Ind vs SA 1st Test: రాహుల్ హాఫ్ సెంచరీ.. తొలి రోజు చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు
26 December 2023, 20:41 IST
- Ind vs SA 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇండియా తొలి రోజు 8 వికెట్లకు 208 రన్స్ చేసింది.
తొలి రోజు హీరో కేఎల్ రాహుల్
Ind vs SA 1st Test: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా చేసుకొని, వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా టెస్ట్ సిరీస్ ను అంత ఘనంగా ప్రారంభించలేకపోయింది. తొలి టెస్ట్ తొలి రోజే ఇండియన్ బ్యాటర్లు తడబడ్డారు. కగిసో రబాడా చెలరేగడంతో తొలి రోజు 8 వికెట్లకు 208 రన్స్ మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (70 నాటౌట్) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు.
విరాట్ కోహ్లి (38), శ్రేయస్ అయ్యర్ (31) ఫర్వాలేదనిపించినా.. పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (2), యశస్వి జైస్వాల్ (17) విఫలమయ్యారు. వర్షం వల్ల తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లకు 208 రన్స్ చేసింది. వర్షం వల్ల తొలి రోజు కేవలం 59 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
సౌతాఫ్రికా స్టార్ పేస్ బౌలర్ కగిసో రబాడా 5 వికెట్లతో ఇండియన్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. రోహిత్, కోహ్లి, అయ్యర్ లాంటి వాళ్ల వికెట్లు తీశాడు. అతనికి మరో పేస్ బౌలర్ బర్గర్ నుంచి మంచి సహకారం లభించింది. జైస్వాల్, గిల్ వికెట్లను బర్గర్ తీశాడు. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి ఏ దశలోనూ ఇండియన్ టీమ్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది.
రాహుల్ ఒక్కడే ఓవైపు స్థిరంగా నిలబడటంతో ఇండియా స్కోరు కనీసం 200 అయినా దాటింది. వర్షం కారణంగా పిచ్ లో తేమ ఉండటంతో మొదట్లోనే సౌతాఫ్రికా పేసర్లు దానిని ఉపయోగించుకున్నారు. 13 పరుగుల స్కోరు దగ్గరే తొలి వికెట్ పడగా.. తర్వాత 23, 24 పరుగుల దగ్గర మరో రెండు వికెట్లు పడ్డాయి. ఈ సమయంలో కోహ్లి, శ్రేయస్ కాస్త వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
మళ్లీ కోలుకుంటున్న సమయంలో 92 పరుగుల దగ్గర శ్రేయస్ ఔటయ్యాడు. తర్వాత 15 పరుగుల వ్యవధిలోనే కోహ్లి కూడా పెవిలియన్ చేరడంతో 107 రన్స్ కే సగం వికెట్లు పడిపోయాయి. ఈ దశలో కనీసం 150 స్కోరు అయినా సాధ్యమేనా అనిపించింది. అయితే రాహుల్.. శార్దూల్ ఠాకూర్ (24)తో కలిసి ఏడో వికెట్ కు 43 పరుగులు జోడించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ 70, సిరాజ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.