India vs Ireland: రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్.. మార్పుల్లేకుండా బరిలోకి భారత్
20 August 2023, 19:29 IST
- India vs Ireland: టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.
India vs Ireland: రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్.. మార్పుల్లేకుండా బరిలోకి భారత్
India vs Ireland: ఐర్లాండ్‍తో టీమిండియా రెండో టీ20 మొదలైంది. మూడు టీ20ల సిరీస్‍లో భాగంగా రెండో మ్యాచ్ డబ్లిన్ వేదికగా నేడు (ఆగస్టు 20) మొదలైంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పౌల్ స్ట్రిర్లింగ్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో భారత జట్టు ముందు బ్యాటింగ్‍కు దిగనుంది. మొదటి టీ20 ఆడిన జట్టుతోనే మార్పులు లేకుండా ఈ మ్యాచ్‍లోనూ బరిలోకి దిగుతున్నట్టు టీమిండియా కెప్టెన్ జస్‍ప్రీత్ బుమ్రా టాస్ సమయంలో తెలిపాడు. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..
వర్షం ఆటంకం కలిగించిన తొలి టీ20లో భారత జట్టు.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే వేదికలో నేడు రెండో టీ20 జరుగుతుండగా.. ఈ మ్యాచ్‍కు వర్షం ముప్పు లేనట్టు కనిపిస్తోంది. పిచ్ కూడా బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని జస్‍ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమిండియా పట్టుదలగా ఉంది.
“మేం ముందుగా బ్యాటింగే ఎంపిక చేసుకోవాలనుకున్నాం (టాస్ గెలిస్తే ). ఈ రోజు వాతావరణం మెరుగ్గా ఉంది. నా శరీరం అంతా బాగుంది. ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా మొదలుపెట్టా. ఆ తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసం వచ్చింది. మేం మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాం” అని టాస్ సమయంలో భారత ప్రస్తుత కెప్టెన్ బుమ్రా చెప్పాడు. గాయం నుంచి కోలుకొని 11 నెలల తర్వాత ఈ పర్యటనతో భారత జట్టులోకి వచ్చాడు స్టార్ పేసర్ బుమ్రా. ఈ సిరీస్‍కు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. గత మ్యాచ్‍లో బుమ్రా సారథ్యంలో టీమిండియా విజయం సాధించింది.
“పిచ్ బాగా అనిపిస్తోంది. సాధారణంగా ఇది హైస్కోరింగ్ వెన్యూ. మేం సేమ్ టీమ్‍తో ఆడుతున్నాం” అని ఐర్లాండ్ కెప్టెన్ స్టిర్లింగ్ చెప్పాడు. ఐరిష్ జట్టు కూడా తొలి టీ20 ఆడిన జట్టునే ఈ మ్యాచ్‍కు కొనసాగించింది.
భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్
ఐర్లాండ్ తుదిజట్టు: ఆండ్రూ బాల్‍బిర్నీ, పౌల్ స్టిర్లింగ్ (కెప్టెన్), హారీ టెక్టర్, లోర్కాన్ టకర్ (వికెట్ కీపర్), కర్టిస్ కాంపెర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‍కార్తీ, క్రెగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజిమన్ వైట్