Dinesh Karthik: అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్: అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్‍బై
01 June 2024, 19:56 IST
- Dinesh Karthik Retirement: భారత స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పారు. తన రిటైర్మెంట్‍ను నేడు అధికారికంగా ప్రకటించారు.
Dinesh Karthik: అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్: అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్‍బై (HT Photo)
Dinesh Karthik Retirement: భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటకు వీడ్కోలు చెప్పేశారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు నేడు (జూన్ 1) అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ తర్వాతే కార్తీక్ రిటైర్ అయినట్టు దాదాపు ఖరారైంది. ఐపీఎల్ ఎలిమినేటర్‌లో ఓడిపోయాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు కార్తీక్‍కు భావోద్వేగంగా గుడ్‍బై చెప్పారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇది జరిగిన 10 రోజులకు నేడు తన రిటైర్మెంట్‍ను 38 ఏళ్ల కార్తీక్ అధికారికంగా ప్రకటించారు. టీమిండియా, ఐపీఎల్‍తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్‍బై చెప్పేశారు.
థ్యాంక్స్ చెబుతూ..
తనకు సుదీర్ఘ కెరీర్లో ఇంతకాలం మద్దతుగా నిలిచిన కోచ్‍లు, కెప్టెన్లు, సెలెక్టర్లు, జట్టు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్‍కు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో నేడు ఓ లెటర్ రిలీజ్ చేశారు దినేశ్ కార్తీక్. అలాగే తన క్రికెట్ కెరీర్లోని జ్ఞాపకాలతో ఓ వీడియో పోస్ట్ చేశారు.
కొంతకాలంగా తాను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నానని, ఇక క్రికెట్ ఆడడం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని కార్తీక్ వెల్లడించారు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. ఇక జీవితంలో కొత్త సవాళ్ల కోసం ముందుకు సాగుతానని కార్తీక్ రాసుకొచ్చారు.
కెరీర్ ఇలా..
టీమిండియా తరఫున 26 టెస్టులు ఆడిన దినేశ్ కార్తీక్ 1,025 పరుగులు చేశారు. ఓ సెంచరీ బాదారు. భారత్ తరపున 94 వన్డేల్లో 30.21 యావరేజ్‍తో 1,752 పరుగులు చేశారు కార్తీక్. తొమ్మిది అర్ధ శతకాలు సాధించారు. టీమిండియా తరఫున 60 అంతర్జాతీయ టీ20ల్లో 142.62 స్ట్రైక్‍రేట్‍తో 686 పరుగులు చేశారు కార్తీక్.
2004 సెప్టెంబర్ 5వ తేదీన ఇంగ్లండ్‍తో వన్డేతో భారత్ తరఫున అరంగేట్రం చేశారు దినేశ్ కార్తీక్. 2004 నవంబర్ 3న ఆస్ట్రేలియాతో మ్యాచ్‍తో టెస్టుల్లో డెబ్యూట్ చేశారు. 2006 డిసెంబర్ 1న టీ20ల్లో అడుగుపెట్టారు. టీమిండియా తరఫున చివరగా 2022 నవంబర్ 2వ తేదీన బంగ్లాదేశ్‍తో టీ20 మ్యాచ్ ఆడారు కార్తీక్.
ఐపీఎల్‍లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్‍కతా నైట్‍రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున దినేశ్ కార్తీక్ ఆడారు. 257 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 135.36 స్ట్రైక్ రేట్‍తో 4,842 పరుగులు సాధించారు దినేశ్ కార్తీక్. 22 హాఫ్ సెంచరీలు చేశారు. ఐపీఎల్ తొలి సీజన్ 2008 నుంచి ఈ ఏడాది 2024 వరకు అన్ని సీజన్లు ఆడారు కార్తీక్.
దినేశ్ కార్తీక్ కెరీర్ ఒడిదొకుల మధ్య సాగింది. టాలెంట్ మెండుగా ఉన్నా.. వికెట్ కీపర్ అయిన ఎంఎస్ ధోనీ కెప్టెన్ కావటంతో టీమిండియాలో కార్తీక్‍కు సరైన అవకాశాలు దక్కలేదు. వికెట్ కీపింగ్ స్లాట్ ఖాళీగా లేకపోవటంతో ఎప్పుడో ఒకసారి తప్పు రెగ్యులర్‌గా చోటు దక్కలేదు.
అయితే, ఫామ్‍లో కోల్పోయినా.. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తలిగినా ఓ దశలో కార్తీక్ అద్భుతంగా పుంజుకున్నారు. భీకర హిట్టింగ్‍తో ఫినిషర్‌గా మారి టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‍లోనూ దుమ్మురేపారు. ఈ ఏడాది ఐపీఎల్‍లోనూ కొన్ని మ్యాచ్‍ల్లో తన మార్క్ హిట్టింగ్ చేశారు. 38 ఏళ్ల వయసులోనూ మెరిపించారు. ఇప్పుడు తన క్రికెట్ కెరీర్‌కు కార్తీక్ గుడ్‍బై చెప్పారు. ఇక కామెంటేటర్‌గా కనిపించనున్నారు.
టాపిక్