Rohit Sharma: టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డ్ రోహిత్‌దే - మూడో టీ20లో రోహిత్ శర్మ బ్రేక్ చేసిన రికార్డులు ఏవంటే?
18 January 2024, 7:52 IST
Rohit Sharma: అప్ఘానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్‌లో పలు రికార్డులను రోహిత్ బ్రేక్ చేశాడు. కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, మ్యాక్స్‌వెల్ రికార్డులను బద్దలుకొట్టాడు.
రోహిత్ శర్మ
Rohit Sharma: బుధవారం ఇండియా, అప్ఘనిస్థాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. క్రికెట్ లవర్స్‌కు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అఫ్ఘానిస్తాన్ చివరి వరకు గట్టిపోటీనిచ్చింది. తొలుత టై అయిన మ్యాచ్ ఆ తర్వాత సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్ కూడా టై కావడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సివచ్చింది. అందులో మాత్రం టీమిండియానే విజయం వరించింది. ఈ గెలుపుతో 3-0 తేడాతో టీ20 సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.
రోహిత్ సూపర్ సెంచరీ...
ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అతడితో పాటు జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా నిరాశపరిచారు. ఈ తరుణంలో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రోహిత్ అదరగొట్టాడు. 64 బాల్స్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 69 బాల్స్‌లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హయ్యెస్ట్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రోహిత్ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. రోహిత్‌కు ఇది ఐదో టీ20 సెంచరీ కావడం గమనార్హం. హయ్యెస్ట్ సెంచరీల లిస్ట్‌లో ఇదివరకు నాలుగు సెంచరీలతో రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మ్యాక్స్‌వెల్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్‌లను వెనక్కి నెట్టి ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లోకి చేరుకున్నాడు.
అత్యధిక సిక్స్‌ల రికార్డ్...
మూడో టీ20 మ్యాచ్ ద్వారా ఇంటర్‌నేషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డ్‌ను రోహిత్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా మోర్గాన్ టీ20ల్లో 86 సిక్స్‌లు కొట్టాడు. అప్ఘనిస్తాన్‌పై ఎనిమిది సిక్స్‌లు కొట్టిన రోహిత్... మొత్తంగా టీ20ల్లో 87 సిక్స్‌లతో మోర్గాన్ రికార్డ్‌ను అధిగమించాడు.
విరాట్ కోహ్లి రికార్డ్ బ్రేక్...
అప్ఘనిస్తాన్ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లి రికార్డ్‌ను కోహ్లి బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (1647 రన్స్) చేసిన ఇండియన్ కెప్టెన్ లిస్ట్‌లో రోహిత్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. గతంలో 1570 రన్స్‌తో ఈ లిస్ట్‌లో కోహ్లి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అప్ఘాన్ మ్యాచ్ ద్వారా కోహ్లిని రోహిత్ దాటేశాడు. ఈ జాబితాలో 1112 రన్స్‌తో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ ఫోర్త్ ప్లేస్...
అప్ఘానిస్థాన్‌పై రోహిత్ 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నాలుగో టీమిండియా క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో శుభమన్ గిల్ (126 రన్స్) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (123 రన్స్), విరాట్ కోహ్లి (122 పరుగులు) రెండు, మూడో స్థానంలో నిలిచారు.