తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shreyas Iyer Injury: శ్రేయస్ అయ్యర్‌కీ గాయం.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు దూరం?

Shreyas Iyer Injury: శ్రేయస్ అయ్యర్‌కీ గాయం.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు దూరం?

Hari Prasad S HT Telugu

09 February 2024, 16:23 IST

    • Shreyas Iyer Injury: టీమిండియాను గాయాల బెడద వీడటం లేదు. తాజాగా మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా వెన్ను నొప్పితో ఇంగ్లండ్ తో జరగనున్న మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్ తో మిగిలిన టెస్టులకు దూరమవుతాడా
గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్ తో మిగిలిన టెస్టులకు దూరమవుతాడా (PTI)

గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్ తో మిగిలిన టెస్టులకు దూరమవుతాడా

Shreyas Iyer Injury: ఇంగ్లండ్ తో రెండో టెస్టు గెలిచి మూడో టెస్టు కోసం రెడీ అవుతున్న టీమిండియాను గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తొలి టెస్టు ఆడిన రాహుల్, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలంటూ వెళ్లిన విరాట్ కోహ్లి.. మిగిలిన సిరీస్ కు వస్తాడో రాడో తెలియడం లేదు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా మరోసారి వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

శ్రేయస్ మిగిలిన టెస్టులు ఆడతాడా?

గతేడాది వెన్ను నొప్పి కారణంగా చాలా రోజుల పాటు శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరంగా ఉన్నాడు. సర్జరీ కూడా చేయించుకున్నాడు. తర్వాత జట్టులోకి వచ్చి పరిమిత ఓవర్ల క్రికెట్ లో సత్తా చాటాడు. కానీ టెస్టుల్లో మాత్రం పదే పదే విఫలమవుతున్నాడు. 13 ఇన్నింగ్స్ గా శ్రేయస్.. కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో వెన్ను గాయం తిరగబెట్టడం అతన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేసింది.

ఇప్పటికే జట్టులోని మిగతా ప్లేయర్స్ కిట్స్ అన్నీ విశాఖపట్నం నుంచి మూడో టెస్టు జరిగే రాజ్‌కోట్ వెళ్లగా.. శ్రేయస్ కిట్ మాత్రం ముంబైకి చేరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు వెల్లడించింది. అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, తర్వాత నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రేయస్‌కు ఏమైంది?

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ మరోసారి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. 30 బంతులకు మించి ఆడిన తర్వాత ఇక వెన్నునొప్పి కారణంగా ఆడలేకపోతున్నానని, ముందుకు వంగి డిఫెన్స్ ఆడే సమయంలో గజ్జల్లోనూ నొప్పిగా ఉంటోందని శ్రేయస్ టీమ్ మేనేజ్‌మెంట్ కు సమాచారం ఇచ్చాడు. గతేడాది సర్జరీ తర్వాతే శ్రేయస్ ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

నిజానికి అతని వరుస వైఫల్యాల నేపథ్యంలో వెళ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడమని క్రికెట్ పండితులు సలహా ఇస్తున్నారు. అతన్ని జట్టులో నుంచి తొలగించాలన్న డిమాండ్లూ పెరుగుతున్నాయి. అదే సమయంలో గాయమంటూ శ్రేయస్ చెప్పడం చూస్తుంటే అదే నిజమా లేక పక్కన పెడుతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రజత్, సర్ఫరాజ్ ఉంటారా?

శ్రేయస్ అయ్యర్ గాయం, కోహ్లి గురించి ఇంకా ఏమీ తెలియకపోవడంతో టెస్టు జట్టులో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం కూడా రజత్ పటీదార్ దక్కించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి వస్తాడన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ అయ్యర్ మిస్ అయితే అతని నాలుగో స్థానంలో రాహుల్ రావడం ఖాయం.

జడేజా కూడా ఫిట్ గా ఉన్నట్లు అప్డేట్ ఇచ్చాడు. శుక్రవారం (ఫిబ్రవరి 9) రాత్రి మిగిలిన మూడు టెస్టులకు టీమ్ ఎంపిక ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బుమ్రాపై పనిభారాన్ని పరిశీలిస్తున్న బీసీసీఐ.. అతన్ని సిరీస్ లో కొనసాగిస్తుందా లేక విశ్రాంతినిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.

తదుపరి వ్యాసం