Ind vs SL Asia Cup Live Updates: భారత బౌలర్లు అదుర్స్.. 41 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా గెలుపు
12 September 2023, 21:59 IST
- Ind vs SL Asia Cup Live Updates: ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‍లో శ్రీలంకపై టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులు చేసింది. అయితే, టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను 172 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఆసియాకప్ 2023 ఫైనల్ చేరిన భారత్
శ్రీలంకతో నేడు ఈ మ్యాచ్ గెలవటంతో ఆసియాకప్ 2023 ఫైనల్ చేరింది టీమిండియా. ఇప్పటికే సూపర్-4లో పాకిస్థాన్‍పై కూడా గెలిచింది. దీంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని తుదిపోరుకు చేరింది.
అదరగొట్టిన భారత బౌలర్లు.. శ్రీలంకపై భారత్ గెలుపు
ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో శ్రీలంకపై టీమిండియా 41 పరుగుల తేడాతో గెలిచింది. పతిరణను కుల్‍దీప్ బౌల్డ్ చేయటంతో లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 213 పరుగులే చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడారు. శ్రీలంకను కుప్పకూల్చారు. కుల్దీప్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు తిశారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన లంక
రజితను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. దీంతో 172 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది లంక. ఇక టీమిండియా గెలుపు కోసం ఒక్క వికెట్ కావాలి.
తీక్షణ ఔట్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
భారత బౌలర్ హార్దిక్ పాండ్యా.. శ్రీలంక బ్యాటర్ మహీశ్ తీక్షణను పెవిలియన్‍కు పంపాడు. దీంతో 40.5 ఓవర్లలో 171 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది శ్రీలంక. గెలవాలంటే లంక ఇంకా 55 బంతుల్లో 43 పరుగులు చేయాల్సి ఉంది. మరో రెండు వికెట్లు తీస్తే టీమిండియా గెలుస్తుంది.
డిసిల్వను ఔట్ చేసిన జడేజా.. భాగస్వామ్యానికి బ్రేక్
శ్రీలంక బ్యాటర్ ధనుంజయ డిసిల్వ (41)ను కీలక సమయంలో ఔట్ చేశాడు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా. డిసిల్వ, వెల్లలాగే భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 37.3 ఓవర్లలో 162 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది లంక. గెలవాలంటే శ్రీలంక ఇంకా 12.3 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి ఉంది. వెల్లలాగే (35 నాటౌట్), మహీష్ తీక్షణ (0 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
దీటుగా ఆడుతున్న డిసిల్వ, వెల్లలాగే
ధనంజయ్ డిసిల్వ (40 నాటౌట్), దునిత్ వెల్లలాగే (28 నాటౌట్) దీటుగా ఆడుతుండటంతో మ్యాచ్ ఆసక్తిగా మారుతోంది. 35 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది శ్రీలంక. భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గెలవాలంటే 15 ఓవర్లలో ఇంకా 60 పరుగులు చేయాలి శ్రీలంక.
నిలకడగా ఆడుతున్న డిసిల్వ, వెల్లలాగే
ఆరు వికెట్లు పడ్డాక శ్రీలంక బ్యాటర్లు ధనుంజయ డిసిల్వ (32 నాటౌట్) దునిత్ వెల్లలాగే (15 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 31 ఓవర్లలో శ్రీలంక 6 వికెట్లకు 133 పరుగులకు చేరింది. గెలుపునకు లంక 81 పరుగుల దూరంలో ఉంది.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను ఔట్ చేశాడు భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా. దీంతో 25.1 ఓవర్లకు 99 పరుగుల వద్ద లంక ఆరో వికెట్ కోల్పోయింది. 214 పరుగుల లక్ష్యఛేదనలో పీకల్లోతు కష్టాల్లో పడింది లంక.
కుప్పకూలుతున్న లంక.. ఐదో వికెట్ డౌన్
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండో వికెట్ పడగొట్టాడు. చరిత్ అసలంకను పెలివియన్‍కు పంపాడు. దీంతో 19.2 ఓవర్లలో శ్రీలంక 73 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ధనుంజయ డిసిల్వ, దసున్ శనక బ్యాటింగ్ చేస్తున్నారు.
సమరవిక్రమ ఔట్.. లంక నాలుగో వికెట్ డౌన్
లంక బ్యాటర్ సదీర సమరవిక్రమ (17)ను భారత స్పిన్నర్ కుల్దీప్ యాద్ ఔట్ చేశాడు. దీంతో 17.3 ఓవర్లకు 68 పరుగులకు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది శ్రీలంక.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నెను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ పెవిలియన్‍కు పంపాడు. దీంతో 7.1 ఓవర్లలో లంక 25 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కష్టాల్లో పడింది.
శ్రీలంక రెండో వికెట్ డౌన్.. మళ్లీ బుమ్రానే
25 పరుగుల వద్ద (6.4 ఓవర్లు) శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. లంక బ్యాటర్ కుషాల్ మెండిస్ (15)ను భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా స్లో బాల్‍తో ఔట్ చేశాడు.
తొలి వికెట్ తీసిన జస్‍ప్రీత్ బుమ్రా
శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంక (6)ను భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మూడో ఓవర్లో ఔట్ చేశాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. 2.1 ఓవర్లలో 7 పరుగుల వద్ద లంక తొలి వికెట్ కోల్పోయింది.
లక్ష్యఛేదన మొదలుపెట్టిన శ్రీలంక
214 పరుగుల లక్ష్య ఛేదనను శ్రీలంక మొదలుపెట్టింది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తున్నాడు. లంక ఓపెనర్లు పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె బ్యాటింగ్‍కు దిగారు.
213 పరుగులకు టీమిండియా ఆలౌట్
శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులతో రాణించటంతో టీమిండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. చివరి వికెట్‍గా అక్షర్ వెనుదిరగగా.. సిరాజ్ (5) నాటౌట్‍గా నిలిచాడు. లంక ముందు 214 పరుగుల టార్గెట్ ఉంది. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టారు.
200 పరుగులు దాటిన భారత్ స్కోరు
టీమిండియా స్కోరు 47.2 ఓవర్లలో 200 పరుగుల మార్కుకు చేరింది. 9 వికెట్లు పడిపోగా.. అక్షర్ (17), సిరాజ్ (2) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఆట మళ్లీ మొదలు
వాన నిలువటంతో ఆట మళ్లీ షురూ అయింది. టీమిండియా స్కోరు 47 ఓవర్లకు 197/9 గా ఉంది. మరో వికెట్ చేతిలో ఉండగా.. ఇంకా మూడు ఓవర్లు ఉన్నాయి.
తగ్గిన వర్షం
కొలంబో స్టేడియం వద్ద వర్షం తగ్గింది. దీంతో కవర్లను తొలగిస్తున్నారు స్టేడియం సిబ్బంది. దీంతో కాసేపట్లో మ్యాచ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
వాన షురూ.. నిలిచిన ఆట
47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది టీమిండియా. ఈ తరుణంలో వర్షం మొదలైంది. దీంతో ఆట ఆగిపోయింది. క్రీజులో అక్షర్ పటేల్ (15 నాటౌట్), మహమ్మద్ సిరాజ్ (2 నాటౌట్) ఉన్నారు. శ్రీలంక స్పిన్నర్ల విజృంభణతో టీమిండియా కష్టాల్లో పడి.. తక్కువ స్కోరుకే పరిమితమవుతోంది.
కుల్‍దీప్ యాదవ్ కూడా ఔట్
భారత ఆటగాడు కుల్‍దీప్ యాదవ్ (0) తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో 186 పరుగుల వద్దే తొమ్మిదో వికెట్ కోల్పోయింది టీమిండియా.
బుమ్రా బౌల్డ్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇండియా
భారత ప్లేయర్ జస్‍ప్రీత్ బుమ్రా (5) కూడా అసలంక బౌలింగ్‍లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 42.1 ఓవర్లలో 186 పరుగుల వద్ద 8 వికెట్ కోల్పోయింది టీమిండియా. ఔట్ అయ్యే ప్రమాదంలో ఉంది.
జడేజా ఔట్
39వ ఓవర్లో అసలంక బౌలింగ్‍లో భారత ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా (4) ఔటయ్యాడు. దీంతో 178 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత్.
హార్దిక్ పాండ్యా కూడా ఔట్.. పీకల్లోతు కష్టాల్లో భారత్.. వెల్లలాగేకు ఐదు వికెట్లు
భారత బ్యాటర్ హార్దిక్ పాండ్యా (5) ఔటయ్యాడు. దీంతో 36 ఓవర్లలో భారత్ 172 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
పెవిలియన్ చేరిన ఇషాన్ కిషన్
టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (33) కూడా పెవిలియన్ చేరాడు. లంక బౌలర్లు అసలంక అతడిని ఔట్ చేశాడు. 35 ఓవర్లలో టీమిండియా 171 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (5 నాటౌట్), రవీంద్ర జడేజా (1 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ కూడా ఔట్
భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (39) కూడా ఔటయ్యాడు. దీంతో 30 ఓవర్లలో 4 వికెట్లకు టీమిండియా 155 పరుగులకు చేరింది. ఇషాన్ కిషన్ (23) క్రీజులో ఉండగా.. హార్దిక్ పాండ్యా జత కలిశాడు.
నిలకడగా ఆడుతున్న రాహుల్, కిషన్
భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్ (23 నాటౌట్), ఇషాన్ కిషన్ (19 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 27 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లకు 134 పరుగులు చేసింది.
20 ఓవర్లకు 109/3
20 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (11 నాటౌట్), కేఎల్ రాహుల్ (7 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
త్వరగా ఔటైన కోహ్లీ
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3).. లంక స్పిన్నర్ వెల్లలాగే బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో 13.5 ఓవర్లలో 90 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.
రోహిత్ శర్మ అర్ధ శతకం
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. ఇప్పటి వరకు 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. కోహ్లీ ఔట్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకానికి చేరాడు. విరాట్ కోహ్లీ రెండో వికెట్‍గా వెనుదిరిగాడు.
గిల్ ఔట్
11.1 ఓవర్లలో 80 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. వెల్లలాగే బౌలింగ్లో భారత ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (19) బౌల్డ్ అయ్యాడు.
దుమ్మురేపుతున్న రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (39 నాటౌట్) దూకుడుగా ఆడుతుంటంతో 10 ఓవర్లలో టీమిండియా వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసింది. శుభ్‍మన్ గిల్ (18 నాటౌట్).. రోహిత్‍కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ సహకరిస్తున్నాడు.
10వేల పరుగులు దాటిన రోహిత్
వన్డేల్లో 10వేల పరుగుల మార్కును రోహిత్ శర్మ దాటాడు. 241 ఇన్నింగ్స్ లో ఈ మార్కును దాటాడు. వేగంగా ఈ మైలురాయి చేరిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్
టీమిండియా ఓపెనర్లు దీటుగా ఆడుతున్నారు. దీంతో 7 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (23 నాటౌట్), శుభ్‍మన్ గిల్ (13 నాటౌట్) ధాటిగా ఆడుతున్నారు. టీమిండియా ఓపెనర్లు దీటుగా ఆడుతున్నారు. దీంతో 7 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (23 నాటౌట్), శుభ్‍మన్ గిల్ (13 నాటౌట్) ధాటిగా ఆడుతున్నారు.
Ind vs SL Live Updates: నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ, గిల్
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (9 నాటౌట్), శుభ్‍మన్ గిల్ (4 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది.
తొలి ఓవర్లో 7 పరుగులు
కసున్ రజిత వేసిన తొలి ఓవర్లో టీమిండియా ఏడు పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఓ ఫోర్ కొట్టాడు.
బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్
శ్రీలంకతో మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్‍ను టీమిండియా మొదలుపెట్టింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ బ్యాటింగ్‍కు దిగారు. లంక పేసర్ రజిత తొలి ఓవర్ వేస్తున్నాడు.
తుది జట్లు ఇవే
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
శ్రీలంక తుదిజట్టు: పాతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుషాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దిముత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరణ
ఒక మార్పుతో టీమిండియా
శ్రీలంకతో మ్యాచ్ కోసం తుదిజట్టులో ఓ మార్పు చేసింది టీమిండియా. శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్నర్ అక్షర్ పటేల్ భారత జట్టులోకి వచ్చాడు.
టాస్ గెలిచిన టీమిండియా.. ముందుగా బ్యాటింగ్
శ్రీలంకతో మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
స్పిన్‍కు అనుకూలంగా పిచ్
కొలంబో పిచ్ డ్రైగా ఉంటంతో.. నేడు కూడా స్పిన్‍ను అనుకూలించేలా ఉంది.
Ind vs SL Asia Cup Live Updates: కొలంబోలో మెరుగైన వాతావరణం
కొలంబోలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో చిక్కటి ఎండ కాస్తోంది. వర్షం జాడ లేకపోవడంతో ఇండియా, శ్రీలంక మ్యాచ్ సజావుగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే 3 గంటల నుంచి వర్షం కురిసే అవకాశాలు 90 శాతం వరకూ ఉన్నాయి.
Ind vs SL Asia Cup Live Updates: అయ్యర్ ఈ మ్యాచ్‌కూ దూరం
శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో మ్యాచ్ కూ దూరమయ్యాడు. అతడు కాస్త కోలుకున్నా.. విశ్రాంతి అవసరం అని మెడికల్ టీమ్ చెప్పినట్లు బీసీసీఐ వెల్లడించింది. టీమ్ తో కలిసి అయ్యర్ స్టేడియానికి వెళ్లలేదని కూడా తెలిపింది.
Ind vs SL Asia Cup Live Updates: ఆ ప్లేయర్స్‌కు రెస్ట్?
వరుసగా మూడు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో ఇండియన్ ప్లేయర్స్ అలసిపోయారు. దీంతో శ్రీలంకతో జరిగే సూపర్ 4 మ్యాచ్ లో ఎవరికైనా రెస్ట్ ఇవ్వబోతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. కోహ్లి, రాహుల్ లాంటి వాళ్లు సెంచరీలు చేయడంతోపాటు ఫీల్డింగ్ కూడా చేశారు. బుమ్రా కూడా ఐదు ఓవర్లు వేశాడు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరికైనా రెస్ట్ ఇస్తారా అన్నది చూడాలి. పైగా శ్రీలంకతో మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుతగిలే అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.
Ind vs SL Asia Cup Live Updates: రోహిత్ మరో సిక్స్ కొడితే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో సిక్స్ కొడితే ఆసియా కప్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ఇప్పటి వరకూ ఈ టోర్నీ చరిత్రలో 26 సిక్స్ లతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది టాప్ లో ఉన్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రోహిత్ ఆ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు శ్రీలంకపై మరో సిక్స్ కొడితే ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్స్ ల రికార్డు అతని సొంతమవుతుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సమం చేయడానికి రోహిత్ 10 సిక్స్ ల దూరంలో ఉన్నాడు.
Ind vs SL Asia Cup Live Updates: 10 వేలకు 22 పరుగుల దూరంలో రోహిత్
వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 22 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 10) పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే ఆ రికార్డు అందుకుంటాడని అనుకున్నా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఒకవేళ శ్రీలంకతో మ్యాచ్ లో 10 వేల మైల్ స్టోన్ అందుకుంటే.. విరాట్ కోహ్లి (205 ఇన్నింగ్స్) తర్వాత అత్యంత వేగంగా ఆ మార్క్ చేరుకున్న రెండో ప్లేయర్ గా రోహిత్ నిలుస్తాడు. రోహిత్ కు ఇది 241వ ఇన్నింగ్స్. సచిన్ 259, గంగూలీ 263, పాంటింగ్ 266, కలిస్ 272, ధోనీ 273, లారా 278 ఇన్నింగ్స్ లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
Ind vs SL Asia Cup Live Updates: శ్రీలంకపై ఈ మధ్యకాలంలో ఇండియా రికార్డు ఇదీ
శ్రీలంక ప్రస్తుతం వన్డేల్లో 13 వరుస విజయాలతో ఊపు మీదుంది. అయితే ఇండియాతో మాత్రం వాళ్ల పప్పులుడకలేదు. చివరి 10 మ్యాచ్ లలో 8సార్లు శ్రీలంకను ఇండియా ఓడించింది. ఇక చివరిసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఇండియా ఏకంగా 317 పరుగులతో లంకను చిత్తు చేసింది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లి 166 రన్స్ చేయగా.. ఇండియా 5 వికెట్లకు 390 రన్స్ చేసింది. తర్వాత సిరాజ్ చెలరేగి 4 వికెట్లు తీయడంతో లంక కేవలం 73 పరుగులకే కుప్పకూలింది.
Ind vs SL Asia Cup Live Updates: ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ రద్దయితే..
ఆసియా కప్ 2023లో ఇండియా ఆడుతున్న మ్యాచ్ లన్నింటికీ వర్షం అడ్డుపడుతోంది. పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ రద్దవగా.. నేపాల్ పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది. ఇక పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ కు కూడా వర్షం అడ్డు తగలగా.. రిజర్వ్ డే నాడు విజయం సాధించింది. ఒకవేళ ఇండియా ఆడబోయే మిగతా రెండు సూపర్ 4 మ్యాచ్ లు కూడా రద్దయితే రోహిత్ సేన నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అటు శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ కూడా రద్దయితే ఫైనల్లో ఇండియాతో శ్రీలంక తలపడుతుంది. ఒకవేళ శ్రీలంకతో మ్యాచ్ జరిగి ఇండియా గెలిస్తే మాత్రం మంగళవారమే (సెప్టెంబర్ 12) తన ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.
Ind vs SL Asia Cup Live Updates: శ్రేయస్ అయ్యర్ ఇక బెంచ్‌కే పరిమితమా?
పాకిస్థాన్‌తో మ్యాచ్ కు ముందు శ్రేయస్ అయ్యర్ కాస్త వెన్ను పట్టేసినట్లుగా ఉండటంతో ఆడటం లేదని, చివరి నిమిషంలో రాహుల్ ను ఎంపిక చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. రాహుల్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పాకిస్థాన్ లాంటి టీమ్ పై సెంచరీ చేశాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. అది కూడా పాకిస్థాన్ పై. రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తో ఇక శ్రేయస్ అయ్యర్ బెంచ్ కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్ లోనే ఇండియా అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
Ind vs SL Asia Cup Live Updates: వరుస విజయాలతో ఊపు మీదున్న శ్రీలంక
శ్రీలంక వరుస విజయాలతో ఊపు మీద ఉంది. ఇప్పటి వరకూ వన్డేల్లో శ్రీలంక వరుసగా 13 విజయాలు సాధించింది. ఆసియా కప్ లోనూ ఆడిన మూడు మ్యాచ్ లలో లంక గెలిచింది. లీగ్ స్టేజ్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్.. సూపర్ 4లో మరోసారి బంగ్లాదేశ్ పై విజయం సాధించడం విశేషం. ఆస్ట్రేలియా (21 విజయాలు) తర్వాత వన్డే క్రికెట్ లో వరుసగా ఇన్ని విజయాలు సాధించిన రెండో టీమ్ శ్రీలంక. ఆస్ట్రేలియా 2003, జనవరి నుంచి మే మధ్య వరుసగా 21 వన్డేల్లో గెలిచింది. అందులో 2003 వరల్డ్ కప్ విజయం కూడా ఉంది.
Ind vs SL Asia Cup Live Updates: కొలంబో వాతావరణం ఎలా ఉందంటే..
ఆసియా కప్ లో ప్రతి మ్యాచ్ కు పిలవకుండానే వచ్చేస్తున్న వరుణుడు ఇండియా, శ్రీలంక సూపర్ 4 మ్యాచ్ కు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు మ్యాచ్ ప్రారంభమయ్యే 3 గంటల సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో మ్యాచ్ ప్రారంభమే ఆలస్యం కావచ్చు. మంగళవారం (సెప్టెంబర్ 12) రోజంతా 90 శాతం వర్షం కురిసే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఆ లెక్కన ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అన్నది అనుమానమే.
Ind vs SL Asia Cup Live Updates: ఇండియా గెలిస్తే ఫైనల్ కే..
హాయ్.. ఇండియా, శ్రీలంక ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ కు మీకు స్వాగతం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇండియా, శ్రీలంక తలపడబోతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దీంతో అటు ఇండియన్ ప్లేయర్స్, ఇటు గ్రౌండ్ స్టాఫ్ అంతా అలసిపోయారు. శ్రీలంకపై ఇండియా ఇవాళ గెలిచిందంటే ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం అయినట్లే. ఇండియా నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది.