Shoaib Akhtar on Ind vs Pak: బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై అక్తర్
16 October 2023, 12:20 IST
- Shoaib Akhtar on Ind vs Pak: బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు అంటూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విజయాన్ని ఇండియా రిపీట్ చేయబోతోందని కూడా అతడు స్పష్టం చేశాడు.
షోయబ్ అక్తర్
Shoaib Akhtar on Ind vs Pak: పాకిస్థాన్ ను ఇండియా చిత్తు చిత్తుగా ఓడించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అక్తర్.. బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టేశారని అనడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇండియా చాలా సులువుగా పాకిస్థాన్ ను 7 వికెట్లతో ఓడించిన విషయం తెలిసిందే.
మ్యాచ్ తర్వాత అక్తర్ మాట్లాడాడు. వెల్ డన్ ఇండియా అని అతడు అన్నాడు. "ఇండియా 2011 వరల్డ్ కప్ చరిత్రను రిపీట్ చేయనుందని నేను నమ్మడం మొదలుపెట్టాను. సెమీఫైనల్స్ లో తడబడకపోతే ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుంది. వెల్ డన్ ఇండియా. చాలా బాగా ఆడారు. మమ్మల్ని పూర్తిగా ఎడాపెడా బాదేశారు. మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. చాలా నిరాశాజనక ప్రదర్శన. పాకిస్థాన్ ను ఇండియా పూర్తిగా డామినేట్ చేసింది" అని అక్తర్ అన్నాడు.
"రోహిత్ శర్మ వన్ మ్యాన్ ఆర్మీ. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ ఎక్కడున్నాడో నాకు అర్థం కావడం లేదు. అతడు చాలా పెద్ద ప్లేయర్. అన్ని రకాల షాట్లు ఆడతాడు. పరిపూర్ణమైన బ్యాటర్. పరిపూర్ణమైన టీమ్. పాకిస్థాన్ అవమానకర రీతిలో ఓడింది. బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారు. నేను చూడలేకపోయాను. రోహిత్ నిర్దాక్షిణ్యంగా ఆడాడు" అని అక్తర్ అన్నాడు.
గత రెండేళ్లలో పాకిస్థాన్ బౌలింగ్ లో ఆడలేకపోయిన తాను.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడని కూడా రోహిత్ ను ఉద్దేశించి అక్తర్ అన్నాడు. "రోహిత్ తన ఇన్నింగ్స్ తో పాకిస్థాన్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. గత రెండేళ్లకు ప్రతీకారం తీర్చుకున్నాడు. రోహిత్ ఇలా ఆడటం, బౌలర్లను చితకబాదడం బాగుంది. చివరి వరకూ మ్యాచ్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? బౌలర్లను రోహిత్ ఆటాడుకున్నాడు" అని అక్తర్ చెప్పాడు.
పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. కేవలం 191 రన్స్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆ టార్గెట్ ను ఇండియా కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఈ విజయంతో ఇండియా పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.