Shakib Al Hasan: బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్.. ఆసియా కప్, వరల్డ్ కప్ అతని కెప్టెన్సీలోనే..
11 August 2023, 14:59 IST
- Shakib Al Hasan: బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఆసియా కప్, వరల్డ్ కప్ అతని కెప్టెన్సీలోనే ఆడనుంది. ఆ కొత్త కెప్టెన్ పేరు షకీబుల్ హసన్. తమీమ్ ఇక్బాల్ గాయపడటంతో బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
షకీబుల్ హసన్
Shakib Al Hasan: బంగ్లాదేశ్ టీమ్ కొత్త కెప్టెన్ గా షకీబుల్ హసన్ ను నియమించారు. ఆసియాకప్, వరల్డ్ కప్ అతని నేతృత్వంలోనే ఆ టీమ్ ఆడనుంది. శుక్రవారం (ఆగస్ట్ 11) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు కెప్టెన్సీ రేసులో షకీబ్, మెహదీ హసన్, లిటన్ దాస్ రేసులో ఉన్నట్లు బోర్డు వెల్లడించింది.
చివరికి సీనియర్ ప్లేయర్, ఇంతకుముందు కూడా కెప్టెన్ గా ఉన్న షకీబ్ కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే షకీబ్ బంగ్లా టీ20, టెస్ట్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ అతడు జట్టును లీడ్ చేయగలడా చూడాలి. గతేడాదే మహ్మదుల్లాను తప్పించి టీ20 టీమ్ కెప్టెన్సీ బాధ్యలను షకీబ్ కు అప్పగించారు.
ఇన్నాళ్లూ వన్డే టీమ్ కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బాల్ గాయపడిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు సడెన్ రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని మళ్లీ రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చాడు. ఆ వెంటనే గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కావడంతో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాల్సి వచ్చింది.
"బంగ్లాదేశ్ జట్టును ఆసియా కప్ తోపాటు న్యూజిలాండ్ సిరీస్, వరల్డ్ కప్ లలో షకీబుల్ హసన్ లీడ్ చేస్తాడు" అని నజ్ముల్ హసన్ వెల్లడించారు. ఇక ఆసియా కప్ కోసం శనివారం (ఆగస్ట్ 12) బంగ్లాదేశ్ జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న షకీబ్ తో తాను ఫోన్లో మాట్లాడానని, అతడు తిరిగి వచ్చిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తానని నజ్ముల్ చెప్పారు.
బంగ్లాదేశ్ లో సీనియర్ ప్లేయర్ షకీబుల్ హసన్. ఈ ఆల్ రౌండర్ ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటి వరకూ ఆ టీమ్ ను 52 వన్డేలు, 19 టెస్టులు, 39 టీ20ల్లో లీడ్ చేయడం విశేషం.