Best of Ind vs Pak: కోహ్లి 183 నుంచి భజ్జీ సిక్స్ వరకు.. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ టాప్ 5 మ్యాచ్‌లు ఇవే
30 August 2023, 12:00 IST
- Best of Ind vs Pak: కోహ్లి 183 నుంచి భజ్జీ సిక్స్ వరకు.. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. వీటిలో టాప్ 5 మ్యాచ్‌లేంటో ఇప్పుడు చూద్దాం.
2012 ఆసియా కప్ లో పాకిస్థాన్ పై 183 రన్స్ బాదిన విరాట్ కోహ్లి
Best of Ind vs Pak: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటేనే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.
2014 ఆసియా కప్ - అఫ్రిది సిక్స్‌లు
2014 ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అసలుసిసలు మజా అందించింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 10 పరుగులు అవసరం కాగా.. అశ్విన్ బౌలింగ్ లో షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్స్ లు కొట్టి పాకిస్థాన్ ను గెలిపించాడు. అంతకుముందు 49వ ఓవర్లో భువనేశ్వర్ కేవలం 3 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో ఇండియా గెలుపు ఖాయమనుకున్నా.. అఫ్రిది మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 8 వికెట్లకు 245 రన్స్ చేసింది.
2010 ఆసియా కప్ - హర్భజన్ దెబ్బకు దెబ్బ
ఇండోపాక్ మ్యాచ్ లోని ఉద్రిక్తతలు, ప్లేయర్స్ లో గెలవాలన్న కసి ఎలా ఉంటుందో నిరూపించిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లోనే షోయబ్ అక్తర్, హర్భజన్ సింగ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ మ్యాచ్ లో 268 పరుగులు చేజ్ చేస్తున్న ఇండియాకు చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం అయ్యాయి. మహ్మద్ ఆమిర్ బౌలింగ్ లో స్ట్రైక్ లో ఉన్న హర్భజన్ ఏకంగా సిక్స్ కొట్టాడు. 3 వికెట్లతో ఇండియా ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకుంది. గెలవగానే అక్తర్ ను చూస్తూ భజ్జీ సంబరాలు చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో గంభీర్ 83, ధోనీ 56 రన్స్ చేశాడు.
2012 ఆసియా కప్ - కోహ్లి బెస్ట్ వన్డే ఇన్నింగ్స్
విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ వన్డేల్లో చేసిన అత్యధిక స్కోరు 183. ఈ ఇన్నింగ్స్ ఆడింది పాకిస్థాన్ పైనే కావడం విశేషం. 2012 ఆసియా కప్ లో భాగంగా 330 పరుగుల చేజింగ్ లో కోహ్లి ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఇది. ఈ మ్యాచ్ లో గంభీర్ డకౌట్ కాగా.. మూడోస్థానంలో వచ్చిన కోహ్లి.. సచిన్ తో కలిసి 133 పరుగులు జోడించాడు. సచిన్ 52 రన్స్ చేసి ఔటవగా.. తర్వాత వచ్చిన రోహిత్ కూడా 68 రన్స్ చేసి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సమయానికి వన్డేల్లో ఇండియాకు ఇదే అత్యుత్తమ చేజింగ్ కావడం విశేషం. కోహ్లి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్ అది.
2004 ఆసియా కప్ - పాకిస్థాన్ గెలిచినా..
2004 ఆసియా కప్ లో ఇండియాను 59 పరుగులతో పాకిస్థాన్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కు ఎంతో అవసరమైన బోనస్ పాయింట్ మాత్రం రాలేదు. ఆ పాయింట్ రావాలంటే 60 పరుగులతో గెలవాల్సి ఉండగా.. పాక్ సరిగ్గా 59 పరుగులతో గెలిచింది. చివరి బంతికి కుంబ్లే, బాలాజీ బైస్ ద్వారా రెండు పరుగులు తీయడంతో పాక్ ఆశ నెరవేరలేదు. ఆ మ్యాచ్ లో షోయబ్ మాలిక్ 143 రన్స్ చేయడంతోపాటు 2 వికెట్లు కూడా తీశాడు. అయినా పాక్ ఫైనల్ చేరలేదు. ఇండియా ఫైనల్ చేరినా శ్రీలంక చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2008 ఆసియా కప్ - సెహ్వాగ్ మెరుపులు
2008 ఆసియా కప్ లో సెహ్వాగ్ మెరుపులతోపాటు చివరికి ఇండియా కేవలం 2 పరుగులతో గట్టెక్కడం హైలైట్ గా చెప్పొచ్చు. మొదట వీరూ 80 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఇండియా 301 పరుగులు చేసింది. తర్వాత షోయబ్ మాలిక్ సెంచరీ, యూనిస్ ఖాన్ హాఫ్ సెంచరీతో ఈ టార్గెట్ ను పాక్ చేజ్ చేసినంత పని చేసింది. అయితే చివరికి 4 వికెట్లకు 299 రన్స్ దగ్గర ఆగిపోయి 2 పరుగులతో ఓడింది.