తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc T20i Rankings: టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్.. టాప్‌లోనే సూర్యకుమార్

ICC T20I Rankings: టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్.. టాప్‌లోనే సూర్యకుమార్

Hari Prasad S HT Telugu

06 December 2023, 15:20 IST

google News
    • ICC T20I Rankings: టీ20ల్లో టీమిండియా స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ నంబర్ వన్ లోకి దూసుకెళ్లడం విశేషం. తాజా ర్యాంకుల్లో అతడు టాప్ లోకి వెళ్లగా.. బ్యాటర్లలో సూర్యకుమార్ తొలి ర్యాంకులో కొనసాగుతున్నాడు.
రవి బిష్ణోయ్
రవి బిష్ణోయ్ (BCCI-X)

రవి బిష్ణోయ్

ICC T20I Rankings: టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20ల్లో అగ్ర స్థానానికి చేరాడు. ఈ మధ్య ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ లో రాణించిన బిష్ణోయ్.. తొలిసారి ఈ ఘనత సాధించడం విశేషం. అటు బ్యాటింగ్ లోనూ ఇండియన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవే టాప్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అతడు కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఇన్నాళ్లూ టీ20ల్లో టాప్ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను వెనక్కి నెట్టి రవి బిష్ణోయ్ నంబర్ వన్ అయ్యాడు. గత వారం ఐదో స్థానంలో ఉన్న బిష్ణోయ్.. ఏకంగా టాప్ లోకి వెళ్లడం నిజంగా విశేషమే. ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేయడంలో రవితోపాటు కెప్టెన్ సూర్యకుమార్ కూడా ముఖ్యపాత్ర పోషించడంతో ఈ ఇద్దరూ నంబర్ వన్ ర్యాంకులు దక్కించుకున్నారు.

గత వారం 664 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న బిష్ణోయ్.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత మరో 34 పాయింట్లు సాధించి 699 పాయింట్లతో నంబర్ వన్ అయ్యాడు. రషీద్ ఖాన్ 692 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి రషీద్ టాప్ లో ఉన్నాడు. ఐదు టీ20ల సిరీస్ లో 9 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన బిష్ణోయ్.. తాజా ర్యాంకుల్లో మెరుగయ్యాడు.

గతేడాది ఫిబ్రవరిలో టీ20ల్లో అడుగుపెట్టిన రవి బిష్ణోయ్ ఇప్పటి వరకూ 21 మ్యాచ్ లలో 34 వికెట్లు తీశాడు. కానీ అప్పుడే ర్యాంకుల్లో టాప్ లోకి వెళ్లడం మాత్రం నమ్మశక్యం కానిదే. ఆస్ట్రేలియాతో సిరీస్ లో తన ప్రదర్శనతో వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ టీమ్ రేసులో నిలిచాడు. అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ లాంటి వాళ్లు ఇప్పటికే పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన ఏడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్ లో కొనసాగుతోంది.

తదుపరి వ్యాసం