Jadeja on Ishan Kishan: ఇండియన్ క్రికెట్ మారదు.. అతన్ని ఎంతకాలం పక్కన పెడతారు: మాజీ క్రికెటర్ సీరియస్
05 December 2023, 9:48 IST
- Jadeja on Ishan Kishan: స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు జరుగుతున్న అన్యాయంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇండియన్ క్రికెట్ మారదు.. అతన్ని ఎంతకాలం ఇలా పక్కన పెడతారంటూ అతడు అనడం గమనార్హం.
ఇషాన్ కిషన్ ను చివరి రెండు టీ20ల నుంచి తప్పించడంపై జడేజా ఆగ్రహం
Jadeja on Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఆస్ట్రేలియాతో చివరి రెండు టీ20లకు పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇండియన్ క్రికెట్ లో ఇది కొత్త కాదని, సెలక్ట్ చేయడం కాదు రిజెక్ట్ చేస్తారని అతడు అనడం గమనార్హం.
ఆస్ట్రేలియాతో సిరీస్ ను సూర్యకుమార్ కెప్టెన్సీలోని యంగిండియా 4-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తొలి మూడు టీ20లు ఆడిన తర్వాత చివరి రెండు మ్యాచ్ లకు రెస్ట్ అంటూ ఇషాన్ కిషన్ ను ఇంటికి పంపించేశారు. దీనిపైనే అజయ్ జడేజా అసంతృప్తిగా ఉన్నాడు. అతడు అంతగా అలసిపోయాడా అంటూ ప్రశ్నించాడు.
ఇషాన్ మూడు మ్యాచ్‌లకే అలసిపోయాడా?
స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన అజయ్ జడేజా ఇండియన్ క్రికెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "వరల్డ్ కప్ ముగిసిన వెంటనే సిరీస్ ఆడారు. ఇషాన్ కిషన్ మూడు మ్యాచ్ లు ఆడి ఇంటికెళ్లిపోయాడు. అతడు మూడు మ్యాచ్ లకే అంతగా అలసిపోయాడు? వరల్డ్ కప్ లోనూ అతన్ని సరిగా ఆడించలేదు.
వరల్డ్ కప్ మ్యాచ్ లలోనూ అతనికి అవకాశం ఇవ్వాల్సింది. తనదైన రోజు ఎంతమంది ఇండియన్ క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు? అతడు మ్యాచ్ లను ఒంటిచేత్తో మార్చేయగలడు. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఎన్ని రోజులు ఇలా అతన్ని ట్రయల్లో వాడుకుంటారు? గత రెండేళ్లలో అతడు ఆడిన మ్యాచ్ లు ఎన్ని? ఇండియన్ క్రికెట్ లో ఈ సమస్య ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వీళ్లు ప్లేయర్స్ ను సెలక్ట్ చేయరు రిజక్ట్ చేస్తారంతే" అని జడేజా అనడం గమనార్హం.
ఆస్ట్రేలియాతో మూడు టీ20ల్లో ఇషాన్ కిషన్ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక మ్యాచ్ లో డకౌటయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 58, తర్వాత తిరువనంతపురంలో 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్ లో 110 రన్స్ చేయడం విశేషం. ఇషాన్ ను పూర్తిగా ఆడించకుండా, అతనికి అవకాశాలు ఇవ్వకుండా ఉంటే అతడు ఎప్పటికి పూర్తిగా సిద్ధమవుతాడని జడేజా ప్రశ్నించాడు.