తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhoni Lift: యువ క్రికెటర్‌కు తన బైకుపై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

Dhoni Lift: యువ క్రికెటర్‌కు తన బైకుపై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

15 September 2023, 12:10 IST

google News
    • Dhoni Lift: యువ క్రికెటర్‌కు తన బైకుపై లిఫ్ట్ ఇచ్చాడు ధోనీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ మధ్యే అమెరికా టూర్ కు వెళ్లి వచ్చిన అతడు.. ప్రస్తుతం తన సొంతూరు రాంచీలోనే ఉన్నాడు.
రాంచీలో ట్రైనింగ్ సెషన్ లో ధోనీ
రాంచీలో ట్రైనింగ్ సెషన్ లో ధోనీ

రాంచీలో ట్రైనింగ్ సెషన్ లో ధోనీ

Dhoni Lift: ఎమ్మెస్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్లవుతోంది. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు. అయితే ఏదో ఒక రకంగా అతడు మాత్రం వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. ఈ మధ్యే అమెరికా వెళ్లి అక్కడ యూఎస్ ఓపెన్ చూడటంతోపాటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడాడు.

ఇక ఇప్పుడు తన సొంతూరు రాంచీలో ధోనీ ఓ యువ క్రికెటర్ కు తన బైకుపై లిఫ్ట్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దేశంలోని ఎంతో మంది యువ క్రికెటర్లు ధోనీని ఆదర్శంగా తీసుకుంటారు. అతనిలాగా ఎదగాలని ఆశపడతారు. అలాంటి ఓ యువ జార్ఖండ్ ప్లేయర్ ను ధోనీ ఇలా ప్రోత్సహించాడు. తన యమహా ఆర్డీ350 బైక్ పై అతనికి లిఫ్ట్ ఇచ్చాడు.

ధోనీ గ్రౌండ్ లో తనతో ఉన్న వీడియోతోపాటు అతని బైకుపై వెళ్తున్న వీడియోను ఓ యువ క్రికెటర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రాంచీలో ఓ ట్రైనింగ్ సెషన్ తర్వాత ధోనీ ఆ క్రికెటర్ ను తన వెంట తీసుకెళ్లాడు. ఇండియన్ క్రికెట్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ధోనీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు కదా. అయినా రాంచీలో ఉన్నప్పుడు మాత్రం అతడు ఇలా అత్యంత సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు.

రాంచీ రోడ్లపై తనకెంతో ఇష్టమైన బైకులు, కార్లు వేసుకొని తిరగడం ధోనీకి అలవాటు. ఇప్పటికే తన దగ్గర ఉన్న ఎన్నో వింటేజ్ బైక్స్, కార్లతో రోడ్లపై ధోనీ తిరిగే వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ను రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిపిన ధోనీ.. తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్నాడు.

వచ్చే ఏడాది కూడా అతడు ఐపీఎల్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ ధోనీ ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు. దీంతో ఐపీఎల్ 2024కు అతడు తిరిగి వస్తాడనే అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే 42 ఏళ్ల వయసున్న ధోనీ.. యువ క్రికెటర్లతో పోటీ పడుతూ ఐపీఎల్లో ఆడుతున్నాడు.

తదుపరి వ్యాసం