India vs South Africa 1st Test: మూడు రోజుల్లోనే చేతులెత్తేసిన టీమిండియా.. తప్పని ఇన్నింగ్స్ ఓటమి
28 December 2023, 20:43 IST
- India vs South Africa 1st Test: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడి రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది.
టీమిండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, గిల్, రోహిత్ క్లీన్ బౌల్డ్
India vs South Africa 1st Test: సౌతాఫ్రికా పేసర్లను ఎదుర్కోలేక మరోసారి బ్యాటర్లు చేతులెత్తేయడంతో తొలి టెస్టులో మూడు రోజుల్లోపే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైన ఇండియన్ టీమ్.. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే చాప చుట్టేసింది. కోహ్లి (76) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు.
బ్యాటింగ్, బౌలింగ్ లలో దారుణంగా విఫలమైన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై మరో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయి రెండు టెస్టుల సిరీస్ లో 0-1తో వెనుకబడింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు మరింత దారుణమైన ప్రదర్శన చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0), యశస్వి జైస్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (5), శ్రేయస్ అయ్యర్ (6), కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యారు.
విరాట్ కోహ్లి ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 76 రన్స్ చేసి చివరి వికెట్ గా అతడు వెనుదిరిగాడు. సౌతాఫ్రికా పేసర్లు బర్గర్ 4, యాన్సెన్ 3, రబాడా 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. బ్యాటర్లందరూ సౌతాఫ్రికా పేసర్లను చూసి వణికిపోయారు. క్రీజులో నిలదొక్కుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 408 పరుగులు చేసి 163 పరుగులు ఆధిక్యం సంపాదించింది. డీన్ ఎల్గార్ (185) భారీ సెంచరీ చేయగా.. యాన్సెన్ 84 రన్స్ తో అజేయంగా నిలిచాడు. బెడింగామ్ 56 రన్స్ చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు 5 వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా.. మూడో రోజు బౌలర్లు చేతులెత్తేయడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది.
మ్యాచ్ మొత్తంలో రెండు ఇన్నింగ్స్ కలిపి టీమిండియా కేవలం 102 ఓవర్లు మాత్రమే ఆడగలిగిందంటే సౌతాఫ్రికా పేసర్ల జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సీనియర్ పేసర్ రబాడాతోపాటు లెఫ్టామ్ పేసర్లు బర్గర్, యాన్సెన్ ముప్పుతిప్పలు పెట్టారు. ఈ ఓటమితో సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల మరోసారి కలగానే మిగిలిపోయింది. రెండో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు జరగనుంది.