తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Cricket World Cup: వరల్డ్ కప్.. ఇదొక క్రికెట్ పండగ

Cricket World Cup: వరల్డ్ కప్.. ఇదొక క్రికెట్ పండగ

Hari Prasad S HT Telugu

06 October 2023, 11:33 IST

google News
    • Cricket World Cup: వరల్డ్ కప్.. ఇదొక క్రికెట్ పండగ. క్రికెట్ ను ఓ మతంగా భావించే ఇండియాకు 12 ఏళ్ల తర్వాత ఈ పండగ తిరిగొచ్చింది. ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గురువారం (అక్టోబర్ 5) సింపుల్ గా ప్రారంభమైంది.
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు (PTI)

క్రికెట్ వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

Cricket World Cup: క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రారంభమైంది. ఇండియాలోని అభిమానులకు దసరా, దీపావళితోపాటు ఇప్పుడు క్రికెట్ పండగ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఎ. భూపాల్ రెడ్డి అనే ఓ క్రికెట్ అభిమాని వన్డే క్రికెట్ వరల్డ్ కప్ చరిత్ర గురించి ఎంతో అద్భుతంగా అభివర్ణిస్తూ ఓ మంచి ఆర్టికల్ రాశారు. ఆయన రాసిన ఇంగ్లిష్ ఆర్టికల్ కు ఇది తెలుగు అనువాదం.

ఐసీసీ -ఇంటర్నేషనల్ క్రికెట్ కార్నివాల్

ఆంత్రప్రెన్యూషిప్ అనేది సంతోషకరమైన కొన్ని ప్రమాదాల కలయిక అని ఎవరో వర్ణించారు - కెవిన్ సిస్ట్రోమ్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫొటో షేరింగ్ వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రామ్ కో ఫౌండర్ అయిన కెవిన్ సిస్ట్రోమ్ చెప్పిన ఈ మాటలు వన్డే క్రికెట్ కు అతికినట్లు సరిపోతాయి. నిజానికి తొలి వరల్డ్ కప్‌లు (1975, 1979, 1983) తర్వాత ఈ వెబ్‌సైట్ ప్రారంభమైంది. వన్డే క్రికెట్ కూడా 1971లో అలా యాక్సిడెంటల్ గానే ఆస్ట్రేలియాలో మొదలైంది.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యం కాలేదు. అయితే ప్రేక్షకులను నిరాశకు గురి చేయకూడదన్న ఉద్దేశంతో నిర్వాహకులు ఓ వన్డే గేమ్ (ఒక్కో జట్టుకు 40 ఓవర్లు, ఒక్కో ఓవర్ 8 బంతులు) నిర్వాహించారు. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది.

ఈ మ్యాచ్ అభిమానులను ఆకర్షించింది. అక్కడి నుంచి వన్డే ఇంటర్నేషనల్స్ క్రికెట్ లో భాగమయ్యాయి. అయితే 1975లో మొదటి వరల్డ్ కప్ జరిగే వరకూ కూడా ఐదు రోజుల పాటు జరిగే సాంప్రదాయ టెస్ట్ క్రికెటే ఏలుతూ వచ్చింది.

ప్రుడెన్షియల్ కప్‌లు (1975, 1979, 1983)

1975 వరల్డ్ కప్ - తొలి వరల్డ్ కప్ టోర్నమెంట్ ను ఇన్సూరెన్స్ సంస్థ అయిన ప్రుడెన్షియల్ స్పాన్సర్ చేసింది. దీంతో దీనికి ప్రుడెన్షియల్ కప్ అనే పేరు వచ్చింది. ఈ వరల్డ్ కప్ లో ప్రతి జట్టూ ఇన్నింగ్స్ కు 60 ఓవర్లు ఆడాయి. మ్యాచ్ లన్నీ పగటి వేళ జరిగాయి. సాంప్రదాయ తెల్లటి దుస్తులు, రెడ్ బాల్స్ తో ఆడారు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్.. ఆ సమయంలో ఆరు టెస్ట్ ఆడే దేశాలతో సహా మొత్తం ఎనిమిది జట్లతో టోర్నీ నిర్వహించారు. శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా కూడా తలపడ్డాయి. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – క్లైవ్ లాయిడ్ (WI) 85 బంతుల్లో 102 పరుగులు చేశాడు.

1979 వరల్డ్ కప్ - 1979 ప్రపంచ కప్‌లో అదే ఆరు టెస్ట్ ఆడే దేశాలు, నాన్-టెస్ట్ జట్లు శ్రీలంక, కెనడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. సర్ వివ్ రిచర్డ్స్, కొల్లిస్ కింగ్ అద్భుతమైన బ్యాటింగ్, జోయెల్ గార్నర్ (5 వికెట్లు) సంచలన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్య శక్తి అయిన వెస్టిండీస్ బలమైన ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసి 92 పరుగుల తేడాతో గెలిచింది. వాళ్లకు ఇది వరుసగా రెండో ప్రపంచ కప్.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – సర్ వివ్ రిచర్డ్స్ (WI) 138 పరుగులు చేశాడు.

1983 ఎడిషన్ - మొదటి రెండు ఈవెంట్‌లలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, శ్రీలంక టెస్ట్ ఆడే దేశంగా అవతరించిన నేపథ్యంలో ఇంగ్లండ్ వరుసగా మూడోసారి టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఐసిసి ట్రోఫీ ద్వారా ఎనిమిదో జట్టు జింబాబ్వే అర్హత సాధించింది.

30 గజాల ఫీల్డింగ్ సర్కిల్‌ ద్వారా వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఫీల్డింగ్ పరిమితులను కూడా ప్రవేశపెట్టారు. నలుగురు ఫీల్డర్లు ఎప్పుడూ సర్కిల్ లోపల ఉండాలన్న నిబంధన విధించారు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా, అంతకుముందు రెండు వరల్డ్ కప్ లలో కలిపి ఒకే ఒక్క విజయం సాధించి ఇండియా.. ఫైనల్లో వెస్టిండీస్ ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – మొహిందర్ అమర్‌నాథ్ (భారత్) బ్యాట్‌తో 26 పరుగులు, బౌలింగ్‌లో 3/8

1987, 1992, 1996 - కొత్త ఛాంపియన్లు

1987 ఎడిషన్ - 1987 వరల్డ్ కప్ ను ఇండియా, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. స్పాన్సర్ గా రిలయెన్స్ రావడంతో ఆ సంస్థ పేరు మీదే రిలయన్స్ వరల్డ్ కప్ అనే పేరు పెట్టారు. ఈ వరల్డ్ కప్ లోనే భారత ఉపఖండంలో పగటిపూట తక్కువ సమయం ఉన్నందున ICC ఓవర్ల సంఖ్యను ఇన్నింగ్స్‌కు 60 నుండి 50కి తగ్గించింది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ ఫేవరెట్లుగా దిగినా.. ఆస్ట్రేలియా ట్రోఫీ గెలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచ కప్ చరిత్రలో అతి తక్కువ మార్జిన్ ఇదే కావడం విశేషం.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా) 125 బంతుల్లో 75 పరుగులు చేశాడు.

1992 ఎడిషన్ - 'బెన్సన్ & హెడ్జెస్ వరల్డ్ కప్'గా పిలిచిన ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగింది. తొలిసారి సౌతాఫ్రికా ఆడిన వరల్డ్ కప్ ఇది. అంతేకాదు రంగు రంగుల జెర్సీలు, వైట్ బాల్స్, డేనైట్ మ్యాచ్ లు, థర్డ్ అంపైర్, ఫీల్డింగ్ పరిమితులతో ఈ వరల్డ్ కప్ అంతా కొత్త అనుభూతిని పంచింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో 9 దేశాలు ప్రతి టీమ్ తో ఒక్కో మ్యాచ్ ఆడగా.. నాలుగు టీమ్స్ సెమీఫైనల్ కు అర్హత సాధించాయి.

ఈ వరల్డ్ కప్ లో ఓ వివాదం కూడా చెలరేగింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని తొలిసారి ప్రవేశ పెట్టిన ఈ టోర్నీ సెమీఫైనల్ కు వర్షం అడ్డు తగలడంతో అప్పటి వరకూ గెలుస్తుందనుకున్న సౌతాఫ్రికా జట్టుకు వర్షం వెలిసిన తర్వాత 1 బంతికి 22 పరుగులు లక్ష్యం నిర్దేశించారు. దీంతో ఆ టీమ్ ఇంటిదారి పట్టింది.

టోర్నమెంట్‌ ఆరంభంలో నిరాశాజనకమైన ఆరంభాన్ని అధిగమించిన పాకిస్థాన్ కప్ గెలుచుకుంది. వసీం అక్రమ్, ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్ న్యూజిలాండ్‌తో జరిగిన హై వోల్టేజ్ సెమీఫైనల్లో రాణించారు. తర్వాత ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించారు.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – వసీం అక్రమ్ (పాకిస్థాన్) 18 బంతుల్లో 33 పరుగులు, 3/49

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – మార్టిన్ క్రో (న్యూజిలాండ్) - 9 మ్యాచ్‌ల్లో 456 పరుగులు

1996 ఎడిషన్ - 1996 ఛాంపియన్‌షిప్, 'విల్స్ వరల్డ్ కప్'గా ప్రసిద్ధి చెందింది. భారత ఉపఖండంలో రెండోసారి జరిగిన టోర్నీ ఇది. కొన్ని గ్రూప్ దశ మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిచ్చింది. మొత్తం తొమ్మిది టెస్ట్ ఆడే దేశాలతోపాటు నెదర్లాండ్స్, UAE, కెన్యా టోర్నమెంట్‌లో ఆడాయి. భద్రతాపరమైన భయాల కారణంగా శ్రీలంకలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ ఆడటానికి నిరాకరించాయి. ఈ రెండు మ్యాచ్ లలోనూ శ్రీలంకను విజేతగా ప్రకటించారు.

కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్‌లో ఇండియా ఓడిపోతుండటాన్ని జీర్ణించుకోలేని అభిమానులు కల్లోలం సృష్టించారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ ఆపేసి శ్రీలంకను విజేతగా ప్రకటించారు. ఇక అరవింద డిసిల్వా అద్భుత సెంచరీతో లాహోర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో శ్రీలంక గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – అరవింద డి సిల్వా (శ్రీలంక)- 106 రన్స్

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్– సనత్ జయసూర్య (శ్రీలంక) 221 రన్స్ తోపాటు 6 వికెట్లు

1999, 2003, 2007 - ఆస్ట్రేలియా ఏకఛత్రాధిపత్యం

1999 ఎడిషన్ - ఈ గ్రాండ్ ఈవెంట్ తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్లింది. స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, నెదర్లాండ్స్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో ఐసీసీ వరల్డ్ కప్ గా పేరు మార్చారు. ప్రపంచకప్‌లో పన్నెండు జట్లు పోటీపడ్డాయి. ఈ టోర్నీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన సెమీఫైనల్ ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్ టైగా ముగియడంతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఫైనల్లో పాకిస్థాన్ ను కేవలం 132 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా తన రెండో వరల్డ్ కప్ గెలిచింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 4/33

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ – లాన్స్ క్లూసెనర్ (దక్షిణాఫ్రికా) -281 పరుగులు, 17 వికెట్లు

2003 ఎడిషన్ - దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఈవెంట్‌ను నిర్వహించాయి. ఈవెంట్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పన్నెండు నుండి పద్నాలుగుకి పెరిగింది. ఈ టోర్నీలో శ్రీలంక, జింబాబ్వేలపై గెలవడంతోపాటు కెన్యాలో ఆడటానికి న్యూజిలాండ్ నిరాకరించడంతో ఆ దేశం అనూహ్యంగా సెమీఫైనల్ చేరింది. ఓ ఐసీసీ అసోసియేట్ టీమ్ సెమీస్ చేరడం అదే తొలిసారి.

ఫైనల్‌లో, ఆస్ట్రేలియా 359 పరుగులు చేసింది. ఇది ఓ వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 140 రన్స్ చేయడంతో ఇండియాను 125 రన్స్ తో ఓడించి ఆస్ట్రేలియాతో మూడోసారి కప్పు గెలిచింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 140 నాటౌట్

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – సచిన్ టెండూల్కర్ (భారత్) - 673 పరుగులు, 2 వికెట్లు

2007 ఎడిషన్ - వెస్టిండీస్ 2007 ఎడిషన్‌ను నిర్వహించింది. ఇది క్రికెట్ కంటే వివాదాలతోనే పేరుగాంచింది. మొత్తం పదహారు జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోవడం, ఆ తర్వాత హోటల్ రూమ్ లో పాక్ కోచ్ బాబ్ వూమర్ శవమై కనిపించడం సంచలనం రేపింది. అతడు గుండెపోటుతో మరణించినట్లు తర్వాత విచారణలో తేలింది.

ఈ వరల్డ్ కప్ తొలి రౌండ్‌లోనే శ్రీలంక, బంగ్లాదేవ్ లతో ఓడిపోయిన ఇండియా ఇంటిదారి పట్టింది. ఇక ఆస్ట్రేలియా ఫైనల్‌లో శ్రీలంకను 53 పరుగులతో (D/L) ఓడించింది. వరల్డ్ కప్ లలో వరుసగా 29 మ్యాచ్ ల రికార్డు క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హ్యాట్రిక్ తోపాటు ఓవరాల్ గా నాలుగో వరల్డ్ కప్ గెలిచింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 99 బంతుల్లో 149 పరుగులు చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) - 26 వికెట్లు

2011, 2015, 2019 - ఆతిథ్య దేశాల హవా

2011 ఎడిషన్ - క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పద్నాలుగుకు పడిపోయింది. 1999లో ప్రారంభమైన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జైత్రయాత్ర ఈ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో ముగిసింది. అయితే ఆ టీమ్ క్వార్టర్ ఫైనల్ మాత్రం చేరింది. అక్కడ ఇండియా చేతుల్లో ఓడిపోయింది.

ముంబైలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ రెండో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. సొంతగడ్డపై ఫైనల్‌ను గెలిచిన మొదటి దేశంగా నిలిచింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – ఎమ్మెస్ ధోనీ (ఇండియా) - 91 నాటౌట్

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – యువరాజ్ సింగ్ (భారత్) - ఆల్ రౌండ్ ప్రదర్శనతో 362 పరుగులు, 15 వికెట్లు

2015 ఎడిషన్ - 2015 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. 14 టీమ్స్ పాల్గొన్నాయి. టోర్నమెంట్‌లో మూడు విజయాలతో ఐర్లాండ్ అత్యంత విజయవంతమైన అసోసియేట్ దేశంగా నిలిచింది. ఉత్కంఠభరితమైన తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – జేమ్స్ ఫాల్క్‌నర్ (ఆస్ట్రేలియా)- 3/36

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ – మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 22 వికెట్లు

2019 ఎడిషన్ - ఈ ICC క్రికెట్ ప్రపంచ కప్ ఎడిషన్ ఇంగ్లాండ్‌లోని 10 వేదికలలో, వేల్స్‌లోని ఒక వేదికలో జరిగింది. ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. 2015 ఎడిషన్‌లో 14 జట్లు ఉండగా, ఈ టోర్నమెంట్‌లో పది జట్లు పోటీపడ్డాయి. టోర్నమెంట్ ఫార్మాట్ రౌండ్-రాబిన్ కు మార్చగా టాప్ 10 టీమ్స్ సెమీ ఫైనల్ చేరాయి.

ఆరు వారాల రౌండ్-రాబిన్ మ్యాచ్‌ల తర్వాత.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. నాకౌట్ దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ విజయాలు సాధించి ఫైనల్ చేరాయి. లార్డ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించిన తొలి వరల్డ్ కప్ ఫైనల్ గా నిలిచింది. అది కూడా టై అయింది. దీంతో ఎక్కువ బౌండరీలు బాదింది అంటూ ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఈ నిబంధనను ఐసీసీ తర్వాత తొలగించింది.

ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) - 86 నాటౌట్

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ – కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) - 578 పరుగులు, 2 వికెట్లు

146 ఏళ్ల క్రికెట్ చరిత్ర అసలు కాల పరిమితి అంటూ లేని టెస్టుల నుంచి టీ20 క్రికెట్ గా ఈ జెంటిల్మన్ గేమ్ మారుతూ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు జరగబోతున్న వరల్డ్ కప్ మా అంచనాలను అందుకోగలదని ఓ క్రికెట్ అభిమానిగా ఆశిస్తున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారత అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ మరోసారి ట్రోఫీ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను.

  • భూపాల్ రెడ్డి

తదుపరి వ్యాసం