KKR vs SRH: ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్.. హైదరాబాద్ మోస్తరు స్కోరు.. అదరగొట్టిన కోల్‍కతా బౌలర్లు
21 May 2024, 21:37 IST
- KKR vs SRH IPL 2024 Qualifier 1: ప్లేఆఫ్స్ పోరులో బ్యాటింగ్‍లో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది సన్‍రైజర్స్ హైదరాబాద్. కోల్‍కతా బౌలర్లు విజృభించడంతో మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
KKR vs SRH: ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్.. హైదరాబాద్ మోస్తరు స్కోరు.. అదరగొట్టిన కోల్‍కతా బౌలర్లు
IPL 2024 KKR vs SRH: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‍లో రాణించలేకపోయింది. కోల్‍కతా నైట్‍రైడర్స్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్‍లో నేడు (మే 21) తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. కోల్‍కతా పేసర్లు సమిష్టిగా అదరగొట్టారు. దీంతో అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‍లో ఫస్ట్ బ్యాటింగ్‍లో సన్‍రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు హైదరాబాద్ ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలకమైన 30 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్‍కు ఆ మాత్రం స్కోరు దక్కింది. కోల్‍కతా ముందు 160 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంది.
హెడ్ డకౌట్.. అభిషేక్, నితీశ్ ఫెయిల్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) తొలి ఓవర్ రెండో బంతికే కోల్‍కతా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‍లో బౌల్డ్ అయ్యాడు. వరుసగా రెండోసారి డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (3) రెండో ఓవర్లో ఔటయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి (9) కూడా విఫలమయ్యాడు. షహబాద్ అహ్మద్ (0) తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో 39 పరుగులకే హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
హాఫ్ సెంచరీతో ఆదుకున్న త్రిపాఠి
వరుసగా వికెట్లు పడినా సన్‍రైజర్స్ బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32 రన్స్; 3 ఫోర్లు, ఓ సిక్స్) దూకుడుగా ఆడారు. దీంతో హైదరాబాద్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. త్రిపాఠి తన మార్క్ డిఫరెంట్ షాట్లతో మెప్పిస్తే.. క్లాసెన్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే, 11వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‍లో క్లాసెన్ ఔటయ్యాడు. దూకుడు కొనసాగించిన రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. .అయితే, ఆ తర్వాత త్రిపాఠి రనౌట్ కావటంతో హైదరాబాద్‍కు ఎదురుదెబ్బ తగిలింది. అబ్దుల్ సమాద్ (16) కాసేపే నిలిచాడు.
కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్
నన్వీర్ సింగ్ (0), భువనేశ్వర్ కుమార్ (0) డకౌట్ అవటంతో 126 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్. ఆ తరుణంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా పరుగులు రాబడుతూనే వీలైనప్పుడు హిట్టింగ్ చేశాడు. 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేశాడు. చివరి ఓవర్ మూడో బంతికి కమిన్స్ ఔటయ్యాడు. కమిన్స్ పోరాటంతో హైదరాబాద్‍కు 159 పరుగుల స్కోరైనా దక్కింది.
కోల్‍కతా బౌలర్లలో స్టార్ పేసర్, ఐపీఎల్ హిస్టరీలో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో మెప్పించాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్వాలిఫయర్స్-1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. మరి కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టును 160 పరుగులు చేయకుండా హైదరాబాద్ అడ్డుకోగలదా లేదా అనేది చూడాలి.
టాపిక్