IPL 2024 Final KKR vs SRH: అయ్యో హైదరాబాద్.. ఫైనల్‍లో కోల్‍కతా చేతిలో సన్‍రైజర్స్ ఓటమి.. మూడో టైటిల్ పట్టిన కేకేఆర్
26 May 2024, 22:49 IST
- IPL 2024 Final KKR vs SRH: ఐపీఎల్ 2024 తుదిపోరులో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు నిరాశే ఎదురైంది. ఫైనల్‍లో కోల్‍కతా చేతిలో చిత్తుగా ఓడింది ఎస్ఆర్‌హెచ్. ఇక ఆల్ రౌండ్ షోతో దుమ్మురేపిన కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది.
IPL 2024 Final KKR vs SRH: అయ్యో హైదరాబాద్.. ఫైనల్‍లో కోల్‍కతా చేతిలో సన్‍రైజర్స్ ఓటమి.. మూడో టైటిల్ పట్టిన కేకేఆర్
KKR vs SRH IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ (Kolkata Knight Riders) ఛాంపియన్‍గా నిలిచింది. ఈ సీజన్‍లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు (287 పరుగులు) సహా అనేక రికార్డులతో దూకుడు చూపిన సన్‍రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫైనల్‍లో చేతులెత్తేసింది. టైటిల్ ఫైట్‍లో కోల్‍కతా చేతిలో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ చిత్తుచిత్తుగా ఓడింది. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు (మే 26) జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‍లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కోల్‍కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍పై ఆడుతూ పాడుతూ గెలిచింది. మూడో ఐపీఎల్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా సాగిందంటే..
లక్ష్యాన్ని ఊదేసిన కేకేఆర్.. వెంకటేశ్ మెరుపులు
టైటిల్ ఫైట్‍లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‍కతా నైట్‍రైడర్స్ అలవోకగా ఊదేసింది. 10.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 114 పరుగులు చేసి దుమ్మురేపింది. 57 బంతులు మిగిల్చి ఆడుతూ పాడుతూ గెలిచేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ (6) త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధ శకతంతో చెలరేగి ఆడగా.. రహ్మనుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39 పరుగులు: 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేసి హిట్టింగ్ చేశారు. దీంతో టార్గెట్ వేగంగా కరిగిపోయింది.
ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్ భీకర హిట్టింగ్‍తో విరుచుకుపడ్డాడు. దీంతో 6 ఓవర్లకే 72 రన్స్ చేసింది కేకేఆర్. తొమ్మిదో ఓవర్లో గుర్బాజ్ ఔటైనా.. వెంకటేశ్ అయ్యర్ దూకుడు కొనసాగించాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్) చివర్లో వెంకటేశ్‍కు తోడుగా నిలిచాడు. గెలిచాక కోల్‍కతా ప్లేయర్లు గంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు. లీగ్ దశలో టాప్‍లో నిలిచి సత్తాచాటిన కేకేఆర్ ఛాంపియన్‍గానూ నిలిచింది.
బ్యాట్లెత్తేసిన హైదరాబాద్
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్‍లో అత్యల్ప స్కోరు చెత్త రికార్డును నమోదు చేసుకుంది. కోల్‍కతా బౌలర్ల ధాటికి బ్యాట్లెత్తేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (19 బంతుల్లో 24 పరుగులు) రాణించాడు. ఐడెన్ మార్క్‌రమ్ (20) కాసేపు నిలిచాడు. అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0), రాహుల్ త్రిపాఠి (9), నితీశ్ కుమార్ (13) సహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (16) కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ కుప్పకూలింది.
కోల్‍కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. సమిష్టిగా రాణించి హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‍ను కుప్పకూల్చేశారు.
కోల్‍కతాకు మూడో టైటిల్.. గంభీర్ ఉన్నప్పుడే..
కోల్‍కతా నైట్‍రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్ పట్టింది. 2012, 2014లో గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్‍కతా ఐపీఎల్ టైటిళ్లను గెలిచింది. ఇప్పుడు 2024 సీజన్‍లో టైటిల్ పట్టింది కేకేఆర్. ఈ సీజన్ కోసం గౌతమ్ గంభీర్ మెంటార్‌గా రాగా.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో చాంపియన్‍గా నిలిచింది కోల్‍కతా. రెండుసార్లు గంభీర్ కెప్టెన్సీలో.. ఈసారి అతడి దిశానిర్దేశంలో టైటిల్ కైవసం చేసుకుంది. 2022, 2023 సీజన్లలో ఏడో స్థానంతో నిరాశపరిచిన కోల్‍కతా.. మెంటార్‌గా ఈ 2024 సీజన్‍కు గంభీర్ రావడంతో సత్తాచాటింది. పదేళ్ల తర్వాత టైటిల్ కొట్టింది.
ఇక, ఐపీఎల్ 2023 సీజన్‍లో పదో స్థానంలో నిలిచి నిరాశపరిచిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో రన్నరప్‍గా నిలిచింది. కెప్టెన్‍గా ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ రావటంతో దూకుడుగా ఆడింది. ఫైనల్‍లో ఓడినా హైదరాబాద్ ఈ సీజన్లో రాణించింది.