IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను చిత్తుచేసిన భారత్.. అదరగొట్టిన బుమ్రా, అశ్విన్
05 February 2024, 14:46 IST
India vs England 2nd Test: ఇంగ్లండ్‍ను రెండో టెస్టులో చిత్తు చేసింది టీమిండియా. జస్‍ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ సహా భారత బౌలర్లు సమిష్టిగా రాణించి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చారు. నాలుగో రోజే ఈ మ్యాచ్ ముగిసింది.
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍ను చిత్తుచేసిన భారత్.. అదరగొట్టిన బుమ్రా, అశ్విన్
IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‍పై రెండో టెస్టులో విజయ ఢంకా మోగించింది టీమిండియా. అన్ని విభాగాల్లో సత్తాచాటి ఇంగ్లిష్ జట్టుపై గెలిచింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 5) భారత్ 106 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా (3/46), సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/72) చెరో మూడు వికెట్లతో దుమ్ములేపారు. ఇంగ్లిష్ జట్టు బ్యాటింగ్ లైనప్‍ను కుప్పకూల్చారు.
399 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ (73) అర్ధ శకతంతో రాణించగా.. చివర్లో బెన్ ఫోక్స్ (36), టామ్ హార్ట్లీ (36) కాసేపు పోరాడారు. అయితే, భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి ఇంగ్లండ్‍ను నిలువరించారు. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‍లో 1-1తో సమంగా నిలిచింది భారత్. ఈ సిరీస్‍లో ఇంకా మూడు టెస్టులు జరగనున్నాయి.
ముందు ఆశ్విన్.. తర్వాత బుమ్రా
67 పరుగులకు ఒక వికెట్ ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజైన నేడు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కొనసాగించింది. తొలి సెషన్‍లోనే ఐదు వికెట్లు పడగొట్టారు భారత బౌలర్లు. ముందుగా రెహాన్ అహ్మద్ (23)ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ పెవిలియన్‍కు పంపాడు. మరో ఎండ్‍లో దీటుగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు జాక్ క్రాలీ. ఆ తర్వాత భారత స్పిన్నర్ అశ్విన్ కోత మొదలుపెట్టాడు. ఓలీ పోప్ (23)ను పెవిలియన్‍కు పంపాడు అశ్విన్. ఆ తర్వాత జో రూట్ (16)ను ఔట్ చేసి ఇంగ్లిష్ జట్టును చావుదెబ్బ కొట్టాడు. దూకుడుగా ఆడుతున్న క్రాలీని కుల్దీప్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత జస్‍ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. జానీ బెయిర్ స్టో (26)ను ఔట్ చేశాడు. దీంతో ఫస్ట్ సెషన్‍లోనే ఐదు వికెట్లను కోల్పోయింది ఇంగ్లండ్. రెండో సెషన్‍లో భారీ షాక్ తగిలింది. ఇంగ్లిష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (11) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ దీటుగా పోరాడి టీమిండియాను టెన్షన్ పెట్టారు. అయితే వారిద్దరినీ బుమ్రానే ఔట్ చేశాడు. చివరి వికెట్‍గా షోయబ్ బషీర్ (0)ను పెలియన్‍కు పంపాడు భారత పేసర్ ముకేశ్ కుమార్. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్.. సెకండ్‍లో గిల్
భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) ఈ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ద్విశకతంతో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‍లో తన మొదటి డబుల్ సెంచరీ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది. ఆ తర్వాత జస్‍ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (104) సెంచరీతో మెరిశాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేయగలిగింది. మొత్తంగా ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఈ ఛేజింగ్‍లో నేడు 292 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు రాజ్‍కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన మొదలుకానుంది. దీంతో ఆటగాళ్లకు సుమారు 10 రోజుల బ్రేక్ దొరికింది.