WI vs AUS: వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన వెస్టిండీస్ - భారీ స్కోరుతో ప్రత్యర్థులకు వార్నింగ్
31 May 2024, 11:33 IST
WI vs AUS: టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్, రోమన్ పావెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 257 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పోరాడిన ఆస్ట్రేలియా 222 పరుగులు మాత్రమే చేసింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్
WI vs AUS: టీ20 వరల్డ్ కప్‌లో తమ దూకుడు ఎలా ఉంటుందో వార్మప్ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ ప్రత్యర్థులకు హింట్ ఇచ్చింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు తేడాతో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ చిత్తు చేశారు.
ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్‌తో పాటు రోమన్ పావెల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పోరాడిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేసింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
దంచికొట్టిన పూరన్, పావెల్
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్లు నికోలస్ పూరన్ 25 బాల్స్‌లో ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లతో 75 రన్స్ చేశాడు. రోమన్ పావెల్ 25 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి జోరుతో వెస్టిండీస్ తొమ్మిది ఓవర్లలోనే 130 పరుగులు చేసింది.
చివరలో రూథర్‌ఫోర్డ్ కూడా దంచికొట్టాడు. 18 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 48 పరుగులు చేసిన రూథర్‌ఫోర్డ్ నాటౌట్‌గా మిగిలాడు. ఓపెనర్ ఛార్లెస్ 40 పరుగులతో రాణించాడు. బ్యాట్స్‌మెన్స్ పోటీపడి పరుగులు చేయడంలో వెస్టిండీస్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశాడు.
వార్నర్ విఫలం...
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 222 పరుగులు మాత్రమే చేసింది. జోస్ ఇంగ్లీస్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లీస్ 30 బాల్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 55 రన్స్ చేశాడు. నాథన్ ఎల్లిస్ 39, ఆస్టన్ అగర్ 28, టిమ్ డేవిడ్ 25 పరుగులు చేశారు. డేవిర్ వార్నర్ 15, కెప్టెన్ మిచెల్ మార్ష్ నాలుగు పరుగులతో నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో గుడకేష్ మోతీ, అల్జరీ జోసెఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ప్రత్యర్థులకు వార్నింగ్...
వార్మర్ మ్యాచ్‌తోనే తమ బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో వెస్టిండీస్ చాటిచెప్పింది. ఇదే జోరును వరల్డ్ కప్ మ్యాచుల్లో చూపిస్తే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ సీలో న్యూజిలాండ్, అప్షనిస్తాన్, పపువా న్యూ గినియాలతో కలిసి వెస్టిండీస్ ఉంది.