తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: బాదుడే..బాదుడు: భారత్ భారీ స్కోరు.. 2 సెంచరీలు.. 2 హాఫ్ సెంచరీలు.. ఆసీస్‍కు భారీ టార్గెట్

Team India: బాదుడే..బాదుడు: భారత్ భారీ స్కోరు.. 2 సెంచరీలు.. 2 హాఫ్ సెంచరీలు.. ఆసీస్‍కు భారీ టార్గెట్

24 September 2023, 19:00 IST

google News
    • IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. భీకర హిట్టింగ్‍తో ఆసీస్ బౌలర్లను కుమ్మేశారు భారత బ్యాటర్లు. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం ఉంది.
IND vs AUS: బాదుడే..బాదుడు: భారత్ భారీ స్కోరు.. రికార్డు నమోదు.. 2 సెంచరీలు.. 2 హాఫ్ సెంచరీలు
IND vs AUS: బాదుడే..బాదుడు: భారత్ భారీ స్కోరు.. రికార్డు నమోదు.. 2 సెంచరీలు.. 2 హాఫ్ సెంచరీలు (ANI)

IND vs AUS: బాదుడే..బాదుడు: భారత్ భారీ స్కోరు.. రికార్డు నమోదు.. 2 సెంచరీలు.. 2 హాఫ్ సెంచరీలు

IND vs AUS: టీమిండియా బ్యాట్స్‌మెన్ భీకర హిట్టింగ్ చేశారు. ఆస్ట్రేలియాతో నేడు (సెప్టెంబర్ 24) ఇండోర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు శుభ్‍మన్ గిల్ (97 బంతుల్లో 104 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105 పరుగులు) శతకాలతో సత్తాచాటారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 పరుగులు నాటౌట్) మెరుపు హిట్టింగ్ చేశాడు. ఓ దశలో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు సూర్య. కెప్టెన్ కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52 పరుగులు) కూడా అర్ధ శకతంతో రాణించాడు. అందరూ ఫోర్లు, సిక్సర్లతో మోతెక్కించారు. టీమిండియా ఆటగాళ్ల బాదుడుతో ఆస్ట్రేలియా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ రెండు, హేజిల్‍వుడ్, అబాట్, జంపా చెరో వికెట్ తీశారు. గ్రీన్ ఏకంగా 10ఓవర్లలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే చరిత్రలో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. భీకర బాదుడుతో ఈ రికార్డు నెలకొల్పింది టీమిండియా. దీంతో ఆస్ట్రేలియా ముందు 400 పరుగుల భారీ టార్గెట్ ఉంది.

గిల్, శ్రేయస్ అదుర్స్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ షో సాగింది. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 12.5 ఓవర్లలో భారత స్కోరు 100 పరుగులకు చేరింది. అర్ధ సెంచరీలు చేసుకున్న తర్వాత గిల్, అయ్యర్ మరింతగా చెలరేగారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో 29ఓవర్లలోపే 200 స్కోరు చేసింది భారత్. ఈ క్రమంలో 86 బంతుల్లోనే శ్రేయస్ అయ్యర్ శతకానికి చేరుకున్నాడు. వన్డేల్లో మూడో సెంచరీ బాదాడు. శుభ్‍మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీకి చేరాడు. ఆరో వన్డే శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే వీరు ఔటయ్యారు. రెండో వికెట్‍కు గిల్ - శ్రేయస్ ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

విజృభించిన సూర్య

గిల్, శ్రేయస్ అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (31) మోత కొనసాగించారు. అయితే, జంపా బౌలింగ్‍లో కిషన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ చెలరేగాడు. రాహుల్ కూడా దూకుడుగా ఆడాడు. దీంతో 40.1 ఓవర్లలోనే టీమిండియా స్కోరు 300 పరుగులు దాటింది. గ్రీన్ వేసిన 44 ఓవర్లో సూర్య వరుసగా నాలుగు సిక్సర్లు బాది దుమ్మురేపాడు. గ్రౌండ్ నలుమూలల హోరెత్తించాడు. 35 బంతుల్లో అర్ధ శతకం చేసిన రాహుల్.. కాసేపటికే ఔటయ్యాడు. అయితే, సూర్య మాత్రం చివరి వరకు అజేయంగా నిలిచి.. హిట్టింగ్ చేశాడు. ఏకంగా 24 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరి.. ఆ తర్వాత కూడా బాదుడు కొనసాగించాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 

తదుపరి వ్యాసం