Mitchel Marsh: చేతిలో బీరు సీసా.. కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీ.. ఇదేం పద్దతి మార్ష్?
20 November 2023, 11:40 IST
- Mitchel Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ అహంకారానికి ఈ ఫొటోనే నిదర్శనం. చేతిలో బీరు సీసా.. కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీతో మార్ష్ దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చేతిలో బీరు సీసా, కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్
Mitchel Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్స్ కు ఆరుసార్లు వరల్డ్ కప్ గెలిచిన అహంకారం తలకు బాగానే ఎక్కినట్లుంది. ఆ టీమ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ ఫైనల్ గెలిచిన తర్వాత అదే వరల్డ్ కప్ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని, చేతిలో బీరు సీసాతో కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత అహంకారం పనికి రాదంటూ నెటిజన్లు అతనికి క్లాస్ పీకుతున్నారు.
ఎవరైనా సరే వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే దానిని నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడతారు. ఆ ట్రోఫీని చూసుకొని మురిసిపోతారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇలా ఆ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని అవమానపరిచాడు. ఆరుసార్లు వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన అహంకారం కళ్లు నెత్తికెక్కేలా చేశాయంటూ అభిమానులు మార్ష్ పై మండిపడుతున్నారు.
ఆదివారం (నవంబర్ 19) ఫైనల్ ముగిసిన తర్వాత హోటల్ రూమ్ లో మార్ష్ ఇలా బీర్ తాగుతూ ట్రోఫీని కాళ్ల కింద పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది అభిమానులు ఇండియా గెలిచినప్పుడు మన ప్లేయర్స్ ఆ ట్రోఫీని ఎలా చూసుకున్నారో గుర్తు చేసుకుంటూ ఇదేం పద్ధతంటూ మార్ష్ తీరును తప్పుబట్టారు.
ట్రోఫీకి కనీస గౌరవం ఇవ్వకపోతే మీరు గెలిచినా ఓడినట్లే అని మరో యూజర్ కామెంట్ చేశాడు. అతనిపై నిషేధం విధించాలంటూ ఐసీసీని కోరుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఇలా అగౌరవపరచడానికి సిగ్గుండాలి అంటూ ఇంకో యూజర్ అన్నారు.
నిజానికి క్రికెట్ లో అహంకారానికి ఆస్ట్రేలియన్లు అసలు సిసలు నిదర్శనం. ప్రత్యర్థులను చిన్న చూపు చూడటం, ఫీల్డ్ లో నోటికి పని చెప్పడంలాంటివి చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో వాళ్ల గర్వం కాస్త తగ్గింది అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడీ ఫొటో మరోసారి దుమారం రేపుతోంది. కంగారూల తోక వంకరే అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
టాపిక్