Team India: ముగియనున్న ద్రవిడ్ కాంట్రాక్ట్.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍కు భారత కోచ్‍గా ఎవరంటే!
27 October 2023, 15:42 IST
- Team India: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍తో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు కూడా ముగియనుంది. కాగా, ఈ ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలోనే ఐదు టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా.
రాహుల్ ద్రవిడ్
Team India: స్వదేశంలో జరుగుతున్న ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అదరగొడుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‍ల్లో.. ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దిశానిర్దేశంలో భారత జట్టు.. వరల్డ్ కప్‍లో దూసుకెళుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‍ను చిత్తుచేసింది. సెమీస్ రేసులో దూసుకెళుతూ.. టైటిల్‍పై కన్నేసింది.
కాగా, ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍తో టీమిండియా హెడ్ కోచ్‍గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగుస్తుంది. నవంబర్ 2021లో హెడ్‍కోచ్‍గా వచ్చిన ద్రవిడ్ రెండేళ్ల కాంటాక్టు అయిపోతుంది. అయితే, పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కాగా, ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా ఐదు టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ సిరీస్ ఉండనుంది.
ప్రపంచకప్‍తో ద్రవిడ్ కాంట్రాక్టు పూర్తవనుండటంతో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‍కు ఎవరు హెడ్ కోచ్‍గా ఉంటారో బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. ఆసీస్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టుకు మాజీ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‍గా వ్యవహరించనున్నారు. ఇటీవల కూడా ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నప్పుడు జట్టుకు కోచ్‍గా వ్యవహించారు లక్ష్మణ్. ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ ఉండకపోతే.. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‍కు లక్ష్మణ్ హెడ్‍కోచ్‍గా ఉండనున్నాడు.
“రాహుల్ బ్రేక్ తీసుకున్న ప్రతీసారి వీవీఎస్ లక్ష్మణ్ ఇన్‍చార్జ్ గా వ్యవహరించారు. ప్రపంచకప్ అయిన తర్వాత వచ్చే సిరీస్‍కు కూడా ఇదే జరుగుతుంది” అని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. హెడ్ కోచ్ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ద్రవిడ్‍ను బీసీసీఐ అడుగుతోందట. ఒకవేళ ఇతరుల నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సి వస్తే హెడ్ కోచ్ పదవికి వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన పోటీదారుగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‍గా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ద్రవిడ్ విరామం తీసుకున్న సమయాల్లో టీమిండియాకు కోచ్‍గా ఉంటున్నారు.
ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‍లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. సూర్యకుమార్ యాదవ్‍ను ఈ సిరీస్‍కు కెప్టెన్‍గా నియమించే యోచనలో ఉంది.