LLC 2023 Final: హర్భజన్ సింగ్ జట్టుకే టైటిల్.. ఫైనల్‍లో రైనా టీమ్ పరాజయం
09 December 2023, 23:01 IST
- LLC 2023 Final: ఎల్ఎల్‍సీ 2023 టోర్నీ టైటిల్‍ను మణిపాల్ టైగర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‍లో అర్బన్‍రైజర్స్ హైదరాబాద్‍పై గెలిచి.. ట్రోఫీ దక్కించుకుంది. వివరాలివే..
LLC 2023 Final: హర్భజన్ సింగ్ జట్టుకే టైటిల్.. ఫైనల్‍లో రైనా టీమ్ పరాజయం
LLC 2023 Final: లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‍సీ) 2023 టీ20 టోర్నమెంట్ టైటిల్‍ను మణిపాల్ టైగర్స్ దక్కించుకుంది. తుదిపోరులో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలోని మణిపాల్ టీమ్ సత్తాచాటింది. రిటైర్ అయిన ఆటగాళ్లతో ఆరు జట్లతో జరిగిన ఈ టోర్నీలో చివరికి టైటిల్ దక్కించుకుంది మణిపాల్. నేడు (నవంబర్ 9) సూరత్ వేదికగా జరిగిన ఎల్ఎల్‍సీ 2023 ఫైనల్‍లో మణిపాల్ టైగర్స్ జట్టు 5 వికెట్ల తేడాతో సురేశ్ రైనా సారథ్యంలోని అర్బన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‍పై విజయం సాధించింది.
ఈ ఫైనల్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అర్బన్‍రైజర్స్ హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ రిక్కీ క్లార్క్ 52 బంతుల్లోనే 80 పరుగులు చేసి అదరగొట్టాడు. భారత ఆటగాడు గుర్‍కీరత్ సింగ్ మాన్ (36 బంతుల్లో 64 పరుగులు) మెరుపు అర్ధ శతకం చేశాడు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో పంకజ్ సింగ్ రెండు, మిచెల్ మెక్‍క్లెనిగెన్, తిషారా పెరీరా చెరో వికెట్ తీశారు.
అర్బన్ రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది మణిపాల్ టైగర్స్. 19 ఓవర్లలో 5 వికెట్లకు 193 రన్స్ చేసి గెలిచింది హర్భజన్ టీమ్. మణిపాల్ జట్టు బ్యాటర్ అసెలా గురణరత్నె (29 బంతుల్లో 51 పరుగులు; నాటౌట్) చివర్లో అజేయ అర్ధ శకతంతో అదరగొట్టి జట్టును గెలిపించాడు. చివర్లో తిషారా పెరీరా (13 బంతుల్లో 25 పరుగులు) హిట్టింగ్ చేసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
అంతకు మందు మణిపాల్ టైగర్స్ టీమ్‍కు ఓపెనర్ రాబిన్ ఊతప్ప (27 బంతుల్లో 40 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. హిట్టింగ్‍తో మెరిపించాడు. మరో ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ (29) కూడా ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ఔటయ్యాక అమిత్ వర్మ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అంజెలో పెరీరా (30) నిలకడగా ఆడాడు. అనంతరం అసెలా గుణరత్నే అజేయ హాఫ్ సెంచరీ, తిషారా పెరీరా మెరుపులతో మణిపాల్ గెలిచి, టైటిల్ కైవసం చేసుకుంది.
అర్బన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్ స్టువర్ బిన్నీ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 20 పరుగులే ఇచ్చాడు. అయితే మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. జెరోమ్ టేలర్ ఓ వికెట్ తీసినా 55 పరుగులు సమర్పించుకున్నాడు. షాదాబ్ జకాటీ కూడా ఓ వికెట్ తీశాడు.