PBKS vs DC: రిషబ్ పంత్ రీఎంట్రీ ఖాయమే! - ఢిల్లీ వర్సెస్ పంజాబ్… గెలుపు ఎవరిదో?
23 March 2024, 10:23 IST
PBKS vs DC: నేడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ దాదాపు పదిహేను నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఐపీఎల్ మ్యాచ్‌కు పంత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు.
రిషబ్ పంత్
PBKS vs DC: శనివారం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తలపడబోతున్నది. ఈ ఐపీఎల్ మ్యాచ్‌తో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా కెప్టెన్‌గా పునరాగమనం చేస్తోన్నాడు.
పదిహేను నెలల తర్వాత...
2022లో డిసెంబర్ 30న జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న పంత్ పదిహేను నెలల తర్వాత క్రికెట్ ఆడబోతున్నాడు. దాంతో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌కు పంత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాడు. అతడు ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు కూడా పంత్ బ్యాటింగ్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంత్ కెప్టెన్సీ...
పంత్ గాయంతో చాలా కాలం పాటు క్రికెట్ ఆడకున్న అతడిపైనే నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీలో మార్పు చేయలేదు. అతడికే సారథ్య బాధ్యతల్ని అప్పగించింది. బ్యాట్స్‌మెన్, కీపర్‌గానే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు కూడా పంత్‌పై ఉన్నాయి. ఈ ఒత్తిడిని పంత్ ఏ మేరకు అధిగమిస్తాడన్నది చూడాల్సిందే.
బలాబలాల పరంగా చూసుకుంటే ఢిల్లీ, పంజాబ్ జట్టు సమంగా ఉన్నాయి ఇప్పటివరకు ఐపీఎల్‌లో పంజాబ్, ఢిల్లీ 32 సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో పదహారు సార్లు ఇరు జట్లు విజయం సాధించాయి.
టాప్ ఆర్డర్ బలం...
బ్యాటింగ్‌లో ఢిల్లీ టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. పంత్‌తో పాటు డేవిడ్ వార్నర్, పృథ్వీషా, మిచెల్ మార్ష్ చెలరేగితో పంజాబ్‌కు కష్టాలు తప్పవు. స్టబ్స్, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం జట్టుకు కలిసొస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ , స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. నోర్జ్, ఇషాంత్ శర్మ, యశ్ దుల్ ఒకరికి ఫస్ట్ మ్యాచ్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
పంజాబ్ కింగ్ ధావన్...
పంజాబ్ కింగ్స్‌కు ధావన్ సారథిగా వ్యవహరిస్తోన్నాడు. గత ఏడాది శిఖర్ ధావన్ మినహా మిగిలిన వారు రాణించలేకపోవడంతో పంజాబ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ప్లేఆఫ్స్‌లోనే వెనుదిరిగింది. గత సీజన్ రిజల్ట్‌ను రిపీట్ కాకుండా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాలని పంజాబ్ భావిస్తోంది. పంజాబ్‌కు బ్యాటింగ్ పరంగా ధావన్‌తో పాటు జీతేన్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్, బెయిర్‌స్టో వెన్నుముకగా నిలవనున్నారు.
టాప్ క్లాస్ బౌలర్లు...
రబాడ, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లలో పంజాబ్‌లో ఉన్నారు. సికిందర్ రజా, సామ్ కరన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కేలా కనిపిస్తోంది. పంజాబ్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా చెలరేగితే ఢిల్లీ పై పంజాజ్ ఆధిపత్యం చెలాయించడం ఖాయమే.
పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌కు మొహాలి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది.