Mitchell Starc: ఐపీఎల్ హిస్టరీలో రికార్డు సృష్టించిన మిచెల్ స్టార్క్.. కమిన్స్‌ను మించి ఖరీదైన ఆటగాడిగా..
19 December 2023, 17:02 IST
- Mitchell Starc - IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఏకంగా రూ.24.75కోట్లకు అమ్ముడయ్యాడు.
మిచెల్ స్టార్క్
Mitchell Starc - IPL 2024 Auction: ఐపీఎల్ 2024 కోసం జరుగుతున్న మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) జట్టు సొంతం చేసుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరుగుతున్న వేలంలో స్టార్క్‌కు ఈ కళ్లు చెదిరే ధర దక్కింది. ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిన అతడు ఏకంగా రూ.24.75కోట్లతో జాక్‍పాట్ కొట్టేశాడు. ఇది జరిగే సుమారు గంటన్నరే క్రితమే ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ రికార్జులకెక్కాడు. అయితే, కాసేపటికే కమిన్స్ రికార్డును స్టార్క్ బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు.
ఐపీఎల్ 2024 కోసం జరిగే ఈ వేలంలో ముందు నుంచి అందరి దృష్టి మిచెల్ స్టార్క్ పైనే ఉంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‍తో వేలంలోకి స్టార్క్ వచ్చాడు. ముందుగా అతడి కోసం ముంబై ఇండియన్స్ పోటీ ప్రారంభించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఢిల్లీ, ముంబై హోరాహోరీగా బిడ్డింగ్ చేశాయి. రూ.9.4 కోట్ల వద్దకు వచ్చాక ఢిల్లీ వైదొలిగింది. ఆ తర్వాత ముంబైతో గుజరాత్ టైటాన్స్.. స్టార్క్ కోసం రేసులోకి వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య చాలా సేపు బిడ్డింగ్ వార్ జరిగింది. ఏకంగా స్టార్క్ రూ.20కోట్ల మార్క్ దాటాడు. అయితే, చివరగా రూ.24.50 కోట్ల వద్ద గుజరాత్ పోటీ నుంచి తప్పుకుంది. రూ.24.75 కోట్లకు బిడ్ చేసిన కోల్‍కతా నైట్ రైడర్స్ టీమ్ మిచెల్ స్టార్క్‌ను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.
2014, 2015 సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఐపీఎల్ ఆడాడు మిచెల్ స్టార్క్. ఆ తర్వాత ఐపీఎల్‍కు విరామం తీసుకున్నాడు. 2018 జనవరిలో జరిగిన వేలంలో కోల్‍కతా నైట్‍రైడర్స్ వేలంలో అతడిని సొంతం చేసుకుంది. అయితే, గాయం కారణంగా ఈ సీజన్‍లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు స్టార్క్. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‍కే ప్రాధాన్యమిస్తూ ఐపీఎల్‍కు దూరమయ్యాడు. అయితే, ఎట్టకేలకు ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఏకంగా 2024 సీజన్ కోసం రూ.24.75 కోట్లతో పంట పండించుకున్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‍లో ఆస్ట్రేలియా తరఫున 16 వికెట్లతో సత్తాచాటాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ (2014, 2015)లో 27 మ్యాచ్‍ల్లో 7.17 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు స్టార్క్.
టాపిక్