తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Srh Ipl 2024 Final: ఫైనల్‍లో కోల్‍కతా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్‌కు స్వల్ప లక్ష్యం

KKR vs SRH IPL 2024 Final: ఫైనల్‍లో కోల్‍కతా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్‌కు స్వల్ప లక్ష్యం

26 May 2024, 21:38 IST

google News
    • KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 టైటిల్ పోరులో సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‍లో కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో కోల్‍కతా ముందు స్వల్ప లక్ష్యమే ఉంది.
KKR vs SRH IPL 2024 Final: ఫైనల్‍లో కోల్‍కతా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్‌కు స్వల్వ లక్ష్యం
KKR vs SRH IPL 2024 Final: ఫైనల్‍లో కోల్‍కతా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్‌కు స్వల్వ లక్ష్యం (PTI)

KKR vs SRH IPL 2024 Final: ఫైనల్‍లో కోల్‍కతా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన హైదరాబాద్.. కేకేఆర్‌కు స్వల్వ లక్ష్యం

IPL 2024 KKR vs SRH Final: ఐపీఎల్ 2024 సీజన్‍లో బ్యాటింగ్‍లో మెరుపులు మెరిపించి రికార్డులు సృష్టించిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‍లో మాత్రం కుదేలైంది. టైటిల్ ఫైట్‍లో తొలుత బ్యాటింగ్ చేసి టపాటపా వికెట్లు కోల్పోయి.. స్పల్ప స్కోరుకే కుప్పకూలింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ బౌలర్లు సమిష్టిగా సత్తాచాడటంతో ఎస్ఆర్‌హెచ్ నిలువలేకపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు (మే 26) జరుగుతున్న ఐపీఎల్ 2024 ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు విలవిల్లాడారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (24) కాస్త నిలువడంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. కోల్‍కతా ముందు కేవలం 114 పరుగుల టార్గెట్ ఉంది.

సన్‍రైజర్స్ టపటపా

టాస్ గెలిచి ఈ ఫైనల్ మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‍లో బ్యాటింగ్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్న ప్యాట్ కమిన్స్ సేన ఫైనల్‍లోనూ అదే రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే, సీన్ రివర్స్ అయింది. కోల్‍కతా బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ టపటపా వికెట్లు కోల్పోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్ చేరలేకపోయారు. ఏడుగురు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. కేకేఆర్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‍లో తొలి ఓవర్లోనే బౌల్డ్ అయ్యాడు సన్‍రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ (2). ట్రావిస్ హెడ్ (0) ఆ తదుపరి ఓవర్లోనే వైభవ్ ఆరోరా బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. దీంతో పరుగులు రావడమే కష్టమైంది. రాహుల్ త్రిపాఠి (9) ఐదో ఓవర్లో వెనుదిరిగాడు. దీంతో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో సన్‍రైజర్స్ హైదరాబాద్ కూరుకుపోయింది.

మారని తీరు

మూడు వికెట్లు కోల్పోయాక ఐడెన్ మార్క్‌రమ్ (23 బంతుల్లో 20 పరుగులు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 10 పరుగులు) కాస్త నిలకడగా ఆడారు. భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. అయితే, బర్త్ డే బాయ్ నితీశ్‍ను కోల్‍కతా పేసర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు. నెమ్మదిగా ఆడిన మార్క్‌రమ్ 12వ ఓవర్లో వెనురిగాడు. కోల్‍కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో హైదరాబాద్‍కు పరుగుల రాక గగనమైంది. ఏ దశలోనూ మంచి భాగస్వామ్యాలు రాలేదు.

షాబాజ్ అహ్మద్ (8) కూడా ఎక్కువసేపు నిలువలేదు. తుదిజట్టు నుంచి తప్పించిన అబ్దుల్ సమాద్ (4)ను తప్పనిపరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. అతడు కూడా అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. కొండంత ఆశ పెట్టుకున్న హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (17 బంతుల్లో 16 పరుగులు)ను 15వ ఓవర్లో ఆరోరా బౌల్డ్ చేసి హైదరాబాద్‍ను భారీ దెబ్బకొట్టాడు. దీంతో 90 పరుగులకే 8 వికెట్లతో మునిగింది హైదరాబాద్.

చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24 పరుగులు) కాసేపు రాణించడంతో హైదరాబాద్‍కు ఆ మాత్రం స్కోరు దక్కింది. ఉనాద్కత్ (4) 18వ ఓవర్లో ఔట్ కాగా.. తదుపరి ఓవర్లో భారీ షాట్‍కు వెళ్లి క్యాచౌట్ అయ్యాడు కమిన్స్. దీంతో 9 బంతులు మిగిలి ఉండగానే 113 పరుగులకే హైదరాబాద్ కుప్పకూలింది.

చెత్త రికార్డు

ఐపీఎల్ ఫైనళ్లలో హైదరాబాద్ నేడు చేసిన స్కోరు అత్యల్పం. 2013 సీజన్ ఐపీఎల్ ఫైనల్‍లో ముంబైపై చెన్నై 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్‍లో 113 పరుగులకే కుప్పకూలి.. ఐపీఎల్ ఫైనల్‍లో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డును హైదరాబాద్ మూటగట్టుకుంది.

సత్తాచాటిన కేకేఆర్ బౌలర్లు

కోల్‍కతా బౌలర్ ఆండ్రీ రసెల్ 2.3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‍లో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిని ఔట్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా రెండు, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీసుకున్నారు.

ఈ ఫైనల్ ఫైట్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ముందు కేవలం 114 పరుగుల టార్గెట్ ఉంది. ఆ జట్టు మూడో ఐపీఎల్ టైటిల్ పట్టేందుకు ఆ స్కోరు చేస్తే చాలు. కేకేఆర్‌ను కట్టడి చేయాలంటే సన్‍రైజర్స్ బౌలర్లు అద్భుతం చేయాల్సిందే.

తదుపరి వ్యాసం