Mitchell Marsh: వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడతా.. తప్పేంటి?: మిచెల్ మార్ష్
01 December 2023, 11:35 IST
- Mitchell Marsh: వరల్డ్ కప్ ట్రోఫీపై మరోసారి కాళ్లు పెట్టమన్నా పెడతానని, అందులో తప్పేముందని అన్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీర్ తాగుతూ ట్రోఫీపై అతడు కాళ్లు పెట్టిన ఫొటోపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
చేతిలో బీరు సీసా, కాళ్ల కింద వరల్డ్ కప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్
Mitchell Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ తన వివాదాస్పద ఫొటోను డిఫెండ్ చేసుకోవడం విశేషం. చేతిలో బీరు సీసా పట్టుకొని, వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి అతడు దిగిన ఫొటో సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై మార్ష్ తొలిసారి స్పందించాడు.
అయితే వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంలో తప్పేముందని, మళ్లీ అలా చేయడానికి కూడా తాను వెనుకాడనని మిచెల్ మార్ష్ అనడం విశేషం. వరల్డ్ కప్ గెలిచిన రోజు రాత్రే ఈ ఘటన జరగగా.. రెండు వారాల తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ఈఎన్ రేడియోతో మాట్లాడుతూ మార్ష్ స్పందించాడు. ట్రోఫీని అగౌరవపరచాలన్న ఉద్దేశం తనకు లేదని అతడు అన్నాడు.
"ఆ ఫొటోలో అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. నాకు ఈ విషయం చాలా మంది చెప్పినా.. నేను సోషల్ మీడియా చూడలేదు. అందులో అసలు ఏమీ లేదు" అని మార్ష్ అనడం గమనార్హం. మరోసారి అలా కాళ్లు పెడతావా అని ప్రశ్నించగా.. అవకాశం వస్తే చేయొచ్చు అని మార్ష్ అన్నాడు.
వరల్డ్ కప్ ట్రోఫీని మార్ష్ అగౌరవపరిచాడంటూ ఉత్తర ప్రదేశ్ లో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఈ మధ్యే పండిట్ కేశవ్ దేవ్ అనే మరో వ్యక్తి కూడా అలీగఢ్ లోని ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని స్థానిక ఎస్పీ మృగాంక్ శేఖర్ చెప్పారు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మార్ష్ కు రెస్ట్ ఇచ్చారు.