తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. సరికొత్త రికార్డు.. తిప్పేసిన కుల్‍దీప్

IND vs PAK: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. సరికొత్త రికార్డు.. తిప్పేసిన కుల్‍దీప్

12 September 2023, 0:25 IST

google News
    • IND vs PAK: ఆసియాకప్ 2023 సూపర్-4 మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి పాక్‍ను కుప్పకూల్చాడు.
IND vs PAK: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. ఓ కొత్త రికార్డు.. తిప్పేసిన కుల్‍దీప్
IND vs PAK: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. ఓ కొత్త రికార్డు.. తిప్పేసిన కుల్‍దీప్ (AFP)

IND vs PAK: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. ఓ కొత్త రికార్డు.. తిప్పేసిన కుల్‍దీప్

IND vs PAK: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఆసియాకప్ 2023 సూపర్-4 మ్యాచ్‍లో పాక్‍పై ఏకంగా 228 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రిజర్వ్ డే అయిన నేడు (సెప్టెంబర్ 11) బ్యాటింగ్, బౌలింగ్‍లో అదరగొట్టి పాకిస్థాన్‍ను టీమిండియా బెంబేలెత్తించింది. శ్రీలంకలోని కొలంబో ఆర్.ప్రేమదాస మైదానంలో వర్షం ఆటంకాలు కలిగించినా చివరికి భారత్ 228 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‍పై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం (పరుగుల పరంగా..). ఇలా భారీ విజయంతో పాటు ఈ కొత్త రికార్డును నెలకొల్పింది రోహిత్‍సేన. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ (122 పరుగులు నాటౌట్), కేఎల్ రాహుల్ (111 పరుగులు నాటౌట్) అజేయ శతకాలతో అద్భుతంగా ఆడారు. 357 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 32 ఓవర్లలో కేవలం 128 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. గాయపడిన నసీమ్ షా, హరిస్ రవూఫ్ బ్యాటింగ్‍కు రాలేకపోవటంతో పాక్‍ను ఆలౌట్‍గా అంపైర్లు పరిగణించారు. భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ (5/25) ఐదు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‍ను కుప్పకూల్చాడు. జస్‍ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కింది. పాక్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేదు. పాకిస్థాన్ లైనప్‍లో ఫకర్ జమాన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ ఎలా సాగిందో ఇక్కడ చూడండి.

బ్యాటింగ్‍లో భారత్ భళా

మ్యాచ్ మొదలైన ఆదివారం (సెప్టెంబర్ 10) టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‍మన్ గిల్ (58) అర్ధ శతకాలు చేయటంతో మంచి ఆరంభం లభించింది. వీరు ఔటయ్యాక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. అయితే, 24.1 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లకు 147 పరుగులు చేయగా.. అప్పుడు వర్షం జోరుగా కురిసింది. దీంతో మ్యాచ్ రిజర్వ్ డే అయిన నేటికి (సెప్టెంబర్ 11) వాయిదా పడింది. వాన వల్ల నేడు కూడా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ కొనసాగించారు. ముందుగా నిలకడగా ఆడుతూనే ఆ తర్వాత దూకుడు పెంచారు. పాకిస్థాన్ బౌలర్లకు చెమటలు పట్టించారు. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన మ్యాచ్‍లోనే కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. 100 బంతుల్లో సెంచరీ మార్కు చేరుకొని.. సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇక క్రమంగా వీరుబాదుడు బాదిన విరాట్ కోహ్లీ 84 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో 47వ శతకాన్ని నమోదు చేశాడు. చివరి వరకు విరాట్, రాహుల్ రఫ్ఫాడించటంతో టీమిండియా రిజర్వ్ డే రోజు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. మొత్తంగా 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసి.. పాకిస్థాన్‍కు కొండంత టార్గెట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఏకంగా 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

కుప్పకూల్చిన కుల్‍దీప్

357 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ నిలువలేకపోయింది. ముందుగా భారత పేసర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా స్వింగ్ బౌలింగ్‍కు పాక్ బ్యాటర్లు బెంబేలెత్తారు. ఇమాముల్ హక్ (9)ను బుమ్రా ఔట్ చేయగా.. బాబర్ ఆజమ్ (10)ను పాండ్యా బౌల్డ్ చేశాడు. మహమ్మద్ రిజ్వాన్‍(2)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‍కు పంపాడు. దీంతో 11.4 ఓవర్లలోనే 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది పాకిస్థాన్. ఆ తర్వాత భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ రాకతో పాక్ బ్యాటర్లు వణికిపోయారు. కాస్త నిలకడగా ఆడిన ఫకర్ జమాన్‍ (27)ను ముందుగా పెవిలియన్ పంపిన కుల్‍దీప్ యాదవ్.. ఆ తర్వాత 24వ ఓవర్లో అఘ సల్మాన్‍ను ఔట్ చేశాడు. అనంతరం షాదాబ్ ఖాన్ (6) ఇఫ్తికార్ అహ్మద్ (23), ఫహీమ్ అష్రఫ్ (4)ను ఔట్ చేసి పాక్‍ను చావు దెబ్బ తీశాడు. ఇక పాక్ హరిస్ రవూఫ్, ససీమ్ షా గాయపడటంతో బ్యాటింగ్‍కు రాలేదు. దీంతో 32 ఓవర్లలో 128 పరుగులకే చాపచుట్టేసింది పాకిస్థాన్. 228 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో రేపు (సెప్టెంబర్ 12) మ్యాచ్ ఆడనుంది టీమిండియా.

తదుపరి వ్యాసం