IPL 2024 Auction: అయ్యో! రూ.13.5కోట్ల నుంచి రూ.4కోట్లకు పడిపోయిన ఇంగ్లండ్ ఆటగాడు.. ఎస్ఆర్‌హెచ్‍కు ఆసీస్ స్టార్
19 December 2023, 14:14 IST
- IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు వేలం జరుగుతోంది. అయితే, భారీ ధర పలుకుతాడని అంచనాలు వేసిన ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‍కు ఈసారి షాక్ ఎదురైంది.
హ్యారీ బ్రూక్
IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ కోసం మినీ వేలం నేడు (డిసెంబర్ 19) జరగుతోంది. దుబాయ్‍లో జరుగుతున్న ఈ వేలంలో పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి. ఈ మినీ వేలానికి 332 మంది ప్లేయర్లు రానుండగా.. మొత్తంగా 77 మంది ఆటగాళ్లను జట్లు తీసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, నేటి మధ్యాహ్నం వేలం మొదలైంది. ఆరంభంలోనే ఓ అనూహ్యమైన కొనుగోలు జరిగింది.
ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్‍ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు రూ.4కోట్లకు దక్కించుకుంది. రూ.2కోట్ల బేస్ ధరతో వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా ప్రయత్నించింది. చివరికి రూ.4కోట్లకు బ్రూక్‍ను ఢిల్లీ దక్కించుకుంది. అయితే, 2023 సీజన్ కోసం 2022లో బ్రూక్‍ను సన్‍రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13.5కోట్లను వెచ్చించి తీసుకుంది. అయితే, ఈసారి బ్రూక్ ధర ఏకంగా రూ.4కోట్లకు పడిపోయింది.
వైఫల్యంతోనే..!
ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 2023 సీజన్ కోసం హ్యారీ బ్రూక్‍ను సన్‍రైజర్స్ హైదరాబాద్ టీమ్ భారీ ధరకు తీసుకుంది. అయితే, అతడు 2023 సీజన్‍లో తీవ్రంగా నిరాశపరిచాడు. 11 మ్యాచ్‍ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఓ మ్యాచ్‍లో సెంచరీ చేసినా మిగిలిన మ్యాచ్‍ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఏ మాత్రం అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో సన్‍రైజర్స్ హైదరాబాద్ అతడిని వేలంలోకి రిలీజ్ చేసింది. దీంతో 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో రూ.4కోట్లకు అతడి ధర పడిపోయింది. బ్రూక్‍ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఒక్క సంవత్సరంలోనే అతడి ధర రూ.9.5కోట్లు పతనమైంది.
ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 27 అంతర్జాతీయ టీ20లు ఆడిన బ్రూక్.. 531 రన్స్ చేశాడు. 12 టెస్టుల్లో 1,181 రన్స్, 15 వన్డేల్లో 407 పరుగులు చేశాడు.
హెడ్‍ను దక్కించుకున్న హైదరాబాద్
2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‍ను సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) కొనుగోలు చేసింది. భారత్‍తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో సెంచరీతో అదరగొట్టిన హెడ్‍ను హైదరాబాద్ టీమ్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రయత్నించింది. చివరికి హైదరాబాద్ దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆల్‍రౌండర్ రావ్‍మన్ పావెల్‍ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.7.4 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. రూ.1కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ఇతడికి మంచి ధర లభించింది. 2024 మినీ వేలంలో అమ్ముడైన తొలి ప్లేయర్ పావెలే.
టాపిక్