తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan Weather: 10న మళ్లీ తలపడనున్న ఇండియా, పాకిస్థాన్.. వర్షం ముప్పు ఉందా?

India vs Pakistan Weather: 10న మళ్లీ తలపడనున్న ఇండియా, పాకిస్థాన్.. వర్షం ముప్పు ఉందా?

07 September 2023, 17:00 IST

google News
    • India vs Pakistan Weather: భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగనుంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి మ్యాచ్ జరిగే రోజు కొలంబోలో వాతావరణం ఎలా ఉండొచ్చంటే..
India vs Pakistan Weather: 10న మళ్లీ తలపడనున్న ఇండియా, పాకిస్థాన్
India vs Pakistan Weather: 10న మళ్లీ తలపడనున్న ఇండియా, పాకిస్థాన్ (ICC Twitter)

India vs Pakistan Weather: 10న మళ్లీ తలపడనున్న ఇండియా, పాకిస్థాన్

India vs Pakistan Weather: ఆసియాకప్ 2023 గ్రూప్ స్టేజ్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య పోరు వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. శ్రీలంకలోనే పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న ఆ మ్యాచ్ జరగగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేశాక వర్షం దంచికొట్టింది. దీంతో పాకిస్థాన్ లక్ష్యఛేదనకు దిగకుండా మ్యాచ్‍ను రద్దు చేశారు అంపైర్లు. కాగా, ఆసియాకప్ 2023 సూపర్-4 దశలో భారత్, పాకిస్థాన్ మళ్లీ తలపడనున్నాయి. ఈ క్రికెట్ సమరం ఆదివారం (సెప్టెంబర్ 10) జరగనుంది. ఈ బిగ్ ఫైట్ కోసం కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి కొలంబోలో సెప్టెంబర్ 10న వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉందో అంచనాలు వెలువడ్డాయి.

సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍పై కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వాతావరణ రిపోర్టుల ప్రకారం చూస్తే, సెప్టెంబర్ 10వ తేదీన కొలంబోలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలుస్తోంది. 75 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, మ్యాచ్ రద్దయేంత తీవ్రంగా కాకపోయినా.. వాన ఆటంకాలు మాత్రం ఉంటాయనే సంకేతాలు ఉన్నాయి. దీంతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ మరింత నెలకొంది. ఈ సారైనా వరుణుడు కరుణించి మ్యాచ్ జరిగేలా చేయాలని కోరుకుంటున్నారు.

కొలంబోలో గత వారం భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. దీంతో ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లను హంబన్ తోటకు తరలించేందుకు చర్చలు జరిగాయి. అయితే, ఇప్పటి వరకు ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్‍లో మార్పు జరగలేదు. మరి వర్షం పడే అవకాశాలు ఎక్కువైతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ).. వేదిక మార్పుపై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.

అక్యువెదర్ ప్రకారం, సెప్టెంబర్ 10వ తేదీన కొలంబోలో వర్షం పడే అవకాశాలు 75 శాతం ఉన్నాయి. రాత్రికి ఈ ఛాన్స్ 95 శాతం వరకు ఉంది. ఉరుములతో కూడిన గాలివాన పడే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. అయితే, భారీ వర్షం కురిసే సూచనలు ప్రస్తుతానికి లేవు. సెప్టెంబర్ 10న కొలంబోలో ఉష్ణోగ్రతలు 25 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని అంచనా.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‍తో పాకిస్థాన్ గడ్డపై ఆసియాకప్ 2023 మ్యాచ్‍లు ముగిశాయి. ఇక మిగిలిన సూపర్-4 మ్యాచ్‍లు, ఫైనల్ శ్రీలంకలోని కొలంబోలోనే జరగాల్సి ఉంది.

కొలంబోలో భారీ వర్షాలు పడే సూచనలు ఉంటే వేదికను హంబన్‍తోటకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్, శ్రీలంక క్రికెట్ బోర్డు ఆలోచిస్తున్నాయి. మరి వేదిక మారుతుందా, కొలంబోలోనే మ్యాచ్‍లు జరగుతాయా అన్నది ఉత్కంఠగా ఉంది.

సెప్టెంబర్ 2న పాకిస్థాన్‍తో జరిగిన ఆసియాకప్ 2023 గ్రూప్-ఏ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసింది. అయితే, భారీ వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్‍కు దిగకుండానే మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత భారత్, నేపాల్ మ్యాచ్‍కు కూడా వర్షం ఆటంకాలు కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది భారత్. ఓవర్ల కుదింపు తర్వాత 23 ఓవర్లలో 145 పరుగులు చేయాల్సి ఉండగా.. 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా.

తదుపరి వ్యాసం