తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 2nd Test: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ - గాయంతో రెండో టెస్ట్‌కు స్టార్ స్పిన్న‌ర్ దూరం

IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ - గాయంతో రెండో టెస్ట్‌కు స్టార్ స్పిన్న‌ర్ దూరం

01 February 2024, 8:56 IST

google News
  • IND vs ENG 2nd Test: రెండో టెస్ట్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. మోకాలి గాయం కార‌ణంగా స్పిన్న‌ర్ జాక్ లీచ్ వైజాగ్ టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో షోయ‌బ్ బ‌షీర్ జ‌ట్టులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

జాక్ లీచ్
జాక్ లీచ్

జాక్ లీచ్

IND vs ENG 2nd Test:వైజాగ్ వేదిక‌గా ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్టార్ స్పిన్న‌ర్‌ జాక్ లీచ్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. మోకాలి గాయంతో అత‌డు వైజాగ్ టెస్ట్‌కు అందుబాటులో ఉండ‌టం లేద‌ని కెప్టెన్ బోన్ స్టోక్స్ తెలిపాడు. బుధ వారం ఇంగ్లండ్ నెట్ ప్రాక్టీస్ సెష‌న్స్‌లో జాక్ లీచ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతోన్నాయి. ఈ రూమ‌ర్స్‌పై బెన్ స్టోక్స్ క్లారిటీ ఇచ్చాడు. బుధ‌వారం నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో జాక్ లీచ్ అన్‌ఫిట్‌గా తేలిన‌ట్లు స‌మాచారం.

ఫీల్డింగ్ చేస్తూ....

హైద‌రాబాద్ టెస్ట్‌లో రెండో రోజు బౌండ‌రీ వెళుతోన్న బంతిని ఆపే క్ర‌మంలో జాక్ లీచ్ గాయ‌ప‌డ్డాడు. నొప్పితో విల‌విల‌లాడిన అత‌డు ఆ త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇర‌వై ఆరు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన లీచ్‌...రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం ప‌ది ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు.

బ్యాండేజ్ కట్టుకొని మైదానంలోకి దిగిన జాక్ లీచ్ బౌలింగ్ చేయ‌డానికి ఇబ్బందిప‌డుతూ క‌నిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే తీసుకున్నాడు. గాయం కార‌ణంగానే లీచ్ అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్న‌ట్లు స‌మాచారం. అందుకే అత‌డికి రెండో టెస్ట్‌కు విశ్రాంతి నివ్వాల‌ని ఫిక్సైన‌ట్లు తెలిసింది.

బ‌షీర్ ఎంట్రీ...

జాక్ లీచ్ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో షోయ‌బ్ బ‌షీర్ టెస్టుల్లో అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీసా స‌మ‌స్య‌లు తొల‌గిపోవ‌డంతో షోయ‌బ్ బ‌షీర్ ఇటీవ‌లే ఇండియాలో అడుగుపెట్టాడు. జాక్ లీచ్ గాయం కార‌ణంగా దూర‌మైన నేప‌థ్యంలో షోయ‌బ్ బ‌షీర్ రెండో టెస్ట్‌తో జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హార్ట్‌లీ, రూట్‌, షోయ‌బ్ బ‌షీర్‌, రెహాన్ అహ్మ‌ద్‌ల‌ను ఆడించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో టామ్ హార్ట్‌లీ టీమిండియాను దెబ్బ‌కొట్టాడు. స్పిన్ ఆడ‌టంతో త‌డ‌బ‌డిన భార‌త్ సింపుల్ టార్గెట్‌ను ఛేదించ‌లేక చ‌తికిలా ప‌డింది. స్పిన్ ఆయుధంతోనే రెండో టెస్ట్‌లో టీమిండియాను దెబ్బ‌కొట్టాల‌ని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

జ‌డేజా రాహుల్‌...

టీమ్ ఇండియా కూడా గాయాల స‌మ‌స్య‌తో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. గాయాల కార‌ణంగా రెండో టెస్ట్‌కు ర‌వీంద్ర జ‌డేజాతో పాటుకేఎల్ రాహుల్ దూర‌మ‌య్యారు. వారి స్థానంలో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చారు. తొలి టెస్ట్‌లో విజ‌యం ముంగిట టీమిండియా బోల్తా కొట్టింది. ఇప్ప‌టికే ఈ ఓట‌మితో డీలా ప‌డిన టీమిండియాకు జ‌డేజా, రాహుల్ దూరం కావ‌డం పెద్ద షాకేన‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల జ‌ట్టుకు దూర‌మైన విరాట్‌ కోహ్లి మూడో టెస్ట్ నుంచి అందుబాటులో ఉండ‌నున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.

తదుపరి వ్యాసం