తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Indw Vs Engw: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చిత్తు

INDW vs ENGW: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చిత్తు

16 December 2023, 14:03 IST

google News
    • INDW vs ENGW Test Match: ఏకైక టెస్టులో ఇంగ్లండ్‍ను భారత మహిళల జట్టు చిత్తు చేసింది. ఘన విజయం సాధించింది. దీంతో ఓ కొత్త చరిత్ర సృష్టించింది. ఆ వివరాలివే..
INDW vs ENGW: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చిత్తు
INDW vs ENGW: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చిత్తు (PTI)

INDW vs ENGW: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చిత్తు

INDW vs ENGW Test Match: ఇంగ్లండ్‍ను భారత మహిళల జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టెస్టులో సత్తాచాటింది. అన్ని విభాగాల్లోనూ సత్తాచాటిన భారత్.. మూడో రోజైన నేడే (డిసెంబర్ 16) మ్యాచ్‍ను ముగించి భారీగా గెలిచింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకుంది. హిస్టరీ క్రియేట్ చేసింది. వివరాలివే..

రెండో ఇన్నింగ్స్‌లో 479 పరుగుల కొండంత టార్గెట్ ముందుడగా ఇంగ్లండ్ నేడు 131 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ నాలుగు, పూజా వస్త్రాకర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, రేణుక సింగ్ ఓ వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీతర్ నైట్ (21), చార్లీన్ డీన్ (21 నాటౌట్) మాత్రమే 20 పరుగుల మార్క్ చేరగలిగారు. మిగిలిన వారు విఫలమయ్యారు. భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ టీమ్ గడగడలాడిపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు కనీస పోటీనివ్వలేక చతికిలపడ్డారు.

మ్యాచ్ సాగిందిలా..

ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది భారత మహిళల జట్టు. తొలి రోజు నుంచే భారత బ్యాటర్లు అదరగొట్టారు. సతీశ్ శుభ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), యక్షిత భాటియా (66), దీప్తి శర్మ (67) తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలతో సత్తాచాటారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 428 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఎక్లెస్టోన్ చెరో మూడు వికెట్లు తీశారు.

దీప్తి శర్మ విజృంభణ

ఇక భారత స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో విజృభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ విలవిల్లాడింది. 136 పరుగులకే ఇంగ్లిష్ జట్టు చాపచుట్టేసింది. నాట్ స్కీవెర్ బ్రంట్ (59) అర్ధ శతకం చేయగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (44 నాటౌట్), షెఫాలీ వర్మ (33) సత్తాచాటారు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 186 పరుగుల వద్ద భారత డిక్లేర్ చేసింది టీమిండియా.

ఇంగ్లండ్‍కు 479 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది భారత మహిళల జట్టు. దీప్తి శర్మ సహా టీమిండియా బౌలర్లు మరోసారి సత్తాచాటడంతో ఇంగ్లండ్ 131 పరుగులకే మూడో రోజే కుప్పకూలింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.

తదుపరి వ్యాసం