తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban Asia Cup: టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ - శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ వృథా

IND vs BAN Asia Cup: టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ - శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ వృథా

HT Telugu Desk HT Telugu

15 September 2023, 23:26 IST

google News
  • IND vs BAN Asia Cup: ఆసియా క‌ప్‌లో భార‌త్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. శుక్ర‌వారం జ‌రిగిన సూప‌ర్ ఫోర్ మ్యాచ్‌లో టీమ్ ఇండియాపై బంగ్లాదేశ్ ఆరు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీతో రాణించిన టీమ్ ఇండియాను గెలిపించ‌లేక‌పోయాడు.

శుభ్‌మ‌న్ గిల్‌
శుభ్‌మ‌న్ గిల్‌

శుభ్‌మ‌న్ గిల్‌

IND vs BAN Asia Cup: ఆసియా క‌ప్‌లో టీమ్ ఇండియాకు తొలి ఓట‌మి ఎదురైంది. నామ‌మాత్ర‌మైన చివ‌రి సూప‌ర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఆరు ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 ప‌రుగులు చేయ‌గా ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బ‌డిన టీమ్ ఇండియా 49.5 ఓవ‌ర్ల‌లో 259 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

సెంచ‌రీతో శుభ్‌మ‌న్ గిల్ చివ‌రి వ‌ర‌కు ఒంట‌రిపోరాటం చేశాడు. 133 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 121 ప‌రుగులు చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో అత‌డి క‌ష్టం వృథాగా మారింది.

విజ‌యానికి చేరువ అవుతోన్న త‌రుణంలో శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ ఔట్ కావ‌డం టీమిండియాను దెబ్బ‌తీసింది. 266 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఫ‌స్ట్ ఓవ‌ర్‌లోనే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఈ మ్యాచ్‌తోనే వ‌న్డేల్లో ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ కూడా కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి వికెట్ల ప‌త‌నాన్ని కాసేపు అడ్డుకున్నాడు గిల్‌.

19 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రాహుల్ ఔట్ కావ‌డంతో టీమ్ ఇండియా క‌ష్టాల్లోప‌డింది. ఇషాన్‌కిష‌న్ ఐదు ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ఈ త‌రుణంలో సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి టీమ్ ఇండియాను విజ‌యం దిశగా న‌డిపించాడు శుభ్‌మ‌న్ గిల్‌. సూర్య‌కుమార్ యాద‌వ్ (26 ర‌న్స్‌), ర‌వీంద్ర జ‌డేజా (ఏడు ర‌న్స్‌)ల‌ను వెనువెంట‌నే ఔట్ చేసి టీమ్ ఇండియాకు షాకిచ్చారు బంగ్లా బౌల‌ర్స్‌.

118 బాల్స్‌లో సెంచ‌రీ పూర్తిచేసుకున్న గిల్ ఆ త‌ర్వాత గేర్ మ‌ర్చాడు. సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. సెంచ‌రీ త‌ర్వాత జోరుమీదున్న అత‌డిని మెహ‌దీ హ‌స‌న్ ఔట్ చేశాడు. గిల్ ఔట్ అయినా అక్ష‌ర్ ప‌టేల్ దూకుడు మాత్రం త‌గ్గించ‌లేదు. విజ‌యానికి రెండు ఓవ‌ర్ల‌లో 17 ప‌రుగులు చేయాల్సిన త‌రుణంలో అక్ష‌ర్ ప‌టేల్‌, శార్ధూల్ ఠాకూర్ ఔట్ కావ‌డంతో టీమ్ ఇండియా ఓట‌మి ఖాయ‌మైంది.

అక్ష‌ర్ ప‌టేల్ 34 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 42 ర‌న్స్ చేశాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ మూడు, హ‌స‌న్ ష‌కీబ్‌, మెహ‌దీ హ‌స‌న్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ (80 ర‌న్స్‌), తౌహిద్ (54 ర‌న్స్‌) రాణించ‌డంతో 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది

తదుపరి వ్యాసం