India vs Afghanistan 1st T20I: చివర్లో దంచి కొట్టిన నబీ, జద్రాన్.. టీమిండియా ముందు మోస్తరు టార్గెట్
11 January 2024, 20:36 IST
- India vs Afghanistan 1st T20: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఓ మోస్తరు స్కోరు చేసింది. మహ్మద్ నబీ చెలరేగడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 రన్స్ చేసింది.
ఆఫ్ఘనిస్థాన్ ను కట్టడి చేసిన అక్షర్ పటేల్, కెప్టెన్ రోహిత్ శర్మ
India vs Afghanistan 1st T20: ఆఫ్ఘనిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా మొహాలీలో తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 రన్స్ చేసింది. మొదట్లో ఆఫ్ఘన్ టీమ్ ను బాగానే కట్టడి చేసిన ఇండియన్ బౌలర్లు.. మిడిల్, డెత్ ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు.
తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 57 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్థాన్.. చివరి 10 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ రాబట్టడం విశేషం. మహ్మద్ నబీ 27 బంతుల్లో 42 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చివర్లో నజీబుల్ల జద్రాన్ 11 బంతుల్లో 19, కరీమ్ జనత్ 5 బంతుల్లో 9 రన్స్ చేయడంతో ఆఫ్ఘన్ టీమ్ ఓ మోస్తరు స్కోరు సాధించగలిగింది.
టాస్ గెలిచిన టీమిండియా.. మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొహాలీలో రాత్రిపూట మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉండటంతో రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఆఫ్ఘన్ ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ మంచి ఆరంభం ఇచ్చారు. 8 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. ఈ సమయంలో గుర్బాజ్(23) ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.
ఆ వెంటనే శివమ్ దూబె కూడా ఇబ్రహీం జద్రాన్ (25)ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో 50 రన్స్ దగ్గరే రెండు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే రెహ్మత్ షా (3) కూడా ఔటవడంతో 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఒమర్జాయ్ తో జత కలిసిన మహ్మద్ నబీ ఆఫ్ఘన్ టీమ్ కు మంచి భాగస్వామ్యం అందించాడు.
ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 68 రన్స్ జోడించారు. భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న సమయంలో ఒమర్జాయ్ 22 బంతుల్లో 29 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే టాప్ ఫామ్ లో ఉన్న మహ్మద్ నబీ (27 బంతుల్లో 42) కూడా ఔటవడంతో ఆఫ్ఘన్ టీమ్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
టాపిక్