Team India at Ahmedabad: అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా - ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకానున్న ఆస్ట్రేలియా ప్రధాని
17 November 2023, 11:22 IST
వరల్డ్ కప్ ఫైనల్ కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకున్నది. టీమిండియా క్రికెటర్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు ఈ ఫైనల్ ఫైట్‌కు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం.
విరాట్ కోహ్లి
వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. నవంబర్ 19న ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ ఫైనల్ ఫైట్ కోసం శుక్రవారం టీమిండియా ప్లేయర్లు అహ్మదాబాద్ చేరుకున్నారు. వారికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. టీమిండియా క్రికెటర్లను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
ఇరవై ఏళ్ల తర్వాత...
వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడటం ఇది రెండోసారి. 2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 359 రన్స్ చేయగా టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. అప్పుడు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.
ఫైనల్‌కు ఆస్ట్రేలియా ప్రధాని...
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్‌కు ప్రైమ్ మినిస్టర్ మోదీ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అతడితో పాటు ఆస్ట్రేలియా ప్రధానిఆంథోనీ అల్బనీస్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ ఫైనల్ ఫైట్ కు గెస్ట్‌గా ఆంథోనీ అల్బనీస్ ఐసీసీతో పాటు బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. ఆస్ట్రేలియన్ ప్రధాని ఈ మ్యాచ్‌కు హాజరు కానున్నాడా? లేదా? అన్నది శుక్రవారం తేలనుంది.