IND vs SA World Cup Final 2024 Live: విశ్వవిజేతగా భారత్.. టీ20 ప్రపంచకప్ కైవసం.. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై గెలుపు
29 June 2024, 23:54 IST
IND vs SA World Cup Final: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‍లో నేడు (జూన్ 29) దక్షిణాఫ్రికాను చిత్తు చేసి భారత్ గెలిచింది. విశ్వవిజేతగా నిలిచింది రోహిత్ శర్మ సేన. 17 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి టీ20 ప్రపంచకప్ గెలిచింది.
టీ20లకు గుడ్‍బై చెప్పిన కోహ్లీ
అంతర్జాతీయ టీ20లకు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనలే భారత్ తరఫున కోహ్లీకి చివరి టీ20 మ్యాచ్.
ఎమోషనల్ అయిన భారత ఆటగాళ్లు
ప్రపంచకప్ ఫైనల్‍లో గెలిచాక భారత ఆటగాళ్లు ఎమోషనల్ అయ్యారు. హార్దిక్ పాండ్యా కన్నీళ్లు పెట్టున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు.
భారత్ ఉత్కంఠ గెలుపు
ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా తలా రెండు వికెట్లతో దుమ్మురేపారు. మ్యాచ్ ఓడిపోతుందనుకున్న దశ నుంచి గెలిపించారు. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది.
విశ్వవిజేతగా భారత్.. టీ20 ప్రపంచకప్ కైవసం
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. టైటిల్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై తుదిపోరులో 7 పరుగులతో భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ సేన ట్రోఫీ దక్కించుకుంది. భారత్‍కు ఇది రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‍గా ఉంది.
చివరి ఓవర్లో 16
ఫైనల్ మ్యాచ్ భారత్ చేతికి వచ్చేసింది. చివరి ఓవర్లో గెలుపునకు 16 పరుగులు చేయాలి దక్షిణాఫ్రికా. 18వ ఓవర్లో బుమ్రా కేవలం రెండు, 19వ ఓవర్లో అర్షదీప్ 4 రన్స్ ఇవ్వడంతో మ్యాచ్ భారత్ చేతికి మళ్లీ వచ్చింది.
బుమ్రా సూపర్ బాల్
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. మార్కో జాన్సెన్ (2)ను బౌల్డ్ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. ఆ జట్టు గెలువాలంటే 14 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది.
క్లాసెన్‍ను ఔట్ చేసిన హార్దిక్
దూకుడుగా హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (52)ను భారత బౌలర్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 151 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది సఫారీ టీమ్. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికా గెలువాలంటే 22 బంతుల్లో 26 పరుగులు చేయాలి.
క్లాసెన్ కుమ్ముడు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 49 పరుగులు నాటౌట్) భీకర హిట్టింగ్ చేస్తున్నాడు. దీంతో 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. గెలుపు కోసం 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే సరిపోతుంది. మిల్లర్ (14 నాటౌట్) కూడా వేగంగా ఆడుతున్నాడు.
డికాక్ ఔట్
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (39)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. దీంతో 12.3 ఓవర్లలో సౌతాఫ్రికా 106 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ ఫైనల్‍పై టీమిండియా పట్టుబిగిస్తోంది. గెలువాలంటే దక్షిణాఫ్రికా 45 బంతుల్లో 71 పరుగులు చేయాలి.
మూడో వికెట్ పడగొట్టిన భారత్
ట్రిస్టన్ స్టబ్స్ (31)ను ఔట్ చేసి భారత్‍కు బ్రేక్ త్రూ ఇచ్చాడు అక్షర్ పటేల్. తొమ్మిదో ఓవర్ 5వ బంతికి ట్రిస్టన్‍ను అక్షర్ బౌల్డ్ చేశాడు. దీంతో 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా.
దీటుగా ఆడుతున్న డికాక్, స్టబ్స్
వేగంగా రెండు వికెట్లు పడ్డాక దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్ (21 బంతుల్లో 28 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (17 బంతుల్లో 24 పరుగులు) దీటుగా ఆడుతున్నారు. దీంతో 8 ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 62 పరుగులు చేసింది.
మార్క్‌రమ్‍ను ఔట్ చేసిన అర్షదీప్
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (4)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. దీంతో 12 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు. టీమిండియాకు అద్భుత ఆరంభం దక్కింది.
హెండ్రిక్స్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా
దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా. సఫారీ ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (4)ను రెండో ఓవర్లో బౌల్డ్ చేశాడు. దీంతో 7 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.
దక్షిణాఫ్రికాకు దీటైన టార్గెట్ ఇచ్చిన భారత్
నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాకు 177 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారత స్టార్ విరాట్ కోహ్లీ (76) అర్ధ శతకంతో దుమ్మురేపగా.. అక్షర్ పటేల్ (47), శివం దూబే (27) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ఎన్రిచ్ నార్జే తలా రెండు, జాన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.
కోహ్లీ ఔట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (76) అద్బుత ఇన్నింగ్స్ ఆడి 19వ ఓవర్లో ఔటయ్యాడు. 19 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. శివం దూబే (23 నాటౌట్) దూకుడు కొనసాగిస్తున్నాడు.
150 చేరిన భారత్
18 ఓవర్లకు భారత్ 4 వికెట్లకు 150 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ (64 నాటౌట్), శివమ్ దూబే (22 నాటౌట్) దూకుడు పెంచారు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కీలకమైన ఫైనల్‍లో రాణించాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరాడు కోహ్లీ. శివం దూబే (12 బంతుల్లో 21 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో 17 ఓవర్లలో 4 వికెట్లకు 134 రన్స్ చేసింది భారత్.
అక్షర్ పటేల్ రనౌట్
జోరుగా ఆడుతున్న భారత బ్యాటర్ అక్షర్ పటేల్ (47) రనౌట్ అయ్యాడు. దీంతో 13.3 ఓవర్లలో 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇండియా. విరాట్ కోహ్లీ (43 నాటౌట్) దీటుగా ఆడుతున్నాడు.
దూకుడు పెంచిన అక్షర్ పటేల్
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (29 బంతుల్లో 40 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 43 పరుగులు నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 13 ఓవర్లో ముగిసే సరికి భారత్ 98 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న కోహ్లీ, అక్షర్
విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 36 పరుగులు నాటౌట్), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 26 పరుగులు) నిలకడగా ఆడటంతో టీమిండియా కోలుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్లకు 75 పరుగులు చేసింది. త్వరగా మూడు వికెట్ల కోల్పోయాక కోహ్లీ, అక్షర్ భాగస్వామ్యం నెలకొల్పుతున్నారు.
నిలకడగా ఆడుతున్న కోహ్లీ
త్వరత్వరగా మూడు వికెట్లు పడగా.. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ (21 బంతుల్లో 26 పరుగులు నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ (9 నాటౌట్) మరో ఎండ్‍లో ఉన్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లకు 49 పరుగులుచేసింది.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
ఫైనల్ పోరులో టీమిండియాకు మరో షాక్ తగిలింది. భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ (3) ఐదో ఓవర్లో ఔటయ్యాడు. కగిసో రబాడ బౌలింగ్‍లో క్యాచౌట్ అయ్యాడు. దీంతో 34 పరుగలకు మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. విరాట్ కోహ్లీ (22 నాటౌట్) ధీటుగా ఆడుతున్నాడు.
రిషబ్ పంత్ డకౌట్
టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ ఔటైన రెండో ఔవర్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో 24 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయంది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఫుల్ ఫామ్‍లో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (9) ఫైనల్‍లో నిరాశపరిచాడు. రెండో ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్‍లో ఔటయ్యాడు రోహిత్. దీంతో 23 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ (14 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు.
దూకుడుగా ఆరంభించిన టీమిండియా
టీమిండియా బ్యాటింగ్‍ను దూకుడుగా మొదలుపెట్టింది. తొలి ఓవర్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఫోర్లు కొట్టాడు. మొత్తంగా ఫస్ట్ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
దక్షిణాఫ్రికా తుదిజట్టు ఇలా..
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్జే, తబ్రైజ్ షంషీ.
టీమిండియా తుదిజట్టు ఇలా
తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు టీమిండియా.
రోహిత్ శర్మ(కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా
టాస్ గెలిచిన టీమిండియా
టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత్ టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
రాహుల్ ద్రవిడ్ ఆఖరి మ్యాచ్
టీమిండియా హెడ్ కోచ్‍గా దిగ్గజం రాహుల్ ద్రవిడ్‍కు ఇది చివరి మ్యాచ్. ఈ ఫైనల్ తర్వాత ఆ స్థానం నుంచి ద్రవిడ్ తప్పుకోనున్నారు.
వాతావరణం ఇలా..
బార్బడోస్‍లో ప్రస్తుతం వాన లేదు. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంది.
విరాట్‍పైనే అందరి కళ్లు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ 2024 మెగాటోర్నీలో ఇప్పటి వరకు నిరాశపరిచాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఫైనల్‍లో అయినా కోహ్లీ అదరగొడతాడని అందరి కళ్లు అతడిపైనే ఉండున్నాయి.
మెరుగైన వాతావరణ పరిస్థితులు
బార్బడోస్‍లో వాతావరణం మరింత మెరుగైంది. కాస్త ఎండ వచ్చింది. దీంతో మ్యాచ్ సమయానికి జరుగుతుందనే ఆశలు చిగురించాయి.
బార్బడోస్ పిచ్ ఇలా..
బార్బడోస్ పిచ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. పేసర్లకు, స్పిన్‍కు కూడా అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో గత 20 మ్యాచ్‍ల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 156 పరుగులుగా ఉంది.
తగ్గిన వాన
బార్బడోస్‍లో ప్రస్తుతం వర్షం ఆగిపోయింది. అయితే, ఆకాశం మేఘావృతమై ఉంది.
భారీ వర్షం
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ జరగాల్సిన బార్బడోస్ స్టేడియం వద్ద ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో మ్యాచ్‍పై టెన్షన్ నెలకొంది.
విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి విజేతగా నిలిచిన జట్టుకు 20.2 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు 10.67 కోట్లు వస్తాయి. సెమీస్‌లో ఓడిన ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్ తలో 6.56 కోట్లు సొంతం చేసుకోనున్నాయి.
నాలుగు మ్యాచుల్లో టీమిండియానే విన్నర్...
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచుల్లో ఇండియా గెలుపొందగా ...రెండు సార్లు మాత్రమే సౌతాఫ్రికా విజయాన్ని సాధించింది.
సౌతాఫ్రికా ఫస్ట్ టైమ్
టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. 2009తో పాటు 2014లో సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికా వెనుదిరిగింది. ఈ సారి సెమీస్ అడ్డంకిని దాటి ఫైనల్‌లో అడుగుపెట్టింది.
రోహిత్ మూడో ప్లేస్...
టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోమూడో స్థానంలో రోహిత్ కొనసాగుతోన్నాడు. ఏడు మ్యాచుల్లో 41.33 యావరేజ్, 155.97 స్ట్రేక్ రేట్‌తో రోహిత్ శర్మ 248 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రహ్మనుల్లా గుర్భాజ్ (281), ట్రావిస్ హెడ్(255) ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లలో నిలిచారు.
రిజర్వ్ డే - రెండున్నర గంటల అదనపు సమయం
ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బార్బడోస్‌లో శనివారం వర్షం పడే అవకాశాలు 70 శాతం పైనే ఉన్నాయని వాతావరణ వర్గాలు చెబుతోన్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. వర్షం వల్ల శనివారం మ్యాచ్ నిర్వహించడం కుదరకపోతే ఆదివారం మ్యాచ్ జరుగుతుంది. . అంతే కాకుండా రెండు రోజులకు కలిపి రెండున్నర గంటల అదనపు సమయాన్ని కేటాయించారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కానీ పక్షంలో ఫైనల్ చేరిన ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
బార్బడోస్‌లో మూడు మ్యాచులు - ఒకటే విజయం
బార్బడోస్ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడింది. ఇందులో ఇదే వరల్డ్ కప్‌లో సూపర్ 8లో ఆఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ స్టేడియంలో 2010 టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు ఆడిన టీమిండియా ఓటమి చవిచూసింది.
కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?
వరల్డ్ కప్ ఫైనల్‌లో కోహ్లి ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నీలో ఏడు మ్యాచుల్లో కలిసి కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లి. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగుతోన్న కోహ్లి దారుణంగా విఫలమవుతోన్నాడు. ఫైనల్‌లో కోహ్లి బ్యాట్ ఝులిపించి భారీ స్కోరు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2022 టీ20 వరల్డ్ కప్
2022 టీ20 వరల్డ్ కప్‌లో చివరగా టీమిండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 133 పరుగులు మాత్రమే చేసింది. ఈ టార్గెట్‌ను సౌతాఫ్రికా చివరి ఓవర్‌లో ఛేజ్ చేసింది.
టీమిండియాదే డామినేషన్....
టీ20ల్లో సౌతాఫ్రికాపై ఇండియాదే డామినేషన్ కనిపిస్తోంది. టీ20 ఫార్మెట్‌లో ఇండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు ఇరవై ఆరు సార్లు తలపడ్డాయి. అందులో 14 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించగా 11 సార్లు సౌతాఫ్రికా గెలిచింది. ఓ మ్యాచ్ రద్ధయింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆరుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచుల్లో ఇండియా జయకేతనం ఎగురవేయగా రెండు సార్లు మాత్రమే సౌతాఫ్రికా గెలిచింది.
మూడోసారి ఫైనల్‌లోకి టీమిండియా...
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. 2007 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా...2014లో రన్నరప్‌గా నిలిచింది. పదేళ్ల తర్వాత మూడోసారి ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.