India vs Australia: తడబడిన భారత్.. ఆదుకున్న శ్రేయస్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే!
03 December 2023, 20:50 IST
- India vs Australia: ఆస్ట్రేలియాతో ఐదో టీ20లో భారత మోస్తరు స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్ అర్ధ శకతంతో రాణించాడు. దీంతో టీమిండియాకు పోరాడే స్కోరు దక్కింది.
శ్రేయస్ అయ్యర్
India vs Australia: ఆస్ట్రేలియాతో సిరీస్‍లో చివరిదైన ఐదో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా కాస్త తడబడింది. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 53 పరుగులు) అర్ధ శకతం చేసి భారత్‍కు పోరాడే స్కోరు అందించాడు. బెంగళూరు వేదికగా నేడు (డిసెంబర్ 3) జరుగుతున్న ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్‍కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది.
భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 31 పరుగులు), జితేశ్ శర్మ (16 బంతుల్లో 24 పరుగులు) చివర్లో రాణించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జేసన్ బెహరండాఫ్, డెన్ డార్షుస్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఆరో హార్డీ, నాథన్ ఎలిస్, తన్వీర్ సంఘా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ ముందు 161 పరుగుల టార్గెట్ ఉంది.
టాస్ ఓడి ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్‍కు దిగింది భారత్. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21) దూకుడుగా ఆరంభించినా నాలుగో ఓవర్లో పెవిలియన్ చేరాడు. రుతురాజ్ గైక్వాడ్ (10), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ (6) ఎక్కువసేపు నిలువలేకపోవటంతో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడబడింది భారత్. మరో ఎండ్‍లో శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడాడు.
శ్రేయస్‍కు జితేశ్ శర్మ కాసేపు సహకరించాడు. ఇద్దరూ పరుగుల వేగాన్నిపెంచారు. దీంతో భారత్ స్కోరు బోర్డు కాసేపు పరుగులు పెట్టింది. అయితే, భారీ షాట్ కొట్టబోయి 14వ ఓవర్లో ఔటయ్యాడు జితేశ్. ఆ తర్వాత అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించాడు. 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 బంతుల్లోనే 31 రన్స్ చేసి జోరు మీద కనిపించాడు. అయితే, 19వ ఓవర్లో ఆసీస్ పేసర్ బెహరండాఫ్ అతడిని ఔట్ చేశాడు. దూకుడు కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. మొత్తంగా శ్రేయస్, అయ్యర్ రాణించటంతో టీమిండియాకు 160 పరుగుల పోరాడే స్కోరు దక్కింది.
టాపిక్