IPL 2024 Highest Run Scorer: ఐపీఎల్ 2024 - ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో కోహ్లి టాప్ - పర్పుల్ రేసులో సీఎస్‌కే బౌలర్
30 March 2024, 12:20 IST
Virat Kohli: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. మూడు మ్యాచుల్లోనే కోహ్లి 181 పరుగులు చేశాడు. పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్‌కే పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు.
విరాట్ కోహ్లి
Virat Kohli: ఐపీఎల్ 2024 మొదలై అప్పుడే పదకొండు రోజులు పూర్తయింది. ఈ సీజన్‌లో రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే టాప్ ప్లేస్‌లో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (+1.047)తో రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా బోణీ చేయలేదు.
కోహ్లి టాప్...
ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రెండింటిలో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు మ్యాచుల్లో అరవై యావరేజ్‌తో 181 పరుగులు చేసిన కోహ్లి టాప్ స్కోరర్‌గా కొనసాగుతోన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యాభై తొమ్మిది బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో కోహ్లి 83 పరుగులు చేశాడు.
2016లో కోహ్లి విన్నర్…
కోహ్లి ఇప్పటివరకు ఒకేఒకసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సింగిల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా రికార్డ్ సృష్టించాడు. కోహ్లి 973 పరుగుల రికార్డును ఎనిమిదేళ్లు అయినా ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్‌ను గేల్, వార్నర్ మాత్రమే రెండేసిసార్లు అందుకున్నారు. ఈ సీజన్‌లో కోహ్లి అవార్డును గెలిస్తే వారి సరసన చేరుతాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి తర్వాత సన్‌రైజర్స్ హిట్టర్ క్లాసెన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లోనే క్లాసెన్ 143 రన్స్ చేశాడు. ఈ జాబితాలో 127 రన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ మూడో స్థానంలో నిలిచాడు.
పర్పుల్ క్యాప్ రేసులో
పర్పుల్ క్యాప్ రేసులో సీఎస్‌కే బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆరు వికెట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. రెండు మ్యాచుల్లోనే అతడు ఆరు వికెట్లు తీసుకున్నాడు. బెంగళూరు రాయల్స్‌తో జరిగిన ఊపీఎల్ ఆరంభ పోరులో నాలుగు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
పర్పుల్ క్యాప్ రేసులో కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రానా (ఐదు వికెట్లు), కెప్టెన్ ఆంద్రీ రసెల్ (నాలుగు వికెట్లు) రెండు, మూడో స్థానంలో ఉన్నారు. మూడు వికెట్లు తీసిన బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.
శుభ్‌మన్ గిల్ విన్నర్...
2023లో ఆరెంజ్ క్యాప్‌ను గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్స్ శుభ్‌మన్ గిల్ దక్కించుకున్నాడు. గత సీజన్‌లో గిల్ మూడు సెంచరీలతో 890 రన్స్ చేశాడు. 2022లో జోస్ బట్లర్ (863 రన్స్), 2021లో రుతురాజ్ గైక్వాడ్ (635 రన్స్)తో ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచారు.
2023 ఐపీఎల్‌లో 17 మ్యాచుల్లో 28 వికెట్లు తీసిన మహ్మద్ షమీ పర్ఫల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. యజువేంద్ర చాహల్ 27 వికెట్లతో 2022లో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు