్నో

ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. క్వింటన్ డికాక్ (2), మార్కస్ స్టొయినిస్ (3)ను హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. దీంతో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది లక్నో. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా 33 బంతుల్లో 29 పరుగులే చేసి నెమ్మదిగా ఆడాడు. పదో ఓవర్లో ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లలో కేవలం 66 పరుగులే చేసింది లక్నో. కృనాల్ పాండ్యా (24) కూడా వేగంగా ఆడలేదు.

ఆదుకున్న ఆయుష్, పూరన్

లక్నో సూపర్ జెయింట్స్ యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనీ అజేయ అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. 30 బంతుల్లోనే అతడు 55 పరుగులు చేశాడు. 9 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. హిట్టర్ నికోలస్ పూరన్ కూడా పరిస్థితి తగ్గట్టు ఆడాడు. అయితే, చివర్లో దూకుడు పెంచాడు. 26 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు పూరన్. 52 బంతుల్లోనే వీరిద్దరూ అజేయంగా ఐదో వికెట్‍కు 99 పరుగులు జోడించి లక్నోకు పోరాడే స్కోరు అందించారు.

ఒక్క బౌండరీ ఇవ్వని భువీ

హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‍లో అద్భుత బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీశాడు. డికాక్, స్టొయినిస్‍ను పెవిలియన్‍కు పంపాడు. ఈ మ్యాచ్‍లో భువీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. బర్త్ డే బాయ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ తీసినా 47 పరుగులు సమర్పించేసుకున్నాడు. నటరాజన్ కూడా 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. అయితే, షాబాజ్ అహ్మద్, విజయకాంత్ వియాశ్‍కాంత్ పొదుపుగా బౌలింగ్ చేశారు. హైదరాబాద్ ముందు 166 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంది.

నితీశ్, సన్వీర్ కళ్లు చెదిరే క్యాచ్‍లు

ఈ మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్‍లో మెరిపించింది. మూడో ఓవర్లో హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్‍లో లక్నో బ్యాటర్ క్వింటన్ డికాక్ భారీ షాట్ కొట్టాడు. అయితే, బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టాడు నితీశ్ కుమార్ రెడ్డి. క్యాచ్ అందుకొని బౌండరీ లైన్ దాటే ప్రమాదం ఉండటంతో బంతిని ఎగరేసి.. మళ్లీ పట్టాడు నితీశ్. ఇక, హైదరాబాద్ యంగ్ ప్లేయర్ సన్వీర్ సింగ్ కూడా ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఐదో ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్‍లో లక్నో బ్యాటర్ స్టొయినిస్ ఇచ్చిన క్యాచ్‍ను మిడాన్‍లో సన్వీర్ అద్భుతంగా పట్టాడు. చాలా దూరం ముందుకు డైవ్ కొట్టి బంతిని అందుకున్నాడు.

తదుపరి వ్యాసం