India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు టీమిండియా.. ఇదీ షెడ్యూల్
29 November 2023, 21:05 IST
- India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది టీమిండియా. తాజాగా బుధవారం (నవంబర్ 29) లంక బోర్డు రిలీజ్ చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ లో ఇండియన్ టీమ్ సిరీస్ ఉండటం విశేషం.
శ్రీలంకలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనున్న టీమిండియా
India vs Sri Lanka: టీమిండియా మరోసారి శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈసారి కేవలం వైట్ బాల్ సిరీస్ మాత్రమే ఆడనుంది. అయితే ఈ టూర్ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కావడం విశేషం. బుధవారం (నవంబర్ 29) శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీమ్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేయగా.. అందులో ఇండియా సిరీస్ గురించి ప్రస్తావించారు.
వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే ఇండియన్ టీమ్ శ్రీలంక టూర్ కోసం వెళ్లనుంది. ఇందులో భాగంగా లంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ మొత్తం వచ్చే ఏడాది జులైలోనే జరగనుంది. చివరిసారి 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లింది టీమిండియా.
అప్పట్లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. వన్డే సిరీస్ ను 2-1తో గెలవగా.. టీ20 సిరీస్ ను అంతే తేడాతో కోల్పోయింది. శ్రీలంక టీమ్ వచ్చే ఏడాదిని స్వదేశంలో జింబాబ్వేతో సిరీస్ తో మొదలుపెట్టనుంది. ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లలో తలపడనుంది. మొత్తంగా 2024లో టీ20 వరల్డ్ కప్ కాకుండా శ్రీలంక టీమ్ 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు ఆడనుంది.
ఇంగ్లండ్ లో మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది నవంబర్ లో సౌతాఫ్రికా టూర్ కు కూడా వెళ్లనుంది. 2024లో శ్రీలంక టీమ్ ఆడబోయే రెండు కఠినమైన సిరీస్ లు ఇవే. వరల్డ్ కప్ 2023లో లీగ్ స్టేజ్ లోనే 9వ స్థానంలో నిలిచిన శ్రీలంక కనీసం 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా నేరుగా అర్హత సాధించలేకపోయింది.
టాపిక్