తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Most Expensive Players: ఐపీఎల్ వేలంలో ధోనీ నుంచి కరన్ వరకు.. ప్రతి వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ వీళ్లే

IPL Most Expensive Players: ఐపీఎల్ వేలంలో ధోనీ నుంచి కరన్ వరకు.. ప్రతి వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ వీళ్లే

Hari Prasad S HT Telugu

19 December 2023, 9:25 IST

google News
    • IPL Most Expensive Players: ఐపీఎల్ వేలంలో ధోనీ నుంచి సామ్ కరన్ వరకు గత 15 సీజన్లలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ జాబితా ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2024 వేలం కాసేపట్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలానికి అంతా సిద్ధం
ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలానికి అంతా సిద్ధం

ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలానికి అంతా సిద్ధం

IPL Most Expensive Players: ఐపీఎల్ వేలం చిన్నదో పెద్దదో దాదాపు ప్రతి ఏటా జరుగుతోంది. ఇలా వేలం జరిగిన ప్రతిసారీ ప్లేయర్స్ ధర రికార్డు బ్రేకవుతూనే ఉంది. 2008లో తొలి వేలంలో ధోనీ నుంచి 2023లో సామ్ కరన్ వరకు ఎంతో మంది ప్లేయర్స్ ఆయా వేలం పాటల రికార్డులను బ్రేక్ చేసిన వాళ్లే. ఐపీఎల్ 2024 వేలం కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో 2008 నుంచి 2023 వరకు ఇలా వేలంలో రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్స్ జాబితా ఓసారి చూద్దాం.

ఐపీఎల్ 2008: ఎమ్మెస్ ధోనీ

తొలిసారి ఐపీఎల్ వేలం జరిగినప్పుడు ప్లేయర్స్ వేలమేంటన్న ఆశ్చర్యంలో ఉన్న అభిమానులకు ధోనీ పలికిన ధర మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో డాలర్స్ లో ఈ వేలం జరిగింది. అంతకుముందే టీ20 వరల్డ్ కప్ గెలిపించిన ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ తో పోటీ పడి చెన్నై అతన్ని దక్కించుకుంది.

ఐపీఎల్ 2009: ఫ్లింటాఫ్, పీటర్సన్

తర్వాతి ఏడాది వేలంలో ఇంగ్లిష్ ప్లేయర్స్ ఫ్లింటాఫ్, పీటర్సన్ రికార్డు ధర పలికారు. పీటర్సన్ ను ఆర్సీబీ టీమ్ రూ.9.8 కోట్లకు.. ఫ్లింటాఫ్ ను సీఎస్కే అదే రూ.9.8 కోట్లకు దక్కించుకున్నాయి.

ఐపీఎల్ 2010: షేన్ బాండ్, కీరన్ పొలార్డ్

ఐపీఎల్ 2010 కోసం జరిగిన ప్లేయర్స్ వేలంలో న్యూజిలాండ్ పేసర్ షేన్ బాండ్ ను కేకేఆర్ టీమ్ రూ.4.8 కోట్లకు, కీరన్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ అదే రూ.4.8 కోట్లకు దక్కించుకున్నాయి.

ఐపీఎల్ 2011: గౌతమ్ గంభీర్

ఐపీఎల్ 2011 వేలంలో అప్పటి టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. అతన్ని కేకేఆర్ టీమ్ ఏకంగా రూ.14.9 కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాత అతడే 2012, 2014లలో రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు.

ఐపీఎల్ 2012: రవీంద్ర జడేజా

ఐపీఎల్ 2012లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీగా ఖర్చు పెట్టింది. అతన్ని రూ.12.8 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ 2013: గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం ఐపీఎల్ 2013 వేలంలో ముంబై ఇండియన్స్ రూ.6.3 కోట్లు వెచ్చించింది. అతడు పెద్దగా రాణించకపోవడంతో తర్వాత అతడు కింగ్స్ పంజాబ్, ఆర్సీబీ టీమ్స్ కు ఆడాడు.

ఐపీఎల్ 2014: యువరాజ్ సింగ్

ఐపీఎల్ 2014 వేలంలో ఆశ్చర్యకరంగా యువరాజ్ సింగ్ భారీ ధర పలికాడు. అతన్ని ఆర్సీబీ టీమ్ ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2015: యువరాజ్ సింగ్

తర్వాతి ఏడాది కూడా యువరాజ్ సింగే అత్యధిక ధర పలికిన ప్లేయర్ అయ్యాడు. అతన్ని ఆర్సీబీ నుంచి ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ తీసుకుంది. దీనికోసం రూ.16 కోట్లు ఖర్చు చేసింది.

ఐపీఎల్ 2016: షేన్ వాట్సన్

ఐపీఎల్ 2016 వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను ఆర్సీబీ టీమ్ రూ.9.5 కోట్లకు దక్కించుకుంది. ఆ వేలంలో అదే అత్యధిక ధర.

ఐపీఎల్ 2017: బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ వేలంలో అత్యధిక ధర పలికాడు. ఐపీఎల్ 2017 కోసం అప్పటి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీమ్ రూ.14.5 కోట్లు ఖర్చు చేసింది.

ఐపీఎల్ 2018: బెన్ స్టోక్స్

వరుసగా రెండో ఏడాది కూడా బెన్ స్టోక్స్ ఖరీదైన ప్లేయర్ అయ్యాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతన్ని రూ.14.5 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ 2019: జైదేవ్ ఉనద్కట్, వరుణ్ చక్రవర్తి

టీమిండియా లెఫ్టామ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ ను ఐపీఎల్ 2019 వేలంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ.8.4 కోట్లకు దక్కించుకుంది. అదే వేలంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కింగ్స్ లెవన్ పంజాబ్ కూడా అంతే మొత్తం ఖర్చు చేసింది.

ఐపీఎల్ 2020: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2020 వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ రూ.15.5 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ 2021: క్రిస్ మోరిస్

సౌతాఫ్రికాకు చెందిన అప్పటి ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.16.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అతడే.

ఐపీఎల్ 2022: ఇషాన్ కిషన్

ఇక ఐపీఎల్ 2022 వేలంలో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ముంబై ఇండియన్స్ టీమ్ ఏకంగా రూ.15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.

ఐపీఎల్ 2023: సామ్ కరన్

ఇక గత సీజన్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ అత్యధిక ధర పలికాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కరన్ నిలిచాడు.

తదుపరి వ్యాసం