Chandrayaan 3 - Sehwag: ‘వారికి నిద్రలేని రాత్రులే ఇక’: సెహ్వాగ్ ట్వీట్ వైరల్
23 August 2023, 22:08 IST
- Chandrayaan 3 - Virender Sehwag: చంద్రయాన్-3 విజయవంతం పట్ల భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశాడు. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
వీరేందర్ సెహ్వాగ్ (HT Photo)
Chandrayaan 3 - Virender Sehwag: చంద్రయాన్-3తో భారత దేశం అద్భుత విజయాన్ని సాధించింది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా (రష్యా, అమెరికా, చైనా తర్వాత) నిలిచింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను సేఫ్‍గా ల్యాండ్ చేసిన తొలి దేశంలో చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ, ఇస్రోను అభినందిస్తూ ప్రజలు, అన్ని రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ తనదైన రీతిలో ఈ విషయంపై ట్వీట్ చేశాడు. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివరాలివే..
చంద్రయాన్-3 సక్సెస్‍పై తనదైన మార్క్ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. ఈ మిషన్ వ్యతిరేకులకు చురకలు అంటించాడు. భారత్ విఫలమవ్వాలని దురాలోచన చేసిన కొందరికి ఇక నిద్రలేని రాత్రులు ఉంటాయని ట్వీట్ చేశాడు. “మనం సన్ సెట్ (సూర్యస్తమయానికి)కు సమీపిస్తుండగా.. చంద్రుడి దక్షిణ ధృవంపై మనం సెట్ అయ్యాం. ఎంత అద్భుతమైన సందర్భం. ప్రతీ ఎదురుదెబ్బ.. ఓ బలమైన పునరాగమనాన్ని చాటుతుందని నిరూపితమైంది. భారత్ విఫలమవ్వాలని ఆరోపణలు చేసే, వ్యతిరేకించే వారికి (అందులో కొందరు ఇండియాలోనే నివరిస్తున్నారు) కొన్ని నిద్రలేని రాత్రులు ఉండనున్నాయి” అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మొత్తంగా చంద్రయాన్-3 గురించి అవాకులుచవాకులు పేలిన వారికి సెహ్వాగ్ గట్టి కౌంటరే ఇచ్చాడు. సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది.
కాగా, చాలా మంది క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయవంతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత త్రివర్ణ పతకాన్ని అత్యున్నత స్థానంలో రెపరెపలాడించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని, సవాళ్లను ఎదుర్కొన్న తీరును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా.. జెండా ఊంఛా రహే హమారా’ అంటూ ట్వీట్ చేశాడు. చంద్రయాన్ 3ని సక్సెస్ చేసిన సోమ్‍నాథ్ టీమ్‍తో పాటు శివన్ నేతృత్వంలోని చంద్రయాన్ 2 టీమ్‍కు కూడా భారత్ తప్పకుండా అభినందనలు తెలపాలని కోరారు. “చంద్రుడిపై అయినా.. జీవితంలో అయినా.. ప్రతీ హార్డ్ ల్యాండింగ్.. సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు పాఠాలను ఇస్తుంది” అని సచిన్ పేర్కొన్నాడు.
చంద్రయాన్ 3 టీమ్‍కు అభినందనలు తెలిపాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. దేశం గర్వించేలా చేశారని ట్వీట్ చేశాడు. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరిన తొలి దేశంగా భారత్ నిలిచిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మనందరికి ఇది గర్వించదగ్గ సందర్భమని పేర్కొన్నాడు. ఇలా చాలా మంది ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు చంద్రయాన్-3 సక్సెస్‍పై ట్వీట్లు చేశారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశం గర్వించేలా అద్భుత విజయం సాధించిన ఇస్రోకు అభినందనలు తెలిపారు.