తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Srh Ipl 2024: చివర్లో కుమ్మేసిన కమిన్స్.. హైదరాబాద్‍ను ఆదుకున్న కెప్టెన్

MI vs SRH IPL 2024: చివర్లో కుమ్మేసిన కమిన్స్.. హైదరాబాద్‍ను ఆదుకున్న కెప్టెన్

06 May 2024, 21:54 IST

google News
  • IPL 2024 MI vs SRH: సన్‍రైజర్స్ హైదరాబాద్‍ను ముంబై ఇండియన్స్ కట్టడి చేసింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‍లో మెరిశాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. చివర్లో కెప్టెన్ కమిన్స్ దుమ్మురేపటంతో హైదరాబాద్‍కు పోరాడే స్కోరే దక్కింది.  

MI vs SRH IPL 2024: కుమ్మేసిన కమిన్స్.. హైదరాబాద్‍ను ఆదుకున్న కెప్టెన్
MI vs SRH IPL 2024: కుమ్మేసిన కమిన్స్.. హైదరాబాద్‍ను ఆదుకున్న కెప్టెన్ (AP)

MI vs SRH IPL 2024: కుమ్మేసిన కమిన్స్.. హైదరాబాద్‍ను ఆదుకున్న కెప్టెన్

IPL 2024 MI vs SRH: ముంబై ఇండియన్స్‌తో పోరులో సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‍లో మోస్తరు స్కోరే చేసింది. వాంఖడే వేదికగా నేటి (మే 6) మ్యాచ్‍లో హైదరాబాద్‍ను ముంబై కట్టడి చేసింది. ఉప్పల్ వేదికగా గత నెల ముంబైతో జరిగిన మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో రెచ్చిపోయి రికార్డులు బద్దలుకొట్టిన ఎస్ఆర్‌హెచ్.. నేడు వాంఖడేలో ఆస్థాయిలో విజృంభించలేకపోయింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 పరుగులు నాటౌట్) చివర్లో సూపర్ బ్యాటింగ్‍తో ఆదుకున్నాడు. బౌలింగ్‍కు సహకరిస్తున్న పిచ్‍పై పోరాడేందుకు ఇది మంచి స్కోరే.

హెడ్ రాణించినా..

ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ముంబై ముందుగా హైదరాబాద్‍కు బ్యాటింగ్ ఇచ్చింది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 పరుగులతో మెరిపించాడు. 7 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. అయితే, ఫామ్‍లో ఉన్న అభిషేక్ శర్మ మాత్రం ఈ మ్యాచ్‍లో విఫలమయ్యాడు. 16 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఇబ్బందులు పడ్డాడు. ఆరో ఓవర్లో అభిషేక్‍ను ముంబై స్టార్ పేసర్ బుమ్రా ఔట్ చేశాడు. మరో ఎండ్‍లో హెడ్ దూకుడు కొనసాగించాడు. ఓ క్యాచ్ మిస్ ద్వారా అతడికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. అయితే, మయాంక్ అగర్వాల్ (5) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు.

అయితే, 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెడ్ కూడా వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20 పరుగులు) కీలక పరుగులు చేశాడు. అయితే 12వ ఓవర్లో హార్దిక్ పాండ్యా అతడిని ఔట్ చేశాడు. భీకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (2) కూడా 13వ ఓవర్లో ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా బౌలింగ్‍లో బౌల్డయ్యాడు. దీంతో 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది హైదరాబాద్.

కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17) కాసేపు నిలిచి పెవిలియన్ చేరారు. దీంతో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని అనుకున్న దశలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాట్‍తో సత్తాచాటాడు. 17 బంతుల్లోనే 35 పరుగులతో రెచ్చిపోయాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. అబ్దుల్ సమాద్ (3) విఫలమైనా.. చివరి వరకు కమిన్స్ కుమ్మేశాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో రాణించాడు. కమిన్స్ అదరగొట్టడంతో హైదరాబాద్‍కు 173 పరుగుల స్కోరు దక్కింది.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లతో అదరగొట్టారు. అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రాకు తలా ఓ వికెట్ దక్కింది. ముంబై ముందు 174 పరుగుల లక్ష్యం ఉంది. 

ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో 6 గెలిచి.. 4 ఓడిన హైదరాబాద్‍కు ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‍ చాలా కీలకంగా ఉంది. మరి ఈ ముఖ్యమైన పోరులో ముంబైను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయగలరో.. లేదో చూడాలి. ఇక 11 మ్యాచ్‍ల్లో ఇప్పటికే 8 ఓడిన ముంబై.. ఈ మ్యాచ్‍లో పరాజయం చెందితే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా ఔట్ అయినట్టే.

తదుపరి వ్యాసం