Gavaskar on Rohit: అశ్విన్ ఏం తప్పు చేశాడో మరి.. రోహిత్‌పై మండిపడిన గవాస్కర్
11 October 2023, 14:47 IST
- Gavaskar on Rohit: అశ్విన్ ఏం తప్పు చేశాడో మరి అంటూ అతన్ని ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ నుంచి తొలగించడంపై మండిపడ్డాడు సునీల్ గవాస్కర్. ఈ మ్యాచ్ కు అశ్విన్ స్థానంలో శార్దూల్ వచ్చాడు.
రవిచంద్రన్ అశ్విన్
Gavaskar on Rohit: ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో అశ్విన్ ను తప్పించి శార్దూల్ ను తీసుకోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. అతడు ఏం తప్పు చేశాడో మరి అంటూ రోహిత్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఆస్ట్రేలియాతోనే ఆడిన టీమ్ నుంచి అశ్విన్ ను మాత్రమే తప్పించారు. టాస్ సందర్భంగా రోహిత్ ఈ విషయం చెప్పగానే గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇక మహ్మద్ షమిని తీసుకోకపోవడంపై కూడా గవాస్కర్ మండిపడ్డాడు. 2019 వరల్డ్ కప్ లో ఆఫ్ఘన్ టీమ్ పై హ్యాట్రిక్ తీసి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతన్ని తీసుకోవాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. "మరోసారి అశ్విన్ ను పక్కన పెట్టారు. అతడు ఏం తప్పు చేశాడో నాకు తెలియదు. ఆఫ్ఘనిస్థాన్ పై 2019లో షమి హ్యాట్రిక్ తీసుకున్నాడు. అతనికైనా అవకాశం దక్కాల్సింది" అని స్టార్ స్పోర్ట్స్ లో గవాస్కర్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదైన పిచ్ కావడంతో టాస్ గెలవగానే ఆఫ్ఘన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రోహిత్ మాత్రం తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని అనడం విశేషం. పిచ్ పెద్దగా మారదని, అయితే చేజింగ్ లో మంచు కారణంగా బౌలింగ్ కష్టమవుతుందని చెప్పాడు.
చివరి నిమిషంలో అక్షర్ పటేల్ గాయపడటంతో వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన అశ్విన్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఆడాడు. ఆ మ్యాచ్ లో 10 ఓవర్లలో కేవలం 34 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అయినా అతన్ని పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా అతని స్థానంలో శార్దూల్ ను తీసుకోవడం కూడా గవాస్కర్ ఆగ్రహానికి కారణమైంది.