తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gambhir On England: ఇంగ్లండ్‍ దారుణ ప్రదర్శనకు ముఖ్యమైన కారణం అదే: గౌతమ్ గంభీర్

Gambhir on England: ఇంగ్లండ్‍ దారుణ ప్రదర్శనకు ముఖ్యమైన కారణం అదే: గౌతమ్ గంభీర్

30 October 2023, 17:24 IST

google News
    • Gambhir on England: వన్డే ప్రపంచకప్‍లో ఇంగ్లండ్ బ్యాటింగ్‍లో ఘోరంగా ఎందుకు విఫమవుతుందో ముఖ్యమైన కారణాన్ని చెప్పాడు గౌతమ్ గంభీర్. ఇంగ్లిష్ జట్టు బ్యాటింగ్ లైనప్‍కు నష్టం చేస్తున్న విషయమేదో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్

Gambhir on England: వన్డే ప్రపంచకప్‍లో డిఫెండింగ్ చాంపియన్‍గా అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‍ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా తమ బలమైన బ్యాటింగ్‍లోనే ఇంగ్లండ్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమవుతోంది. భారత్‍తో ఆదివారం (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్‍లో మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌటైంది. 100 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైంది. అయితే, ఇంగ్లండ్ బ్యాటింగ్‍లో దారుణమైన ప్రదర్శన చేస్తుండడంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. అందుకు ఓ ముఖ్యమైన కారణం ఉందని వివరించాడు.

సీనియర్ ప్లేయర్ జో రూట్ విఫలమవుతుండడమే ఇంగ్లండ్ బ్యాటింగ్ దారుణ ప్రదర్శనకు ముఖ్యమైన కారణమని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇతర బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటే.. రూట్ మరో ఎండ్‍లో వికెట్లు పడకుండా జాగ్రత్త పడేవాడని గంభీర్ అన్నాడు. అయితే, ఈ ప్రపంచకప్‍లో రూట్ త్వరగా ఔట్ అవుతుండటం.. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‍కు పెద్ద దెబ్బగా మారుతోందని స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గౌతీ చెప్పాడు.

“ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‍ను చూస్తే.. రూట్ మినహా మిగిలిన అందరూ దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే ప్రయత్నిస్తారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం రూట్ చుట్టూనే తిరుగుతుంటుంది. అయితే, ఈ టోర్నీలో రూట్ విఫలమవుతుండడం ఇంగ్లండ్‍కు ఎక్కువ నష్టం చేస్తోంది” అని గంభీర్ అన్నాడు.

“ఇతర ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతుంటే.. మరో ఎండ్‍లో రూట్ నిలకడగా ఆడుతూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు. అయితే, ఇప్పుడు రూట్ విఫలమవుతున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‍లో లోపాలు బయటపడ్డాయి. ఒత్తిడిని అధిగమిస్తూ స్వింగింగ్, సీమింగ్ బంతులను సమర్థవంతంగా చాలా మంది ఆడలేరు” అని గంభీర్ చెప్పాడు.

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍ల్లో కేవలం 175 పరుగులే చేశాడు రూట్. ఆదివారం భారత్‍తో జరిగిన మ్యాచ్‍లో బుమ్రా బౌలింగ్‍లో ఎల్బీడబ్ల్యూ అయి.. గోల్డెన్ డక్‍గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అయితే, భారత బౌలర్ల విజృంభణతో లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలోనే 129 పరుగులకే కుప్పకూలింది. 100 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

తదుపరి వ్యాసం