HCA Elections: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ముఖ్యమైన తేదీలు ఇవే
30 September 2023, 22:19 IST
- Hyderabad Cricket Association (HCA) Elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎన్నికలకు ముఖ్యమైన తేదీలు ఇవే..
HCA Elections: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు ఇవే (Photo: HCA)
Hyderabad Cricket Association (HCA) Elections: సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలకు ఇటీవలే మార్గం సుగమమైంది. దీంతో హెచ్‍సీఏ ఎన్నికలకు నేడు (సెప్టెంబర్ 30) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్ట్రోల్ ఆఫీసర్ వీఎస్ సంపత్ కుమార్ ఈ నోటిఫికేషన్‍ను రిలీజ్ చేశారు. ఆ వివరాలివే..
హెచ్‍సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి వెల్లడించారు. 149 మంది క్రికెట్ క్లబ్‍లు - ఇన్‍స్టిట్యూషన్‍ల ప్రతినిధులు, 6 జిల్లాల అసోయేషన్ ప్రతినిధులు, ఏడుగురు అంతర్జాతీయ క్రికెటర్లు, ఎనిమిది మంది మహిళా అంతర్జాతీయ క్రికెటర్లు ఓటర్ల జాబితాలో ఉన్నారు. అక్టోబర్ 20వ తేదీన హెచ్‍సీఏ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
హెచ్‍సీఏ ఎన్నికలకు ముఖ్యమైన తేదీలు
హెచ్‍సీఏ ఎన్నికలకు అక్టోబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 14వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 16వ తేదీన నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడికానున్నాయి.
హెచ్‍సీఏ అధ్యక్షుడిగా మహమ్మద్ అజారుద్దీన్ పదవీ కాలం గతంలోనే పూర్తయింది. 2022 సెప్టెంబర్‌లోనే హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాల్సింది. అయితే, హెచ్‍సీఏకు సంబంధించి పలు కేసులు కోర్టులకు వెళ్లాయి. దీంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావును హెచ్‍సీఏ వ్యవహారాలను చూసుకునేందుకు, ఎన్నికల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు నియమించింది. ఈ క్రమంలో కొన్ని వివాదాల్లో ఉన్న 57 క్లబ్‍లు ఓటింగ్‍లో పాల్గొనకూడదని లావు నాగేశ్వరరావు నిర్ణయం ప్రకటించారు. అలాగే, వీఎస్ సంపత్‍ను ఆయన హెచ్‍సీఏ ఎన్నికల అధికారిగా నియమించారు. అయితే, క్లబ్‍ల నిషేధాన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా కొందరు మాజీ సభ్యులు కోర్టుకు వెళ్లటంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. జస్టిస్ నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ సెప్టెంబర్ 15న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఎన్నికలకు మార్గం సుగమమం అయింది. దీంతో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది.